ramyakrishna: మమతల తల్లి.. నట నీలాంబరి..! - ramyakrishna birth day special story
close
Published : 15/09/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ramyakrishna: మమతల తల్లి.. నట నీలాంబరి..!

సింహాసనంపై రాజసాన్ని పలికించే శివగామి, విలనిజాన్ని పండించే నీలాంబరి, తలపై కిరీటం పెట్టి శూలం పడితే దేవత, కన్నీళ్లు పెట్టించే సామాన్య గృహిణి ఇవే కాక ఇంకెన్నో పాత్రలు ఆమె కోసమే పుట్టాయనేంత అద్భుతంగా నటిస్తారు రమ్యకృష్ణ. ఇవాళ ఆ ‘మమతల తల్లి’ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. 

తొలినాళ్లలో దక్కని గుర్తింపు

రమ్యకృష్ణ తన 14 వ ఏటనే హీరోయిన్‌గా మారారు. 1984లో తమిళంలో వచ్చిన ‘వేల్లై మనసు’ , తెలుగులో ‘భలే మిత్రులు’ సినిమాల్లో నాయికగా అరంగేట్రం చేశారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో సహాయ పాత్రలకే పరిమితమయ్యారామె. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక హీరోయిన్‌గా అవకాశాలు దక్కవేమో అనే సమయంలో దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పారు.

రొమాంటిక్‌ హీరోయిన్‌గా వెలుగు

పరిశ్రమకు వచ్చి సుమారు 5 ఏళ్లైనా సరైన విజయం లేకపోవడమే కాదు, నటిగా కూడా జనాలు మరిచిపోతారేమో అనే సమయంలో కె. విశ్వనాథ్‌ ‘సూత్రధారులు’లో అవకాశమిచ్చారు. అందులో సీతాలుగా రమ్యకృష్ణ నటన కట్టిపడేసింది. కేవీ మహదేవన్‌ సంగీతమూ సూపర్‌హిట్‌ అవడంతో తొలిసారి విజయాన్ని రుచి చూసిందామె. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావు ‘అల్లుడుగారు’, ‘అల్లరి మొగుడు’, ‘అల్లరి ప్రియుడు’ సినిమాల ద్వారా రొమాంటిక్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రియురాలిగా, భార్యగా, హై క్లాస్‌ భామగా వెండితెర మీద తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘హలో బ్రదర్’‌, ‘క్రిమినల్’‌, ‘ఘరానా బుల్లోడు’ చిత్రాల్లో తన గ్లామరస్‌ నటనతో టాప్‌ హీరోయిన్‌ స్థాయికి చేరిందామె. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ టాప్‌ హీరోలతో ఆడిపాడే స్థాయికి ఎదిగారు రమ్యకృష్ణ. అందం, అభినయంతో తన సినిమాలతో ఆశ్చర్యపరిచారు. మధ్యలో ‘కంటే కూతుర్నే కనాలి’, ‘ఊయల’, ‘చంద్రలేఖ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో పలకరించి ఆకట్టుకున్నారు.

అచ్చ తెలుగింటి గృహిణి

‘అల్లుడుగారు’ సినిమాలో మోహన్‌బాబు భార్యగా అచ్చ తెలుగింటి ఇల్లాలిగా రమ్యకృష్ణ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె ఇలాంటి పాత్రలెన్నో చేశారామె. ‘ఆహ్వానం’, ‘బడ్జెట్‌ పద్మానాభం’, ‘ఊయల’ లాంటి సినిమాల్లో ఇల్లాలిగా మెప్పించారామె. ‘చంద్రలేఖ’లోనూ ఆమె గుర్తుండిపోయే పాత్రను చేశారు. ఇక ‘సోగ్గాడే చిన్నినాయన’లో నాగార్జున భార్యగా ఈ వయసులోనూ హీరోయిన్‌గా అదరగొట్టారామె.  ‘బంగార్రాజు’లో నాగార్జునకు ఇల్లాలుగా మరోసారి కనిపించనున్నారు.  

నీలాంబరిగా విశ్వరూపం


రజనీకాంత్‌ కథానాయకుడిగా ‘నరసింహ’ చిత్రంలో ఆమె పోషించిన నీలాంబరి పాత్ర ఎంతటి సంచలనమో తెలిసిందే. సూపర్‌స్టార్‌తో పోటీపడి మరి నటించి లేడీ విలన్‌గా అదరగొట్టారు. అప్పటివరకూ గ్లామర్ క్వీన్‌గా వరుస హిట్లున్నప్పటికీ విలన్‌గా నటించాలనుకోవడం ఒక సాహసం. సూపర్‌స్టార్‌తో పోటీపడగలదా? అని సందేహపడిన వారికి తన నటనతో అదిరిపోయే బదులిచ్చింది. రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ కెరీర్‌లోనూ మరుపురాని చిత్రంగా నిలిచిపోయిందా సినిమా. అదేస్థాయి కలెక్షన్లను అందుకుంది.

దేవతంటే ఆమే.. 

ఉజ్వలంగా వెలుగే కళ్లు, మొహంలోని తేజస్సుతో చూడగానే దేవత అనిపించే రూపం ఆమెది. అందుకే దేవత పాత్రలు ఆమెకు వరుసకట్టాయి.  కెరీర్‌ తొలినాళ్లలోనే అలాంటి పాత్రలు వరించాయి. 1989లో వచ్చిన‘ శ్రీదేవీ కామాక్షి’ చిత్రంలో కామాక్షి దేవిగా చేశారామె.  కోడిరామకృష్ణ తీసిన భక్తిరస చిత్రం ‘అమ్మోరు’ చూసి థియేటర్లోనే హారతులు పట్టారు ప్రేక్షకులు. తమిళం, తెలుగు చిత్రాల్లోనూ దేవతంటే రమ్యకృష్ణే అన్నట్లు చేసిందామె. ‘దేవుళ్లు’ చిత్రంలో కనకదుర్గగా, ‘సమ్మక్క సారక్క’ చిత్రంలో సమ్మక్క తల్లిగానూ మెప్పించింది. తమిళం, కన్నడ పరిశ్రమల్లోనూ దేవతగా చేశారామె. 

రాజమాత రాజసం

మమతల తల్లిగా, రాజమాత శివగామిగా ‘బాహుబలి’లో రమ్యకృష్ణ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. శక్తిమంతమైన తల్లిగా, రాజ్య సంరక్షణను చూసుకొనే మహారాణిగా రమ్యకృష్ణ పలికించిన రాజసం బాహుబలిని మరోస్థాయిలో నిలబెట్టింది.  ఆ పాత్రకు ఎవరెవరినో సంప్రదించాక చివరకు రమ్యకృష్ణను వరించింది. జక్కన్న నమ్మకానికి పదింతలు చేసి చూపించింది రమ్యకృష్ణ. శివగామి పాత్ర కూడా ఆమె జీవితంలో మరిచిపోలేని పాత్రే. 

ఇవేకాక మరిన్ని

ఆమె చేసిన పాత్రల్లో కొన్ని పార్శ్వాలే ఇవి. హీరోకు అమ్మగా,  కన్నీళ్లు పెట్టించే కూతురిగా, పొగరున్న పట్నం పిల్లగా, మత్తెక్కించే ఐటం గర్ల్‌గా ఎన్నో మరపురాని పాత్రలను చేశారావిడ. టీవీ సీరియళ్లు, వెబ్‌ సిరీస్‌లలోనూ నటించి అక్కడా తన ప్రతిభను చాటుకున్నారు. క్వీన్‌ వెబ్‌ సిరీస్‌లో తమిళనాడు దివంగత సీఎం, నటి జయలలిత పాత్రలో జీవించిందనే చెప్పాలి. టాలీవుడ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీని పెళ్లాడిన ఈమె ప్రస్తుతం ‘రిపబ్లిక్’‌, ‘బంగార్రాజు’, ‘రంగమార్తాండ’ చిత్రాల్లో కీలకపాత్రల్లో నటిస్తోంది. ఇలాంటి మరపురాని పాత్రలు మరిన్ని రావాలని కోరుకుంటూ రమ్యకృష్ణకు మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 







Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని