రష్మికను పెళ్లి చేసుకోవాలంటే ఇదే ప్రక్రియ! - rashmika twitter session
close
Updated : 22/09/2020 19:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మికను పెళ్లి చేసుకోవాలంటే ఇదే ప్రక్రియ!

హోటల్‌లో తలగడ దొంగిలించా: రష్మిక

నెటిజన్ల ప్రశ్నలు.. నటి ఆసక్తికర జవాబులు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఛలో’తో తెలుగు తెరకు పరిచయమై.. ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’తో అభిమానుల్ని సొంతం చేసుకున్న కథానాయిక రష్మిక. త్వరలో ఆమె పలు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘పుష్ప’లో నటిస్తున్నారు. కార్తి చిత్రం ‘పొగరు’తో కోలీవుడ్‌ను పలకరించబోతున్నారు. ఆమె తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. #RushHour అనే ట్యాగ్‌తో ప్రశ్నలు అడగమని ఫాలోవర్స్‌ను కోరారు. అందులోని ఆసక్తికరమైన వాటికి సమాధానాలు చెబుతానని అన్నారు. ఈ నేపథ్యంలో రిప్లై ఇస్తూ.. వీడియోను పోస్ట్‌ చేశారు. దాదాపు 50 నిమిషాలున్న ఆ వీడియోలో రష్మిక ఏమన్నారో చూద్దాం..

 ‘ఓం శాంతి ఓం’లో దీపిక డైలాగ్‌ చెప్పండి?

రష్మిక: ‘ఏక్‌ చుట్కీ సింధూర్‌..’ డైలాగ్‌ చెబుతూ నవ్వుకున్నారు.

మీకిష్టమైన దుస్తులు?

రష్మిక: నేను సౌకర్యంగా ఉండే దుస్తులకు మొదట ప్రాధాన్యం ఇస్తాను. నాకు జిమ్‌ డ్రెస్‌ అంటే ఇష్టం, చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.. బయటికి వెళ్తున్నప్పుడు గౌన్‌ను ఎంచుకుంటా. ఫ్రీగా ఉంటుంది.

రోజూ కెమెరా ముందు పనిచేయడం ఎలా ఉంది?

రష్మిక: ప్రతిరోజూ పరీక్ష రాసినట్లు ఉంటుంది. మనకు ఇచ్చిన డైలాగ్స్‌ సాధన చేసి, గుర్తుపెట్టుకుని చెబుతుండాలి. రోజూ అలానే జరుగుతుంది. కాస్త శ్రమతో కూడుకున్నదే.. కానీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నటన బాగుందని మొత్తం చిత్ర బృందం క్లాప్స్‌ కొట్టినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. చివరికి సినిమా విడుదలైన తర్వాత మీ అందరూ ఇచ్చే రివ్యూల కోసం ఎదురుచూస్తుంటా. వాటిని చదవడం నాకెంతో ఇష్టం.

నటి కావాలంటే ఏం చదవాలి?

రష్మిక: నాకు తెలియదు. ముందు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయండి. నటించాలనే కోరిక ఉంటే సినిమాలు బాగా చూడండి. నిజానికి మనం చిన్నతనం నుంచే టీచర్స్‌కు అబద్ధాలు చెప్పి.. క్లాస్‌లు ఎగ్గొడుతుంటాం (నవ్వుతూ). తప్పుగా అనుకోకండి. నాకు టీచర్స్‌ అంటే గౌరవం చాలా ఉంది.

మీ స్కూల్‌ లేదా, కాలేజీలో జరిగిన ఫన్నీ మూమెంట్‌?

రష్మిక: నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నన్ను ట్యూషన్‌లో చేర్పించారు. నాకు లెక్కలు బాగా వచ్చు (సరదాగా), అందుకే చేర్పించారు. స్కూల్‌ నుంచి మళ్లీ అక్కడికి వెళ్లాలంటే చాలా కోపం వచ్చేది. ఓ రోజు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో మామిడి కాయలు కోశా. ఆ ఇంట్లో ఉండే ఆంటీ చూసేసింది. కర్రపట్టుకుని తిడుతూ వచ్చింది. మేం పరిగెత్తాం. అదే నా ఫన్నీ మూమెంట్‌.

ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏం చేస్తారు?

రష్మిక:  జిమ్‌కు వెళ్లి విపరీతంగా వర్కౌట్‌ చేస్తా. మ్యూజిక్‌ బాగా వింటా. పిచ్చిగా డ్యాన్స్‌ చేస్తా. డ్రామాలు చూస్తా, ఐస్‌క్రీమ్‌ తింటా.

హోటల్‌ నుంచి ఏదైనా దొంగలించారా?

రష్మిక: నేను చెప్పే సమాధానంతో చాలా మంది సంతోషిస్తారు. హోటల్‌లో ఉండే షాంపూలు బాగుంటాయి, అవి తెచ్చేసేదాన్ని. ఓ సారి తలగడ కవర్‌ చాలా నచ్చింది. అందుకే దొంగతనం చేసి తెచ్చుకున్నా.. క్షమించండి. సిగ్గుగా ఉంది.

ఇటువంటి క్లిష్ట సమయం గురించి మీరేం చెబుతారు? 

రష్మిక: ఇది మనందరికీ కష్టంతో కూడుకున్న తరుణం. కానీ ఇలానే ఉండిపోదు. పరిస్థితి చక్కబడిన తర్వాత కాలం వృథా అయ్యిందని బాధపడొద్దు. ఇకనైనా ఈ సమయాన్ని భవిష్యత్తులో ఉపయోగపడే పనుల కోసం వెచ్చించండి.

క్లాస్‌లు జరుగుతున్నప్పుడు స్నాక్స్ తిని, టీచర్స్‌కు కోపం తెప్పించారా?

రష్మిక: లేదు.. నేను చాలా మంచి విద్యార్థిని. కానీ సరిగ్గా చదవను అంతే.. (నవ్వుతూ). అది జన్యుపరంగా వచ్చిన విషయం. మా అమ్మానాన్న కూడా పెద్దగా చదవలేదు. అది వాళ్ల తప్పు.. నా తప్పు కాదు (నవ్వుతూ). కాబట్టి నా తల్లిదండ్రుల వల్లే చెడు విద్యార్థిని అయ్యా.

పరీక్షల్లో చీట్‌ చేశారా?

రష్మిక: కాపీ కొట్టలేదు.. కానీ స్నేహితుల సాయం అడిగా.

మీ ఫ్యాన్‌ మూమెంట్‌?

రష్మిక: నేనిప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్నా. నిజానికి నాకు ఇష్టమైన స్టార్‌ నా ముందు ఉంటే.. నవ్వుతూ మాట్లాడుతా అంతే. అదే నాకు ఫ్యాన్‌ మూమెంట్‌.

మీలో స్ఫూర్తి నింపే అంశం?

రష్మిక: నేను జీవితంలో గొప్ప స్థాయికి చేరాలి. దానికి హద్దులు లేవు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌, ఆపై హాలీవుడ్‌లో కూడా చేయాలి.

నెగిటివిటీని ఎలా డీల్‌ చేస్తుంటారు?

రష్మిక: తొలుత ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా స్పందించాలో తెలియలేదు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు విమర్శలు నా దగ్గరికి రాకుండా చూసుకుంటున్నారు. కొన్ని గ్రూప్స్‌ నాపై విమర్శలు రాకుండా పోరాడుతున్నాయి. వారి వల్ల నేను సంతోషంగా ఉన్నా.

లాక్‌డౌన్‌లో ఏం చేశారు?

రష్మిక: నా కుటుంబ సభ్యులతో కలిసి చాలా సమయం గడిపా. వంట నేర్చుకున్నా. కేక్‌లు తయారు చేశా. నా సహనం బాగా పెరిగింది. కెరీర్‌పై మరింత స్పష్టత వచ్చింది.

మీరు రెడీ కావడానికి ఎంత సమయం తీసుకుంటారు?

రష్మిక: రెండు విధాలుగా రెడీ అవుతుంటా. ఒకటి ఐదు నిమిషాల్లో సిద్ధం కావడం. రెండోది 2-3 గంటలు కేటాయించడం. ఎలా రెడీ అవుతాననేది ఆరోజు పని, పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

మీ ఫోన్‌లో బాగా వాడే యాప్స్‌?

రష్మిక: వాట్సాప్‌. నా స్నేహితులతో మాట్లాడుతుంటా.

మీ వద్ద ఉన్న బొమ్మలు?

రష్మిక: నా దగ్గర కుక్కలు ఉన్నాయి. బొమ్మలు లేవు. ఓ వీధి కుక్కను కూడా పెంచుతున్నా. అది నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా మరొకరు సంరక్షించలేరు.

మీలో మీకు నచ్చని గుణాలు?

రష్మిక: అతిగా బాధపడుతుంటా. ఇది అంత మంచిది కాదు. మరొకటి నవ్వడం. అన్నింటికీ నవ్వుతూ సమాధానం ఇస్తుంటా, నాకే నచ్చదు. ఇంకొకటి హైపర్‌. అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది.. నేను ఎలియన్‌ అని.

మీకిష్టమైన స్ట్రీట్‌ ఫుడ్‌?

రష్మిక: పానీపూరీ, స్వీట్‌ పూరీ.

మీరు వివిధ రకాల వంటల్ని కలిపి తింటారా?

రష్మిక: అందులో నేను క్వీన్‌. బిర్యానీని రసంతో కలిపి తింటాను. పెరుగన్నంలో లేస్‌ కలిపి తింటా. రైస్‌, పప్పు, పెరుగు, కూరగాయల కర్రీ.. అన్నీ కలిపి తినేస్తా.

మీరు ట్వీట్‌లో ఎక్కువగా కోతి ఎమోజీ ఎందుకు వాడుతుంటారు?

రష్మిక: నా ఎమోషన్‌ను కోతి ఎమోజీలు బాగా తెలుపుతాయని అలా చేస్తుంటా.

మీకు అవకాశం ఇస్తే.. ఎలాంటి పవర్‌ కావాలని కోరుకుంటారు?

రష్మిక: నేను ఎవర్నైనా తాకితే వాళ్లు అనుకున్నది అయిపోవాలి. వాళ్లు ఏం కావాలన్నా జరిగిపోవాలి. అలాంటి శక్తి కోరుకుంటా.

మీ జుట్టు చాలా బాగుంది. కిటుకులు చెబుతారా?

రష్మిక: బాగా నూనె పెట్టండి. వర్కౌట్‌ తర్వాత తల స్నానం చేయండి. సీరమ్‌ ఉపయోగించండి. చేప, బాదం, గుడ్డు.. వంటి ఆహారం తినండి.

పాఠశాల రోజుల్లో క్లాసులు ఎగ్గొట్టారా?

రష్మిక: స్కూల్‌ చదువుతున్న రోజుల్లో హాస్టల్‌లో ఉన్నా. కాబట్టి ఆ అవకాశం లేదు. కానీ కాలేజీ రోజుల్లో మాత్రం క్లాస్‌కు వెళ్లకుండా.. థియేటర్లో కన్నడ చిత్రం ‘గూగ్లీ’ చూశా.

కుక్క లేదా పిల్లి?

రష్మిక: జంతువుల్ని అలా వేరు చేయలేను.

మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ప్రక్రియ ఏంటి?

రష్మిక: ముందు నన్ను కలవండి. ఆ తర్వాత ముందుకెళ్దాం.. (నవ్వుతూ). నా టీంకు మెసేజ్‌ చేయండి. వాళ్లు నన్ను ఎలా కలవాలో చెబుతారు.

మీకు తెలుగు, మరాఠీ వచ్చా?

రష్మిక: రాదు.. ఏం చేద్దాం.

మీ పేరుకు అర్థమేంటి?

రష్మిక: రష్మిక అంటే పువ్వులోని మధ్య భాగం.

సెట్‌లో హడావిడి చేస్తుంటారా?

రష్మిక: పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తుంటా.

తమిళంలో మాట్లాడండి?

రష్మిక: ఎలా ఉన్నావు తమ్ముడు (అని తమిళ్‌లో మాట్లాడారు)
అనంతరం ఆమె కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. ‘శానిటైజ్‌ చేసుకోండి, మాస్కులు ధరించండి. మాస్కు అసౌకర్యంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ తప్పదు. మనమంతా అలవాటుపడాలి. వర్కౌట్‌ చేయండి. మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. మరో విషయం మీ అందర్నీ నా అభిమానులు అనలేను. అలాగని స్నేహితులుగా చూడలేను.. మిమ్మల్ని పిలవడానికి నాకు ఓ మంచి పేరు సూచించండి. లవ్‌ యూ..’ అని రష్మిక ముగించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని