భారత్‌-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్‌ - ponting shocked and could not comprehend how indias a team won series
close
Updated : 20/01/2021 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కీలక ఆటగాళ్లు దూరమైనా టీమిండియా చేతిలో పరాజయాన్ని చవిచూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ తెలిపాడు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌తో పటిష్ఠంగా ఉన్న తమ జట్టు స్వదేశంలో ఓటమిపాలవ్వడం ఎంతో కష్టంగా ఉందని అన్నాడు. గొప్ప పోరాట పటిమ చూపిన భారత ఆటగాళ్లు‌ విజయానికి అర్హులని పేర్కొన్నాడు. గాయాలతో ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా యువ భారత్‌ ఆస్ట్రేలియాను మట్టికరింపిచి బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీని 2-1తో సాధించిన విషయం తెలిసిందే.

‘‘ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలవకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓటమిపై ఎన్నో కారణాలు ఉన్నాయి. గత అయిదు వారాల్లో టీమిండియా పరిస్థితి చూస్తే.. కెప్టెన్ కోహ్లీ లేడు, గాయాలతో ఆటగాళ్లు దూరమయ్యారు. సిరీస్‌ను దాదాపు 20 మంది ఆటగాళ్లతో ఆడారు. మరోవైపు ఆస్ట్రేలియా ఎంతో పటిష్ఠంగా ఉంది. అయినా మేం ఓటమి పాలవ్వడం ఎంతో కష్టంగా ఉంది. ప్రతి టెస్టులో కీలకమైన సమయాల్లో టీమిండియానే పైచేయి సాధించింది. కానీ ఆస్ట్రేలియా సాధించలేకపోయింది. రెండు జట్ల మధ్య ఉన్న తేడా ఇదే. భారత్ గొప్పగా ఆడింది. విజయానికి వారే అర్హులు’’ అని పాంటింగ్ అన్నాడు.

జడేజా స్థానాన్ని భర్తీ చేసిన సుందర్‌ను పాంటింగ్‌ ప్రత్యేకంగా కొనియాడాడు. ‘‘వాషింగ్టన్‌ సుందర్‌ 50 టెస్టులు ఆడిన అనుభవజ్ఞుడిగా ఆడాడు. జట్టులో స్థానం కోసం ఆడినట్లుగా అనిపించలేదు. మరోవైపు తన కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్‌  ఏడు వికెట్లు తీసి 60కు పైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్‌ అనుభవం ఉన్న నాకు భారత్‌ సామర్థ్యం ఏంటో తెలుసు. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్‌ గెలవడం భిన్నమైనది’’ అని తెలిపాడు.

‘‘గత పర్యటనలో భారత్ విజయం సాధించినప్పుడు వార్నర్, స్మిత్ జట్టులో లేరు కాబట్టి ఓటమిపాలయ్యామనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆసీస్‌ పూర్తి సామర్థ్యంతో ఉంది. భారత్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు లేరు. నెట్ బౌలర్లతో మ్యాచ్‌ ఆడింది. విజయం సాధించింది కూడా. అదే ఆస్ట్రేలియాకు తీవ్ర బాధని కలిగిస్తోంది. ‘ఏ’ జట్టుతో బరిలోకి దిగి రెండు టెస్టులను భారత్‌ గెలిచింది. అది కూడా గబ్బాలో విజయం సాధించడం నమ్మలేకపోతున్నా’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.

తొలి టెస్టులో కోహ్లీసేన ఓటమిపాలైన తర్వాత పాంటింగ్‌ టీమిండియాను తక్కువగా అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత్ తిరిగి పుంజుకోవడం అసాధ్యమని, సిరీస్‌ 4-0తో ఆసీస్‌దే అని పేర్కొన్నాడు. అంతేగాక గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో తమ జట్టు డ్రా చేసిన ఓటమితోనే సమానమని, తప్పక గెలవాలని అన్నాడు. కానీ కంగారూల కంచుకోట అయిన గబ్బాలో భారత్ విజయకేతనం ఎగురవేసి ఆసీస్‌కు గర్వభంగం కలిగించింది.

ఇదీ చదవండి

కల లాంటింది.. నిజమైంది

భలే పంత్ రోజు..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని