ఏపీలో అసలు దేవాదాయ శాఖ ఉందా?: పవన్‌ - pawan kalyan fires on lord subrahmanyeswarswamy statue demolation issue
close
Published : 02/01/2021 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో అసలు దేవాదాయ శాఖ ఉందా?: పవన్‌

దేవుడి విగ్రహాల ధ్వంసాన్ని ఖండించిన జనసేనాని

అమరావతి: దేవుడి విగ్రహం ధ్వంసంతో ఏపీలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారని, ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బతీసేలా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. నగరంలోని శ్రీరాంనగర్‌ ప్రాంతంలో విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేతులను గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టడం కలకలం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తుంటారని చదువుతుంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నాం. రామ నామాన్ని జపించే పవిత్ర భూమి మనది. రామకోటి సభక్తికంగా రాసే నేల ఇది. దేశంలో రామాలయం లేని ఊరంటూ కనబడదు. రాముడిని ఆదర్శంగా తీసుకుంటాం. మన రాష్ట్రంలో ఆ భావనలను చెరిపివేయాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న ఘటనలు చూస్తుంటే పథకం ప్రకారమే దుశ్చర్యలకు తెగబడుతున్నారని పవన్‌ అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఒకరి మతవిశ్వాసాలను మరొకరు గౌరవించే సుహృద్భావ వాతావరణాన్ని కలిగించడంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందించడంలేదని విమర్శించారు. 

ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో శ్రీ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై సీఎం జగన్‌ స్పందన ఉదాసీనంగా వ్యవహరించారని ఆక్షేపించారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ ముఖ్యమంత్రి అనడాన్ని జనసేనాని తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు నేరాలను నిలువరించవన్నారు. బాధ్యులను ఇప్పటివరకు గుర్తించి ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. దేవుడిపై భారం వేసి ఆలయాలను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని పవన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి వరుస ఘటనలు చూస్తుంటే అసలు దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందా అనిపిస్తోందన్నారు. హిందూ దేవాలయాలపై సాగుతున్న దాడులను ఏ మత విశ్వాసాన్ని ఆచరించేవారైనా నిరసించాలన్నారు. అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు, రథాల దగ్ధాలను ఖండించాలని కోరారు. అప్పుడు మత సామరస్యం, లౌకిక వాదం పరిఢవిల్లుతాయని పవన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

విఘ్నేశ్వరస్వామి ఆలయంలో విగ్రహం ధ్వంసం 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని