3 రాజధానులతో అభివృద్ధి.. ఓ కలే!: పవన్‌ - pawan kalyan interview
close
Published : 23/07/2020 17:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 రాజధానులతో అభివృద్ధి.. ఓ కలే!: పవన్‌

 వికేంద్రీకరణ గురించి వైకాపా అప్పుడే చెప్పాల్సింది
 నాయకులే కరోనా అలా వచ్చి వెళ్లిపోతుందని చెప్పడమేంటి?

అమరావతి: తాము అధికారంలోకి వస్తే పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైకాపా చెప్పి ఉండాల్సిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అప్పుడే చెప్పి ఉంటే అమరావతి రాజధానికి రైతులు అన్ని ఎకరాలు భూమి ఇచ్చేవారు కాదేమోనని అన్నారు. అధికారంలోకి వచ్చి రకరకాల కారణాలు చెప్పి రాజధాని మారుస్తామనడం రైతులను వంచించడమేనని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రైతుల కన్నీరు పాలకులకు మంచిది కాదని హితవు పలికారు. ఈ మేరకు జనసేన సోషల్‌మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై పవన్‌ మాట్లాడారు.  రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో ఈ విధంగా స్పందిస్తున్నట్లు చెప్పారు.

మూడు రాజధానులూ ఓ కలే!
‘‘మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి మండలిలో ఆమోదం అవసరం లేదని ఆ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పంపింది. ఇప్పుడు నిర్ణయం కోసం అందరం వేచి చూస్తున్నాం. అప్పటి తెదేపా రాజధాని విషయంలో అంత భూమిని సేకరించడమే తప్పు. రైతుల దగ్గర నుంచి ఇన్ని భూములు తీసుకుని సింగపూర్‌ తరహా రాజధాని అన్నారు. అక్కడున్న వ్యవస్థ ఇక్కడ ఉన్నప్పుడే అది సాధ్యం. ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందని ఆనాడే చెప్పా. ఈ రోజు భూములిచ్చిన రైతులు నష్టపోతున్నారు. కాబట్టి వాళ్లకు జనసేన తరఫున అండగా ఉంటాం. కేవలం రాజధానులు విడగొట్టినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందనేది ఓ కాన్సెప్ట్‌ మాత్రమే. తెదేపా చెప్పిన సింగపూర్‌ కాన్సెప్ట్‌ లాంటిదే ఇది కూడా. ఒకవేళ భూముల విషయంలో అవకతవకలు జరిగి ఉంటే సరిచేసి ముందుకు వెళ్లాలి తప్ప.. ఇలా చేస్తే మరో నందిగ్రాం అయ్యే అవకాశం ఉంది’’ అని పవన్‌ హెచ్చరించారు. ‘‘తెదేపా- వైకాపా ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతున్నారు. వాళ్లు భూములిచ్చింది ఏపీ ప్రభుత్వానికి. అది దృష్టిలో పెట్టుకుని రైతులకు అందరూ అండగా నిలబడాలి. రాజధానిగా అమరావతిని ఆనాడు అందరూ అంగీకరించారు. 
వైకాపా అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఆ రోజే గనుక మేం మూడు రాజధానులనే నమ్ముతాం అని చెప్పి ఉంటే ఇన్ని వేల ఎకరాలను రైతులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు రకరకాల కారణాలు చెప్పి రాజధాని మారుస్తామంటే రైతులను వంచించనవాళ్లమవుతాం. రైతులని ఇబ్బందిపెట్టడం సరికాదు. వారి కన్నీళ్లు మంచిది కాదు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మనఃస్ఫూర్తిగానే ట్వీట్‌ చేశా..గానీ
‘‘ కరోనా అనేది ప్రపంచం మొత్తానికి వచ్చిన ఆపద. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల సంసిద్ధతతో ఉంటే దాని తీవ్రతను తగ్గించొచ్చు. దేశంలో రెండు నెలల పాటు విధించిన లాక్‌డౌన్‌ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. టెస్టింగ్ విషయంలో చాలా బాగా చేస్తున్నారని ఇటీవల మనః స్ఫూర్తిగానే ట్వీట్‌ చేశా. కానీ, పాజిటివ్‌ అని తేలిన తర్వాత రోగులు ఆస్పత్రికి వెళితే అక్కడ సరైన సదుపాయాలు ఉండడం లేదు. ఇంట్లో ఒక్కరికి వస్తే మిగిలినవారిని కూడా ఇంట్లోనే ఉండాలని యంత్రాంగం చెబుతోందని నా దృష్టికి వచ్చింది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది 
రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులే ‘అలా వచ్చి వెళ్లిపోతుంది’ అని అనడం సరికాదు. అదే జాగ్రత్తలు చెబితే క్షేత్ర స్థాయిలో సామాన్య జనానికి కూడా కరోనా తీవ్రత అర్థమవుతుంది’’ అని పవన్‌ అన్నారు.

ఇళ్ల పట్టాల్లో అవకతవకలు
‘‘కొన్ని చోట్ల ఒక ప్రైవేటు భూమి కొనాలంటే రూ.7 లక్షలో, రూ.8 లక్షలో ఉంటే.. దానికి నాలుగింతల నుంచి ఏడింతల వరకు ఎక్కువ పెట్టి కొనుగోలు చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలా అవకతవకలు జరిగాయని నా దృష్టికి వచ్చింది. కచ్చితంగా ఇళ్ళ పట్టాల వ్యవహారంలో చాలా అవకతవకలు జరిగాయి. దీనిని సరి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎవరైతే నిజమైన లబ్దిదారులో వారికే పట్టాలు అందించాలి. అవకతవకల్ని మాత్రం కచ్చితంగా అరికట్టాలి.’’

పార్టీ చూడొద్దు.. ఇళ్లు ఇవ్వండి..
‘‘గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు రూ.10 వేల కోట్లతో లక్షల ఇళ్లు నిర్మించారు. అవి నేటికీ లబ్ధిదారులకు అందకుండా ఉన్నాయి. కర్నూలు వెళ్లినప్పుడు, మంగళగిరి వెళ్లినప్పుడు వాటిని చూశాను. ఎక్కడికి వెళ్లినా వాటి గురించి నాకు వినతిపత్రాలు వస్తున్నాయి. సింగిల్ బెడ్ రూమ్ ఇంటికి రూ.50 వేలు కట్టినా ఇళ్లు రాలేదని మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని అడుగుతుంటే ‘మీరు మా పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని చెబుతున్నారు. డబ్బు కట్టిన నిజమైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని పవన్‌ డిమాండ్‌ చేశారు.

అందుకే చాతుర్మాస్య దీక్ష
‘‘రాష్ట్రంలో పరిస్థితులపై చర్చిస్తూ ఉంటే వివిధ వర్గాల ప్రజల ఈతిబాధలు నా దృష్టికి వచ్చాయి. అందుకే చాతుర్మాస్య దీక్షను కేవలం మన మనఃశ్శాంతి కోసం కాకుండా ప్రజలంతా బాగుండాలని మొదలుపెట్టా. 2003 నుంచి ఇది చేస్తున్నా. అంతకు ముందు అయ్యప్ప స్వామి మాల వేసుకొని దీక్ష చేసేవాణ్ణి. సినిమాలు చేస్తూ ఉండడం వల్ల అది బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉండడం వల్ల బయటకు వచ్చింది. 
సృష్టి స్థితికారకుడైన విష్ణుమూర్తి శయనించే కాలం ఇది. ఇలాంటి సమయంలోనే ఆయన భక్తులంతా, ఈ సంస్కృతిని గౌరవించేవారంతా చాతుర్మాస్య దీక్ష చేపడతారు. మఠాలు నడిపే యోగులు, సన్యాసం స్వీకరించిన వారు చేసే విధానం వేరు ఉంటుంది. గృహస్తు ధర్మంలో ఉన్న నేను కొన్ని ప్రమాణాలు పాటించి, ఒంటి పూట భోజనం చేస్తూ కింద పడుకోవడం చేస్తున్నా. కార్తీక మాసం వరకు ఈ దీక్ష కొనసాగుతుంది’’ అని పవన్‌ తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని