కొలతల్లో మాయ.. పాయింట్లలో మోసాలు - petrol bunks cheating customers at khammam
close
Published : 16/03/2021 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొలతల్లో మాయ.. పాయింట్లలో మోసాలు

వినియోగదారులను నిండా ముంచుతున్న బంకుల నిర్వాహకులు

ఇంటర్నెట్ డెస్క్‌: పెట్రోల్‌, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాహనాలను బయటకు తీయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌ బంకుల కాసుల కక్కుర్తి వాహనదారులకు మరో శాపంగా మారుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంధన కొలతల్లో మాయ, పాయింట్ల వారీగా మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో 202 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు రోజుకు సుమారు 2.5 లక్షల లీటర్ల వరకు ఉంటుంది. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో రోజుకు 3.9 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఉభయ జిల్లాల్లో తరచూ పెట్రోల్‌ బంకుల మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇంధన కొలతల్లో మాయ, పాయింట్ల వారీగా మోసాలు, పెట్రోల్‌, డీజిల్‌ తక్కువగా రావడం వంటి అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. రోజువారీ కూలీ నుంచి ఉద్యోగుల వరకు అంతా బంకుల మోసాలకు బలవుతున్నారు.

ఇటీవలే ఖమ్మం, వైరా, కూసుమంచి, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకుల్లో సాగుతున్న మోసాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఒక లీటర్‌ పెట్రోలు అమ్మితే రూ.3, డీజిల్‌ విక్రయిస్తే రూ.2కు పైనే బంకు నిర్వాహకులకు కమిషన్‌ ఉంటుంది. ఇది చాలదన్నట్లు కాసుల కక్కుర్తికి మరిగిన కొన్ని బంకుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బంకుల్లోని ఆటోమేటిక్‌ వ్యవస్థలోని యంత్రాల్లో చిప్‌లు పెట్టి కొలతల్లో భారీ వ్యత్యాసం వచ్చేలా చేస్తున్నారు. ప్రతి 1000 ఎమ్‌ఎల్‌ ఇంధనానికి 100 ఎమ్‌ఎల్‌ తక్కువగా వస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఇంధనం కొట్టే గన్నుల్లో చిప్‌ పెడుతున్నారు. రీడింగ్‌లో రూ.100 చూపించినా, చిప్‌ మాత్రం రూ.90తోనే ఆగిపోతుంది. బంకుల్లో భూగర్భ ట్యాంకుల నిర్వహణ సక్రమంగా లేక ఇంధనంలో నీటి ఛాయలు కనిపిస్తున్నాయి. పెట్రోల్‌తోపాటు నీళ్లు వస్తున్నాయంటూ వాహనదారులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. వాహనదారులు లీటర్ల చొప్పున పోయించుకోకపోవడం యజమానులకు కలిసివస్తోంది. 

పెట్రోల్‌ బంకుల నిర్వహణపై విధిగా తూనికలు, కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించాలి. బంకుల్లో మోసాలపై వినియోగదారులు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం వెనకు పెద్ద తతంగమే సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లకు అలవాటుపడ్డ శాఖల అధికారుల తీరుతోనే పెట్రోలు బంకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఉభయ జిల్లాల్లోని పెట్రోల్‌ బంకుల్లో జరగుతున్న మోసాలపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా పూర్తిస్థాయిలో దృష్టిసారించి తాము మోసపోకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని