పంచ సూత్రాలతోనే కరోనా కట్టడి..! - pm modi reviews covid 19 situation
close
Published : 05/04/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంచ సూత్రాలతోనే కరోనా కట్టడి..!

ఉన్నతస్థాయి సమీక్షలో ప్రధాని మోదీ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతమవుతోన్న వేళ.. పంచ సూత్రాల అమలు వ్యూహంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కొవిడ్‌ కేసులు, మరణాలు 10రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో కరోనా నిబంధనలను ప్రజలు వందశాతం పాటించే విధంగా విస్తృత అవగాహన చేపట్టడంతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. దిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేబినెట్‌ సెక్రటరీ, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ‘టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్‌ వేగం పెంచడం’ వంటి పంచ సూత్రాల వ్యూహాన్ని అమలు పరచాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజ్‌ నిబంధనలను కచ్చితంగా, నిబద్ధతతో పాటించడం వల్ల కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. వీటి ప్రాధాన్యతను వివరిస్తూ ఏప్రిల్‌ 6నుంచి 14 తేదీ వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా ఆంక్షలు విధించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కాస్త అదుపు చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

57శాతం కేసులు, 47శాతం మరణాలు అక్కడే..!

దేశంలో కరోనా కేసులు, మరణాల్లో 91శాతం కేవలం పది రాష్ట్రాల నుంచే నమోదవుతుండడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా తీవ్రత పెరగడానికి మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించకపోవడమే కారణమని నిపుణుల నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. గడిచిన 14రోజులుగా దేశంలో నమోదవుతోన్న కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే అధికంగా ఉండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల్లో 57శాతం, మరణాల్లో 47శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలల్లో కేంద్ర వైద్య నిపుణుల బృందాలు పర్యటించాలని ప్రధానమంత్రి అధికారులకు సూచించారు. ఇదే సమయంలో దేశీయ అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీగా పెంచడంతోపాటు, వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేయాలని ప్రధానమంత్రి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ రోజువారీ కేసుల సంఖ్య 90వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో దాదాపు 50వేల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ అమలుకు సిద్ధమైంది. ఇక వారాంతంలో పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తామని పేర్కొంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని