close

తాజా వార్తలు

Published : 24/11/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఈక్యూతో ఆనందం’: పూరీ జగన్నాథ్‌

హైదరాబాద్‌: ఐక్యూ చాలా మందికి ఉంటుంది. ఈక్యూ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈక్యూ అంటే భావోద్వేగ భావం. దానినే హావభావాల తెలివి అని అంటారు. అని పూరీ జగన్నాథ్‌ అన్నారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌’ గురించి మాట్లాడారు. 

‘ఈక్యూ అనేది మనలోని హావభావాలను అర్థం చేసుకొని, నిలువరించుకోవాలి. ఈక్యూ కలిగిన వాళ్లు మంచి నాయకులవుతారు. 
ఇందులో నాలుగు రకాలు ఉంటాయి. మనకి మనం అవగాహన కలిగి ఉండటం, మనల్ని మనం నిలువరించుకోవటం, సామాజిక అవగాహన కలిగి ఉండటం, సత్సంబంధాలు కలిగి ఉండటం. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన భావోద్వేగాలు, అభిరుచులు, బలాలు, బలహీనతలు మనకి తెలియకుండా మనల్ని ముందుకు నడిపిస్తుంటాయి. అందుకే మనల్ని మనం గమనించుకోవాలి’. అని పూరీ అన్నారు.

‘ఎదుటి వాళ్లతో నువ్వు ఎలా ఉంటావు? వాళ్లని ఎలా పలకరిస్తున్నావు? వాళ్లతో ఎలా మాట్లాడుతున్నావు? అనే విషయాలను గుర్తించుకోవాలి. వాళ్లతో మన మాట తీరు ఎలా ఉందో గమనించాలి. అలాగే ఒత్తిడికి గురిచేసే పరిస్థితులలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఒత్తిడికి లోనవుతున్నామా? లేదా గట్టిగా అరుస్తున్నామా? ఏడుస్తున్నామా? అనే వాటిని మనల్ని మనం గుర్తించలేకపోయినా, ఎదుటివాళ్లు మాత్రం తప్పకుండా గమనిస్తుంటారు. అందుకే మనం ఏంటో మనకి తెలియాలి’.అని ఆయన అన్నారు.

‘సమస్య తలెత్తినప్పుడు దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావు అనే విధానాన్ని అంచనా వేస్తారు. పని ప్రదేశంలో సైతం నిశ్శబ్దంగా ఉండటం, ఎదుటి వాళ్లు చెప్పిందే వినటం చాలా ముఖ్యం. పొరపాటు జరిగితే ఎప్పుడూ తప్పించుకోకూడదు. దానికి బాధ్యత వహించాలి. ముఖ్యంగా కొలీగ్స్‌ను ఎదుర్కొనేటప్పుడు తాదాత్మ్యాన్ని ప్రదర్శించాలి. అదే నాయకత్వ లక్షణం. అలాగే వారి నుంచి అభిప్రాయాలను సేకరించాలి’. అని ఆయన చెప్పారు.

‘నేను చేసేది సరైనదా? కాదా? అని అడిగితే వాళ్లు ఇంకా ఏమైనా చెప్పచ్చు. అలాగే మనలో ఉన్న చెడు భావోద్వేగాలను తగ్గించుకోవాలి. ఎంత మంచి వార్త విన్నా ఎక్కువగా అరవటం, నర్తించటం చేయకూడదు. ఏదైనా అతి చేయటం అనేది ఎప్పుడూ మంచిది కాదు. కచ్చితంగా ఉన్నవారిని అందరూ నమ్ముతారు. ఏదైనా చెప్పుకోవాలనిపిస్తుంటది. వాళ్లనే సలహా అడగాలనిపిస్తుంటది. అది స్నేహితులు కావచ్చు, బంధువు కావచ్చు, కొలీగ్‌ కావచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ల పక్కన నిలబడటం, సరైన సలహా ఇవ్వగలగటం చేయాలంటే ముందు మనం నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి’ అని పూరీ చెప్పారు.

‘ఒకడు చాలా తెలివైనవాడు అయ్యి ఉంటాడు కానీ భార్యతో రోజు గొడవపడుతుంటాడు. స్నేహితులు ఆయనను పొరపాటుగా అర్థం చేసుకుంటారు. కొంత మంది అతనితో మాట్లాడటం మానేస్తారు. అతనిలో ఈక్యూ లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. పుస్తకాల జ్ఞానం వేరు. సామాజిక జ్ఞానం వేరు. సామాజిక జ్ఞానం కలిగిన వారికి ఏదైనా పని చెప్పండి. ఏదో ఒకటి చేసి ఆ పని సాధిస్తారు. ఈక్యూ ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. అది ఇంట్లో కావచ్చు, పని ప్రదేశంలో కావచ్చు. వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లు సైతం ఆనందంగా ఉంటారు. అందుకే ఐక్యూ కంటే సమానంగా ఈక్యూ ఎంతో ముఖ్యం. ఈక్యూని ఏదో టెక్నిక్‌లాగా ఉపయోగించకూడదు. నిజాయితీగా చేయండి. అది మీ క్యారెక్టర్‌ అవ్వాలి’ అని పూరీ వివరించారు. 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన