ఇలా ‘ప్రసిద్ధ్‌’ చెందాలన్నదే కోరిక! - prasidh on debut krishna wants to be known as a hit-the-deck bowler
close
Published : 25/03/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలా ‘ప్రసిద్ధ్‌’ చెందాలన్నదే కోరిక!

పుణె: అవసరమైనప్పుడు భాగస్వామ్యాలు విడదీసే బౌలర్‌గా గుర్తించాలని అరంగేట్రం పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ భావిస్తున్నాడు. వికెట్‌పై బంతిని బలంగా విసిరే పేసర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.

ఈ మ్యాచులో తొలుత భారత్‌ 317 పరుగులు చేసింది. అయితే ఛేదనలో ఇంగ్లాండ్‌ గెలిచేలా కనిపించింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (46), జానీ బెయిర్‌స్టో (94) వీర విధ్వంసం సృష్టించడంతో 14 ఓవర్లకే 135 పరుగులు చేసింది. తొలుత తన మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చేసిన ప్రసిద్ధ్‌.. రాయ్‌ను ఔట్‌ చేసి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. మొత్తంగా 8.1 ఓవర్లు విసిరి 4/45తో నిలిచాడు. అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు.

‘ఆరంభం సరిగా లేదు. మేం సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు వేయకపోవడంతో వారు విధ్వంసకరంగా ఆడారు. కానీ మేం నమ్మకం కోల్పోలేదు. వరుసగా వికెట్లు తీయడంతో జట్టుకు మేలు జరిగింది. ఫుల్లర్‌ లెంగ్త్‌ బంతులు వేయొద్దని మూడో ఓవర్‌ తర్వాత అర్థం చేసుకున్నా. ఆ తర్వాత సరైన ప్రాంతాల్లో బంతులు విసిరి ఫలితం సాధించాను’ అని ప్రసిద్ధ్‌ కృష్ణ అన్నాడు. ఈ ఏడాది జరిగిన విజయ్‌ హజారెలో 7 మ్యాచులాడిన కృష్ణ 24.5 సగటుతో 14 వికెట్లు తీయడం గమనార్హం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తోనూ అతడికి మంచి అనుబంధం ఉంది.

‘ఐపీఎల్‌ నాకు సాయపడింది. అయితే 50 ఓవర్ల ఫార్మాట్లో బలంగా పుంజుకోవడం మరింత ముఖ్యం. బంతి బలంగా విసిరే బౌలర్‌గా నన్ను గుర్తించాలని కోరుకుంటాను. అలాగే సరైన ప్రాంతాల్లో నిలకడగా బంతులు విసురుతాను. నేను మరింత మెరుగవుతాను. భాగస్వామ్యాలు విడదీసే బౌలర్‌గా సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జట్టుకు ప్రతిసారీ అది అవసరమే. అందుకే ఆ పని చేయడం నాకు సంతోషం’ అని కృష్ణ తెలిపాడు. ఆరడుగులకు పైగా ఎత్తున్న ప్రసిద్ధ్‌ అదనపు బౌన్స్‌ రాబట్టడంలో మేటి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని