అమ్మాయిల గురించి.. పూరీ ఎంత బాగా చెప్పారో..! - puri jagannadh about girls mindset
close
Updated : 23/09/2020 06:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మాయిల గురించి.. పూరీ ఎంత బాగా చెప్పారో..!

‘వీళ్లకి పక్కింటి అబ్బాయిలు సరిపోరు’

‘అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోండి..’

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మరోసారి తన మాటలతో శ్రోతల్ని ఆకట్టుకున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా ‘పూరీ మ్యూజింగ్స్‌’ పేరుతో పలు అంశాల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘అమ్మాయిలు’ ఎలా ఆలోచిస్తారు, జీవిత భాగస్వామి విషయంలో వారి అంచనాలేంటి తదితర విషయాల గురించి ముచ్చటించారు. ‘అమ్మాయిలు ఎప్పుడూ కలల్లో బతుకుతారు. వాస్తవానికి దూరంగా డ్రీమ్స్‌లో ఉంటారు. తల్లిదండ్రులు రాకుమారిలా పెంచుతారు. నిజంగానే తను ‘క్లియో పాత్ర’ అనుకుంటుంది. ఆ తర్వాత ఓ ఎదవ తగులుతాడు.. ‘నువ్వు నా దేవతవి’ అంటాడు. అది ఇంకా నిజం అనుకుంటుంది. సాధారణంగా అమ్మాయిలకి మంచి లాజికల్‌ బ్రెయిన్‌ ఉంటుంది. భద్రత చూసుకుంటారు, రిస్క్‌లు చేయరు. ఎక్కువ ప్రేమిస్తారు, ఫీల్‌ అవుతారు.. ఫేస్‌ రీడింగ్‌ బాగొచ్చు. ఇలా అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి. కానీ పొగడ్తలకు పడిపోతారు. అనుక్షణం పొగడ్తల కోసం ఎదురుచూస్తుంటారు’.

‘పాపం అబ్బాయిలు పక్కింటి అమ్మాయిలతో సర్దుకుపోతారు. కానీ వీళ్లకి పక్కింటి అబ్బాయిలు సరిపోరు. ఎప్పుడూ సినిమా హీరోలే కావాలి. సిక్స్‌ప్యాక్‌ ఉండాలి, ఆరడుగులు ఉండాలి. ప్రపంచమంతా వాడిని చూసి భయపడాలి. అలాంటి వాడు రాత్రి వీళ్ల కాళ్లుపట్టాలి. దీన్నే ఓవర్‌ యాక్షన్‌ అంటారు. మీరు సిక్స్‌ప్యాక్‌ ఎదవను పెళ్లి చేసుకున్నా.. సంసారం అనే బండి చక్రంలో పడి ఆరునెలలు తిరగకుండా వాడికి ఇంత పెద్ద పొట్ట వస్తుంది. దానికి తోడు వాడికి తిండంటే ఇష్టముంటే మూడొంతుల మంచం వాడే నొక్కేస్తాడు. ఈ రోజు ఎంజెల్‌లా ఫీల్‌ అయ్యే అమ్మాయిలందరూ ఒకరోజు అలాంటి వాడితో జీవించాల్సిందే. రాత్రుల్లో వాడి గురక తట్టుకోలేక అమ్మానాన్నల దగ్గరికి వెళ్లిపోవాలి అనిపిస్తుంది. కానీ వెళ్లలేరు, ఇది నిజం’.

‘ఈ కాలం అమ్మాయిలకు నేను చెబుతున్నా.. సిక్స్‌ప్యాక్‌ కోసం వెతకొద్దు, ధనవంతుడి కోసం ఎదురుచూడొద్దు. స్టైల్‌ కంటే సౌకర్యంగా ఉండే దుస్తులు ఎంచుకోండి. హీల్స్‌, లిప్‌స్టిక్స్‌‌ తగ్గించండి. మిమ్మల్ని మీరు మరోలా ప్రపంచానికి చూపించొద్దు. జీవితంలో మీ శత్రువు ఒక మగాడు అవ్వాలే కానీ.. మరో ఆడది కాకూడదు. ఎందుకంటే ఆడదైతే.. సగం జీవితం వారితో శత్రుత్వానికే సరిపోతుంది. ఈ మగ ఎదవలు ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి. వాళ్లతో పోటీ పడండి. బాగా చదివి ఉద్యోగమో, వ్యాపారమో మొదలు పెట్టండి. స్వేచ్ఛగా ఎదగండి. ఇవన్నీ ఉంటే మగ తోడు అవసరం ఉండదు. మీ కాళ్లపై మీరు నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. మీరు చెప్పే ప్రతి మాట వినే భర్త వద్దు, అసలు మాట వినని వెదవ కూడా మనకొద్దు. కొంచెం విని, కొంచెం వినని వ్యక్తిని చేసుకోండి. మీ మూడ్‌ బాగోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సూచనలు ఇచ్చేవాడై ఉండాలి. కొంచెం మంచోడు, సీరియస్‌గా పనిచేసుకునేవాడైతే సరిపోతుంది. నువ్వు (అమ్మాయిల్ని ఉద్దేశిస్తూ) రాకుమారివి కాదు, మనకు మాహిష్మతి సామ్రాజ్యం వద్దు, బాహుబలి అసలు వద్దు. ఈ మాట గుర్తుపెట్టుకోండి..’ అని పూరీ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. దీనికి యూట్యూబ్‌లో తెగ కామెంట్స్‌ వచ్చాయి. సరిగ్గా చెప్పారని నెటిజన్లు మెచ్చుకున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని