Puri Jagannadh: పెళ్లి అనేది వాళ్ల లిస్ట్‌లో ఉండదు - puri musings by puri jagannadh on minimalism
close
Published : 07/05/2021 19:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Puri Jagannadh: పెళ్లి అనేది వాళ్ల లిస్ట్‌లో ఉండదు

హైదరాబాద్‌: బంధాలు, అనుబంధాలు, సమాజం, ప్రకృతి, టాలెంట్‌.. ఇలా చెప్పుకొంటూ వెళ్తే ఎన్నో విభిన్నమైన అంశాలపై ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా తన అభిప్రాయాలను బహిర్గతం చేశారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి తన మాటలతో నెటిజన్లను ఆలోచింపచేసిన ఆయన కొన్ని నెలల విరామం తర్వాత మరోసారి ‘పూరీ మ్యూజింగ్స్’తో తనదైన శైలిలో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ‘మినిమలిజం’ అనే అంశం గురించి వివరించారు. ఆ విశేషాలు మీకోసం..

‘‘మినిమలిజం’ అంటే అనవసరమైన దాన్ని దూరం పెట్టడం. దీనినే సింప్లిసిటీగా చెప్పుకోవచ్చు. మినిమలిజం ఫాలో అయ్యేవాళ్లని చూస్తే.. కావాల్సిన దాన్ని మాత్రమే వాళ్లు తమ దగ్గర ఉంచుకుంటారు.  వాళ్లింట్లో కూడా కావాల్సిన వస్తువులు మాత్రమే ఉంటాయి. బీరువాలో కేవలం ఏడు జతల దుస్తులే ఉంటాయి. కానీ, మన ఇళ్లల్లో బీరువా తెరవగానే గుట్టలు గుట్టలుగా దుస్తులు వచ్చి మన కాళ్లపై పడిపోతాయి. సింపుల్‌గా బతకడం మనకి రాదు. మినిమలిస్ట్‌ దగ్గర ఒక ఫోన్‌ ఉంటే అది పనిచేసినంత కాలం దాన్నే వాడతాడు. అంతేకానీ మార్కెట్‌లోకి వచ్చిన ప్రతీ వస్తువు కొనుక్కుంటూ పోడు. వీలైనంత చిన్న ఇంటిలోనే నివసిస్తాడు. అసలు ఇల్లు ఎంత ఉండాలంటే ఆ ఇంట్లో ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు తడిగుడ్డ పెట్టి తుడుచుకునేంత విస్తీర్ణంలోనే ఉండాలి. కానీ, తుడవలేనంత పెద్ద ఇంట్లో ఉండాలని మనందరికీ ఉంటుంది. నలుగురు పనోళ్లు, నలుగురు డ్రైవర్లు, ఒక తోటమాలి, ఒక వాచ్‌మెన్‌, ఒక కుక్‌, గిన్నెలు శుభ్రం చేయడానికి ఒకరు. ఇలా మినిమలిస్ట్‌లకు పనోళ్లు ఉండరు. అందుకే మినిమలిస్ట్‌ని చూసి మనం నేర్చుకోవాలి. లెస్‌ ఈజ్‌ మోర్‌ అని వాళ్లు భావిస్తుంటారు. అలాగే వాళ్ల ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా చిన్నగా ఉంటాయి. దొరికింది కదా అని ఊరంతా అప్పులు చేయరు. ఉన్నదాంతో వాళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. జీవితాన్ని వీలైనంత వరకూ సాధారణంగా చేసుకుంటూ పోతారు. వాళ్ల దగ్గర అనవసరమైన వాటి గురించి ఒక లిస్ట్‌ ఉంటుంది. అందులో పెళ్లి కూడా ఉంటుంది. పెళ్లి.. ఈ ఒక్కటి కమిట్‌ అయితే మినిమలిజం లేదు. గాడిద గుడ్డూ లేదు. నదిలోకి దూకేసినట్టే. కొట్టుకుపోతూ ఉంటాం. ఎక్కడ ఆగుతామో ఎవ్వరికీ తెలీదు’’

‘‘అలా నదిలోకి దూకరు కాబట్టే మినిమలిస్ట్‌లు ఎంతో సంతోషంగా ఉంటారు. తక్కువ బాధలు, తక్కువ ఒత్తిడితో జీవిస్తారు. వాళ్లు బంధాలకు ఎక్కువ విలువ ఇవ్వరు. కానీ అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని వాళ్లు బాగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. వాళ్లు ఎవ్వరికీ భారంగా మారారు. అలాగే వేరేవాళ్ల బరువుని వాళ్లు తీసుకోరు. అందుకే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. మినిమలిస్ట్‌లు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడతారని అందరికీ ఒక అపోహ ఉంది. అది నిజం కాదు. వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు. అలాగే వేరేవాళ్లని ఇబ్బంది పెట్టరు. వాళ్లు త్యాగాలు చేయరు. ఒక్కసారి పాతకాలంలో చూసుకుంటే రాజులందరూ ఎన్నో యుద్ధాలు చేసి తమ రాజ్యాన్ని విస్తరించుకున్నాక వాళ్లకి వచ్చే జ్ఞానమే మినిమలిజం. బుద్ధ ఒక మినిమలిస్ట్‌. జీవితంలో ఎంత విజయం సాధించినా చివరికి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది మినిమలిజం. అది ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే మంచిది’’ అని పూరీ వివరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని