రైతుల ఆందోళనలు..భారత్‌ అంతర్గత వ్యవహారమే! - protest internal issue of india british govt
close
Published : 05/03/2021 22:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతుల ఆందోళనలు..భారత్‌ అంతర్గత వ్యవహారమే!

స్పష్టంచేసిన బ్రిటన్‌ ప్రభుత్వం

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై బ్రిటన్‌ ప్రభుత్వం స్పందించింది. రైతుల నిరసనల వ్యవహారం దేశ అంతర్గత సమస్య అని, వాటిని భారత ప్రభుత్వమే పరిష్కరించుకుంటుందని బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. భారత్‌లో జరుగుతోన్న రైతుల నిరసనల అంశం అక్కడి‌ పార్లమెంటులో చర్చకు రానున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది. ఈ అంశంపై సోమవారం బ్రిటన్‌ పార్లమెంట్‌లో చర్చ జరగనుంది.

‘రైతుల నిరసనల అంశం భారత్‌ అంతర్గత సమస్యేనని బ్రిటన్‌ ప్రభుత్వం అభిప్రాయం. వాటిని పరిష్కరించుకోవడం పూర్తిగా భారత్‌ చేతుల్లోనే ఉంది’ అని భారత్‌లోని బ్రిటన్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లీస్‌ స్పష్టంచేశారు. బ్రిటన్‌ పార్లమెంట్‌ నియమాల ప్రకారం, ఈ-పిటిషన్‌ దాఖలైనందువల్ల వాటిని చర్చించక తప్పదని.. వివిధ అంశాలపై ఇలా చర్చ జరపడం సాధారణ ప్రక్రియేనని పేర్కొన్నారు.

భారత్‌లో జరుగుతోన్న వ్యవసాయ చట్టాలపై చట్టసభ సభ్యులు చర్చ జరపాలంటూ బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఈ-పిటిషన్‌ దాఖలయ్యింది. నిబంధనల ప్రకారం, ఏదైనా సమస్యపై లక్షకు పైగా సంతకాలతో కూడిన వినతి వస్తే, ఆ అంశంపై అక్కడి పార్లమెంట్‌ చర్చిస్తుంది. ఇందులో భాగంగానే ‘నిరసనకారుల రక్షణ, పత్రికా స్వేచ్ఛ కాపాడాలని భారత్‌కు విజ్ఞప్తి’ అంటూ అక్కడి పార్లమెంటులో ఈ-పిటిషన్‌ దాఖలైంది. రైతుల ఆందోళనలపై వేసిన ఈ-పిటిషన్‌కు లక్ష సంతకాల మద్దతు రావడంతో దీనిపై చర్చించేందుకు బ్రిటన్‌ పార్లమెంట్‌ సిద్ధమయ్యింది. సోమవారం జరిగే ఈ చర్చ 90నిమిషాల పాటు కొనసాగనుంది.

ఇదిలాఉంటే, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గత మూడు నెలలుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వీటిపై ఏర్పడ్డ ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం-రైతు సంఘాల మధ్య 11 దఫాల్లో చర్చలు జరిగాయి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని