కొవిడ్‌తో రైల్వేలకు నష్టాలు.. - railways registers 70 pc loss in passenger earnings
close
Published : 24/03/2021 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌తో రైల్వేలకు నష్టాలు..

కానీ, సరుకు రవాణాలో లాభాలు..

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దేశంలో వ్యవస్థలన్నీ ఆర్థికంగా తీవ్రమైన నష్టాలకు గురైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, భారతీయ రైల్వే కూడా భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రూ.38వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. కానీ, శ్రామిక్‌ రైళ్లు, సరుకు రవాణాతో వచ్చిన లాభాలతో ఆ నష్టాన్ని కొంతమేర పూడ్చుకున్నట్లు తెలిపింది.

దేశంలో లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రయాణికుల రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. కొంతమేరకు మాత్రమే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ సమయంలో ప్రయాణికుల రైళ్ల నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. అదే సమయంలో సరుకు రవాణాలో మాత్రం లాభాలతో దూసుకెళ్లింది. మార్చి 22 నాటికి రూ.1868 కోట్లను పొందగా, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది రెండు శాతం అధికమని రైల్వే పేర్కొంది. ఇక ప్రయాణికుల రైళ్లతో గతేడాది రూ.53,525కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం కేవలం రూ.15,507కోట్లు మాత్రమే పొందినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. అనగా దాదాపు 71.03శాతం ఆదాయం కోల్పోయినట్లయింది.

దేశవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగిన వేళ, మే 1వ తేదీ నుంచి వలస కార్మికులను తరలించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ఇలా మే 1 నుంచి ఆగస్టు 30వరకు దాదాపు 63లక్షల మంది కార్మికులను తరలించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇలా 23రాష్ట్రాల్లో 4000 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడిపినట్లు తెలిపింది. అదే సమయంలో సరుకు రవాణాలో నూతన పంథాను అవలంభించి ప్రత్యేక పార్శిల్‌ సర్వీసులను ప్రారంభించామని వెల్లడించింది. పార్శిల్‌ సర్వీసులతో పాటు ఔషధాలు, పాలు, వెంటిలేటర్ల వంటి సరుకు రవాణా చేసినట్లు తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8634 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వేశాఖ వెల్లడించింది. వీటిలో 2402 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కాగా 5381 సబర్బన్‌, 851 పాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. కొవిడ్‌ కంటే ముందు దేశంలో నిత్యం 11వేల రైళ్లు నడుస్తుండగా ప్రస్తుతం 7377 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. అయితే, ప్రస్తుతం నడుపుతోన్న ప్రత్యేక రైళ్లలో సాధారణం కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అనవసర ప్రయాణాలను తగ్గించేందుకే వీటి ఛార్జీలు పెంచినట్లు రైల్వేశాఖ సమర్థించుకుంటోంది. అంతేకాకుండా ప్లాట్‌ఫాం టికెట్‌ రుసుమును కూడా భారీగా పెంచింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని