భాజపా ముఖ్య నేతలతో ప్రధాని కీలక భేటీ!  - pm holds meeting with union ministers bjp chief
close
Published : 15/06/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా ముఖ్య నేతలతో ప్రధాని కీలక భేటీ! 

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై జోరుగా ఊహగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా కేంద్రమంత్రులు, కేంద్ర సహాయ మంత్రులతో గ్రూపుల వారీగా చర్చిస్తున్న ప్రధాని.. గత రెండేళ్లలో ప్రభుత్వ పనితీరును శాఖలవారీగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు నితిన్‌ గడ్కరీ, డీవీ సదానంద గౌడ, మురళీధరన్‌తో పాటు మరికొందరు ఉన్నారు. ప్రధాని అధికారిక నివాసమైన 7 - లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో జరుగుతున్న ఈ భేటీల్లో అత్యధికసార్లు జేపీ నడ్డా పాల్గొన్నట్టు తెలుస్తోంది.

గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రవిశంకర్‌ ప్రసాద్‌, జితేంద్రసింగ్‌తో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మోదీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ వెలువడలేదు. ఈ సమావేశాలన్నీ ఐదు గంటలకు పైగా జరిగినట్టు జరిగినట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, పశు సంవర్దకశాఖ, మత్స్య, గిరిజన వ్యవహారాలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, సాంస్కృతిక, పౌర విమానయాన, రైల్వే, ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, జలశక్తి, పెట్రోలియం, ఉక్కు, విదేశీ వ్యవహారాలు, పర్యావరణ శాఖల కేంద్రమంత్రులు/ సహాయమంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు సమాచారం. 2019 మే నెలలో రెండోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు జరగకపోవడం గమనార్హం. కేంద్రమంత్రి మండలిలో మొత్తం 79 మందిని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రస్తుతం రెండు డజన్లకుపైగా ఖాళీలు ఉన్నాయి. ఎన్నికలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గంలో తగిన మార్పులు చేసే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని