Tokyo Olympics: భారత్‌ ఖాతాలో మరో పతకం.. రైతు బిడ్డ రజతం ‘పట్టు’కొచ్చాడు‌! - ravi kumar dahiya wins silver in tokyo olympics story
close
Updated : 05/08/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: భారత్‌ ఖాతాలో మరో పతకం.. రైతు బిడ్డ రజతం ‘పట్టు’కొచ్చాడు‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో వెండి పతకం చేరింది. రవి కుమార్‌ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్‌ 57 కిలోల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రజతంతో మెరిశాడు. రెండు సార్లు ప్రపంచ విజేత అయిన రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ చేతిలో పోరాడి ఓడినా దేశానికి మరో పతకం తీసుకొచ్చాడు. జావుర్‌ యుగేవ్‌తో తలపడటం అంత సులభం కాదని తెలిసినా దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యంగా బరిలోకి దిగి తన శక్తినంతా ధారపోసినా విజయం వరించలేదు. ఈ రసవత్తర పోరులో  వెండి పతకం సాధించి యావత్‌ దేశ ప్రజల ప్రశంసలు అందుకొంటున్న రవి కుమార్‌ దహియాపై ప్రత్యేక కథనం.. 

చిన్న కుగ్రామమది.. సరైన వసతులు లేవు.. ఏ అవసరం వచ్చినా పక్కన పెద్ద ఊరికి వెళ్లాల్సిందే. అలాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన యువ సంచలనమే ఇప్పుడు టోక్యోలో భారత జెండాను రెపరెపలాడించాడు. రెజ్లింగ్‌లో వెండి పతకం తీసుకొచ్చిన రవికుమార్‌ దహియాది హరియాణాలోని సోనెపత్‌కు సమీపంలోని నాహ్రి. ఎలాంటి వసతులు లేని ఆ గ్రామం నుంచి వచ్చిన ఈ 23 ఏళ్ల మల్లయోధుడు పసిడి పతకమే లక్ష్యంగా పోరాడి రజతంతో మెరవడం విశేషం. 

రవి కెరీర్‌లో అదే పెద్ద మలుపు!

హరియాణాలోని సోనెపత్‌.. ఈ పేరు చెప్పగానే ఎంతోమంది రెజ్లర్లు జ్ఞాపకమొస్తారు. అలాంటి ఊరుకు దగ్గర్లోని నాహ్రి రవి సొంతూరు. అఖాడాల మధ్యే పెరగడం ఆరంభం నుంచి రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకున్నాడతను. రవి తండ్రి రాకేశ్‌ దహియా రైతు. సొంత పొలం కూడా లేదు. ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. అయితే తన కొడుకు అభిలాషను నెరవేర్చేందుకు రాకేశ్‌ చాలా కష్టపడ్డాడు. రెజ్లింగ్‌పై రవి ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. అతడిని మరింత ప్రోత్సహించాడు. తమ గ్రామానికి చెందిన అమిత్‌ దహియా ప్రపంచ రెజ్లింగ్‌లో పతకం గెలవడంతో తన కొడుకునూ ఓ ఛాంపియన్‌లా చూసుకోవాలని అతడు కలలుగన్నాడు. ఇంట్లో ఇబ్బందులు ఉన్నా రవిని రెజ్లింగ్‌ ఛాంపియన్‌ చేయాలని తపించాడు. అప్పులు చేసి తనయుడిని 10 ఏళ్ల వయసులో దిల్లీలో చత్రసాల్‌ స్టేడియంలో చేర్పించాడు. ఇదే రవి కెరీర్‌లో అతిపెద్ద మలుపు.

యోగేశ్వర్‌ గదిలో ఉండటంతో కసి పెరిగింది..

చత్రసాల్‌ స్టేడియంలో కుర్రాళ్లంతా కలిసి ఓ పెద్ద హాల్‌లో ఉండేవారు. ఆటనే శ్వాసగా చేసుకుని కఠోర సాధన చేస్తున్న రవిలోని ప్రతిభను గుర్తించిన కోచ్‌లు అతడికి ఒక గది కేటాయించారు. స్టేడియంలో ట్రైనింగ్‌ హాల్‌కు పక్కన ఉండే ఆ గదికి ఒక ప్రత్యేకత ఉంది. ఒలింపిక్స్‌ పతకం గెలిచిన యోగేశ్వర్‌ దత్‌ ఒకప్పుడు ఉన్నది అక్కడే. రవి ప్రతిభ చూసిన తర్వాత అతడికి దాన్ని కేటాయించారు.రెజ్లింగ్‌నే ప్రాణంగా చేసుకున్న అతడికి యోగి గది కేటాయించడంతో.. ఛాంపియన్‌ కావాలన్న కసి అతడిలో మరింత పెరిగింది. పేదరికం తన ఎదుగుదలకు ఇబ్బందిగా మారినా దాన్ని ఎప్పుడూ ఆటపై ప్రభావం చూపనీయలేదు.ఎంతో కష్టపడి అతడి తండ్రి ప్రతి రోజు 60 కిలోమీటర్లు ప్రయాణించి కొడుకుకు పాలు, పండ్లు అందించేవాడు. అతడి ఇబ్బందులను గమనించిన సీనియర్‌ రెజ్లర్లు అవసరమైనప్పుడు రవికి అండగా నిలిచేవారు.

ఆ టోర్నీతో మరో స్థాయికి

రెజ్లింగ్‌లో రవి వేగంగా ఎదిగాడు. చత్రసాల్‌ స్టేడియంలో కోచ్‌ సత్పాల్‌సింగ్‌ శిక్షణలో రాటుదేలిన అతడు జాతీయ టోర్నీల్లో నిలకడగా సత్తాచాటాడు. 2015లో సాల్వడార్‌లో జరిగిన జూనియర్‌ ప్రపంచ రెజ్లింగ్‌లో 55 కిలోల విభాగంలో రజత పతకం గెలిచి తన రాకను బలంగా చాటాడు. అయితే 2017లో గాయం కావడంతో దాదాపు ఏడాదిన్నర పాటు మ్యాట్‌కు దూరమైపోయాడు. రవి పేరు ఎక్కువమందికి పరిచయం అయింది మాత్రం 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ద్వారానే. ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లో ఐరోపా ఛాంపియన్‌ అర్సెన్‌ను కంగుతినిపించిన అతడు.. క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ యుకి తకహషిని ఓడించి సంచలనం సృష్టించాడు. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు కూడా సంపాదించాడు.

ఆ లక్షణమే ఇంతవరకు తీసుకొచ్చింది..

విశాలమైన బాహువులకు తోడు సాంకేతికంగా ఎంతో బలమైన దహియా.. ప్రత్యర్థులకు అంత త్వరగా కొరుకుడు పడడు. బౌట్‌ను నెమ్మదిగా ఆరంభించినా ఆఖర్లో పుంజుకోవడం అతడి స్టయిల్‌. సెకన్ల వ్యవధిలోనూ మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయడం రవికి అలవాటు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా రెజ్లింగ్‌లోనే కాదు టోక్యో ఒలింపిక్స్‌లోనూ దహియా ఈ టెక్నిక్‌ను ప్రదర్శించాడు. ఒత్తిడిని తట్టుకుని గెలవగలిగే నైపుణ్యం కూడా రవిని ఉత్తమ రెజ్లర్లలో ఒకడిగా నిలబెట్టింది. 5.7 అడుగులతో తన కేటగిరిలో ఎక్కువమంది కంటే ఎత్తుగా ఉండటం అతడికి లాభించే అంశం. తన ఉడుం పట్టుతో ఫైనల్స్‌లో చరిత్ర లిఖించాలన్న కసితో రష్యా రెజ్లర్‌పై పోరాడి ఓడినా దేశానికి రజత పతకం సొతం చేసుకున్న ఈ యువ కెరటానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని