మీ మొబైల్‌ గాలిలో దీపం కాకుండా... - primary security changes to be done by users
close
Updated : 04/09/2020 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ మొబైల్‌ గాలిలో దీపం కాకుండా...

ఈ రక్షణ చర్యలు తీసుకోండి

మొబైల్‌ కోసం మంచి బ్యాక్‌ కవర్‌ కొన్నారు. స్క్రీన్‌ కోసం టెంపర్డ్‌ గ్లాసో, నానో గ్లాసో వేయించారు. అయితే ఇదంతా మొబైల్‌ కింద పడితే పాడవకుండా ఉండడం కోసం. మరి మీ మొబైల్‌? అందులోని మీ డేటా రక్షణ కోసం ఏం చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలకు చాలా మంది వద్ద సమాధానం ఉండదు. అగంతుకుల చేతికి మీ సమాచారం చేరకూడదన్నా, మొబైల్‌ రక్షణ ఉండాలన్నా ఇవన్నీ తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అలాగని దీనికోసం మీరు ఏవేవో సాఫ్ట్‌వేర్లు కొనక్కర్లేదు. మీ మొబైల్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న కొన్ని సెట్టింగ్స్‌ మార్చుకుంటే సరి. అవేంటో ఓ లుక్కేయండి..


ఫైండ్‌ మై డివైజ్‌

మొబైల్‌ ఎవరైనా దొంగిలించినా, చేయి జారి ఎక్కడైనా పడిపోయినా దొరకడం కష్టం అంటారు. అయితే పడిపోయిన/దొంగతనానికి గురైన వెంటనే స్పందిస్తే దొరికే అవకాశం ఉంది. దీని కోసం గూగుల్‌లో ఓ ఆప్షన్‌ కూడా ఉంది. అదే ఫైండ్‌ మై డివైజ్‌. మొబైల్‌లో ఈ ఆప్షన్‌లోకి వెళ్లి ఫైండ్‌ మై డివైజ్‌ అని క్లిక్‌ చేస్తే మీ మొబైల్‌ నుంచి రింగ్‌ వినిపిస్తుంది. అది మళ్లీ మరే ఆపేంతవరకు ఆగదు. దీని కోసం సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీలోకి వెళ్లండి. అక్కడ ఫైండ్‌ మై డివైజ్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే మంచిది. ఇలా ఆన్‌లో పెట్టిన ఫోన్‌ పొరపాటున పోతే... మీరు సిస్టమ్‌లో గూగుల్‌ ఫైండ్‌ మై డివైజ్‌ పేజీలోకి వెళ్లి.. మొబైల్‌ను లాగిన్‌ చేసిన జీమెయిల్‌తో లాగిన్‌ అవ్వండి. ఆ తర్వాత ఫైండ్‌ మై డివైజ్‌ సెక్షన్‌లోకి వెళ్తే... రింగ్‌, లొకేట్‌, వైప్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వైప్‌ క్లిక్‌ చేస్తే మీ మొబైల్‌లోని డేటా మొత్తం తుడుచుకుపోతోంది. లొకేట్‌ అంటే ఎక్కడ ఉందో మ్యాప్‌లో చూపిస్తుంది. రింగ్‌ క్లిక్‌ చేస్తే ఫోన్‌లో రింగ్‌ మోగుతుంది. అయితే ఇది పని చేయాలంటే ఇంటర్నెట్‌, జీపీఎస్‌ ఫోన్‌లో ఆన్‌లో ఉండటం తప్పనిసరి. మీకు చెందిన మరో ఫోన్‌లో ఫైండ్‌ మై డివైజ్‌ అనే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని కూడా పై ప్రక్రియ పూర్తి చేయొచ్చు. 


అన్‌నోన్‌ ఇన్‌స్టాల్‌

మీ స్నేహితుడి ఫోన్‌లో ఉన్న ఓ కొత్త యాప్‌ మీ ఫోన్‌లో లేదు. డౌన్‌లోడ్‌ చేద్దామంటే ప్లేస్టోర్‌లో ఆ యాప్‌ అందుబాటులో లేదు. అలాంటప్పుడు మీరేం చేస్తారు? ‘ఏముంది.. ఫ్రెండ్‌ ఫోన్‌లో ఉన్న ఏపీకే ఫైల్‌ను నా ఫోన్‌లోకి పంపించుకొని ఇన్‌స్టాల్‌ చేసుకుంటా’ అంటారా. అయితే మీరు కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. అలా ప్లే స్టోర్‌లో లేని యాప్స్‌ను వాడటం ప్రమాదకరం. మామూలుగా అయితే అలా మీరు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్న యాప్‌ను వాడినప్పుడు గూగుల్‌ ఓ వార్నింగ్‌ ఇస్తుంది. ‘ఈ యాప్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేయలేదు.. వాడొద్దు’ అని చెబుతుంది. ఇలా వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ అవ్వడానికి అనుమతి ఇవ్వొద్దని మొబైల్‌ నిపుణులు చెబుతుంటారు. 


ఎమర్జెన్సీ ఇన్ఫో

ఇది చాలా చిన్న ఆప్షన్‌. కానీ ముఖ్యమైన ఆప్షన్‌. మీకు ఇంటి నుంచి బయటకు వెళ్లాక పొరపాటున ఏమైనా జరిగితే.. అందరూ ముందుగా చూసేది మీ మొబైల్‌నే. అందులో మీ ఇంటి/బంధువుల కాంటాక్ట్‌ నెంబరు తీసుకొని ఫోన్‌ చేయాలని చూస్తారు. మీ ఫోన్‌ లాక్‌లో ఉంటుంది కాబట్టి.. వాళ్లకు సమాచారం దొరకదు. అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఇన్ఫో బాగా ఉపయోగపడుతుంది. మీ మొబైల్‌ లాక్‌స్క్రీన్‌ మీద ఈ సమాచారం కనిపిస్తుంది. అందులో మీ సమాచారం ఇవ్వాల్సిన వారి పేరు, మొబైల్ నెంబరు లాంటివి రాసుకోవడం మంచిది. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్పారు కాబట్టి.. ఎమర్జెన్సీ ఇన్ఫో పెట్టి చూడండి. దీని కోసం సెట్టింగ్స్‌లోని అబౌట్‌ ఫోన్‌లోకి వెళ్లండి. అక్కడ ఎమర్జెన్సీ ఇన్ఫో అని ఉంటుంది. అందులో నోట్‌ చేసుకోవచ్చు. కొన్ని మొబైల్స్‌లో అయితే లాక్‌స్క్రీన్‌ ఆప్షన్‌లో ఈ ఫీచర్‌ ఉంటుంది.


మేనేజ్‌ యాప్‌ పర్మిషన్స్‌

ప్లేస్టోర్‌ నుంచి ఏదైనా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఓపెన్‌ చేసినప్పుడు కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. యాప్‌ వాడాలనే ఆలోచనలో వాటన్నింటికీ సరే సరే అంటూ ఓకే క్లిక్‌ చేసేస్తాం. అయితే ఆ యాప్‌కు ఆ పర్మిషన్‌ అవసరమా అని చాలా మంది ఆలోచించరు. భద్రత విషయానికొచ్చేసరికి ఇది చాలా ముఖ్యం. దీన్ని చెక్‌ చేసుకోవడం చాలా సులభం. మొబైల్‌లోని సెట్టింగ్స్‌కి వెళ్తే పర్మిషన్‌ మేనేజర్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. (ఇది ఒక్కో మొబైల్‌లో ఒక్కో ఆప్షన్‌లో ఉంటుంది) అందులోకి వెళ్లి ప్రతి యాప్‌ను ఓపెన్‌ చేసి ఏయే పర్మిషన్లు తీసుకుందో తెలుసుకోవచ్చు. ఆ యాప్‌కు ఆ పర్మిషన్‌ అక్కర్లేదు అని మీకు అనిపిస్తే ‘డినై’ చేసేయొచ్చు. అలా కాకుండా యాప్‌ మీద లాంగ్‌ ప్రెస్‌ చేస్తే యాప్‌ ఇన్ఫో అని వస్తుంది. అందులో కూడా పర్మిషన్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 


సేఫ్‌ బ్రౌజింగ్‌

మొబైల్‌లో ఏదైనా సమాచారం వెతకాలి అంటే ఠక్కున గుర్తొచ్చే యాప్‌ గూగుల్‌ క్రోమ్‌. ఇందులో మీరు సెర్చ్‌ చేసే డేటా సేఫ్‌గా ఉండాలంటే... మీ బ్రౌజింగ్‌ విధానమూ సేఫ్‌గా ఉండాలి. పొరపాటున లేదా సాధారణ సెర్చ్‌లో ఇబ్బందికరమైన/ప్రమాదకరమైన వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినప్పుడు మీకు తెలిపేలా క్రోమ్‌లో ఓ ఆప్షన్‌ ఉంది. దాని పేరే సేఫ్‌ బ్రౌజింగ్‌. సాధారణంగా అన్ని మొబైల్స్‌లో ఈ ఆప్షన్‌ డీఫాల్ట్‌గా ఆన్‌లోనే ఉంటుంది. ఒకసారి చెక్‌ చేసుకోవాలంటే.. క్రోమ్‌ యాప్‌లో టాప్‌లో కుడివైపున ఉన్న మూడు చుక్కల మెనూ క్లిక్‌ చేయండి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్తే సింక్‌ అండ్‌ గూగుల్‌ సర్వీసెస్‌ అని ఉంటుంది. అందులో సేఫ్‌ బ్రౌజింగ్‌ ఆన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. 


యూఎస్‌బీ డిబగ్గింగ్‌

‘నీ ఫోన్‌ ఒకసారివ్వు కొత్త యాప్‌ వేసిస్తా’ అంటూ ఎవరైనా మిమ్మల్ని అడిగారా? అలా అడిగి మొబైల్‌ను సిస్టమ్‌కు కనెక్ట్‌ చేశారా? ఇలాంటి వాటికి ఆస్కారమివ్వొద్దు. ఈ పనిని యూఎస్‌బీ డిబగ్గింగ్‌ ద్వారా చేస్తారు. మీ మొబైల్‌లో ఈ ఆప్షన్‌ ఎనేబుల్‌లో ఉంటే డేటా కేబుల్‌తో మీ మొబైల్‌ను సిస్టమ్‌కు కనెక్ట్‌ చేసి ప్రమాదకర యాప్స్‌ను కూడా ఇన్‌స్టాల్‌ చేసే అవకాశం ఉంది. ఈ ఆప్షన్‌ సాధారణంగా ఆఫ్‌లోనే ఉంటుంది. అందులో డెవలపర్‌ ఆప్షన్‌ ఆన్‌ చేసినవారికి మాత్రమే కనిపిస్తుంది. ఎలాగూ ఆ ఆప్షన్‌ డీఫాల్ట్‌గా ఆఫ్‌లోనే ఉంటుంది కాబట్టి.. దీన్ని ఆన్‌ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు. 


గూగుల్‌ సెక్యూరిటీ చెకప్‌

ఇది పూర్తిగా మొబైల్‌ డివైజ్‌కు సంబంధించిన ఆప్షన్‌ కానప్పటికీ.. మీ మొబైల్‌ రక్షణకు బాగా ఉపయోగపడుతుంది. గూగుల్‌ అకౌంట్‌కు రక్షణ కల్పిస్తే.. మొబైల్‌ను కూడా రక్షించుకున్నట్లే. దీని కోసం సెట్టింగ్స్‌ యాప్‌లోని గూగుల్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ‘మేనేజ్‌ యవర్‌ గూగుల్‌ అకౌంట్‌’ ఆప్షన్‌లోకి వెళ్తే సెక్యూరిటీ అని ఉంటుంది. మీ జీమెయిల్‌ ఖాతాకు ఏవైనా రక్షణపరమైన సమస్యలు ఉంటే అక్కడ కనిపిస్తాయి. అప్పుడు ‘సెక్యూర్‌ అకౌంట్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే గూగుల్‌ మీకు కొన్ని సూచనలు చేస్తుంది. వాటిని అనుసరిస్తే మీ అకౌంట్‌ను హ్యాకర్ల బారి నుంచి రక్షించుకోవచ్చు. టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ లాంటివి అందులో ఒకటి. 


లాక్‌డౌన్‌ మోడ్‌

కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ అనే పదం చాలా పాపులర్‌ అయిపోయింది. మీ మొబైల్‌లో కూడా అలాంటి ఓ ఆప్షన్‌ ఉంది తెలుసా? మీ ఫోన్‌కు మరింత భద్రతనిచ్చేలా ఆండ్రాయిడ్‌ ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ‘ఆండ్రాయిడ్‌ పై’ ఆ పై వెర్షన్ల ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)తో పని చేసే ఫోన్లలో ఈ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఆన్‌ చేసుకుంటే మీ మొబైల్‌కు మరింత రక్షణ కలుగుతుంది. లాక్‌డౌన్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేస్తే మొబైల్‌లో నోటిఫికేషన్లు లాక్‌ స్క్రీన్‌ మీద కనిపించవు. అలాగే ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌ లాంటివి కూడా పని చేయవు. పిన్‌/పాస్‌వర్డ్‌తో మాత్రమే అన్‌లాక్‌ చేయొచ్చు. దీని కోసం మొబైల్‌లోని సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి. డిస్‌ప్లేలోని లాక్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ సెట్టింగ్స్‌ ఐకాన్‌ క్లిక్‌ చేస్తే షో లాక్‌డౌన్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 


గూగుల్‌ ప్లే ప్రొటక్ట్‌

అవసరం కోసం రకరకాల యాప్స్‌ ప్లే స్టోర్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేస్తుంటారు. వాటిలో ఏదైనా వైరస్‌/మాల్‌వేర్‌ ఉందేమో అనే అనుమానం మీకెప్పుడైనా కలిగిందా? అయితే ఓసారి చెక్‌ చేసుకోండి. దీని సెట్టింగ్స్‌ యాప్‌లోని సెక్యూరిటీలోకి వెళ్లండి. అందులో గూగుల్‌ ప్లే ప్రొటక్ట్‌ ఓపెన్‌ చేస్తే ప్లే స్టోర్‌లోకి వెళ్తుంది. అందులో స్కాన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే మీ మొబైల్‌లోని యాప్స్‌ను స్కాన్‌ చేస్తుంది. ఏదైనా మాల్‌వేర్‌ ఉన్న యాప్‌ ఉన్నట్లుగా గుర్తిస్తే ఆ విషయాన్ని మీకు చెబుతుంది. అప్పుడు మీరు ఆ యాప్‌ను డిలీట్‌ చేసేయొచ్చు. సాధారణంగా ఈ ఆప్షన్‌ అందరికీ డీఫాల్ట్‌గా ఆన్‌లోనే ఉంటుంది. లేకపోతే ఆన్‌ చేసుకోవచ్చు. 


లాక్‌ స్క్రీన్‌

‘రోజంతా వాడే ఫోన్‌... పదే పదే అన్‌లాక్‌ చేయాలా’ ఇలా మీకూ అనిపిస్తోందా? అయితే ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లే. పొరపాటున కూడా ఎవరూ మీ ఫోన్‌ వాడకూడదు.. అందులోని సమాచారం బయటకు వెళ్లకూడదు అనుకుంటే లాక్‌స్క్రీన్‌ తప్పనిసరి. ప్రస్తుతం మొబైల్స్‌ ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌, పిన్‌, ప్యాటర్న్‌ ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీలోకి వెళ్లండి. అందులో స్క్రీన్‌ లాక్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే వివిధ లాక్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి. మొబైల్‌ను వాడకుండా ఎంతసేపు వదిలేస్తే ఆటోమేటిక్‌గా లాక్‌ పడాలి అనేది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు.

గమనిక: ఆండ్రాయిడ్ మొబైల్స్ కి మాత్రమే ఈ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. పై ఆప్షన్లు ఒక్కో ఫోన్‌లో ఒక్కో సెక్షన్‌లో ఉంటాయి. స్టాక్‌ ఆండ్రాయిడ్‌, దానికి దగ్గరగా ఉండే వన్‌ప్లస్‌ ఫోన్లను బేస్‌ చేసుకొని ఈ ఆప్షన్లు రాశాం. సెట్టింగ్స్‌లో సెర్చ్‌లో వెతికి మీకు కావాల్సిన ఆప్షన్‌ను పొందొచ్చు.


- ఇంటర్నెట్‌ డెస్క్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని