ఏడాదిన్నర నిద్రలేని రాత్రులు గడిపా: జడేజా - ravindra jadeja opens up about his sleepless nights for one and half year
close
Updated : 30/05/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాదిన్నర నిద్రలేని రాత్రులు గడిపా: జడేజా

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇప్పుడు కీలక ఆటగాళ్లలో ఒకడిగా మారినా కొన్నాళ్ల క్రితం వరకూ జట్టులో స్థానం కోసం ఎదురుచూశాడు. వన్డేల్లో చోటు కోల్పోయి.. టెస్టు జట్టులో కొనసాగుతున్నా తుది పదకొండులో చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో 2018లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన అతడు తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అప్పుడు ఐదో టెస్టులో ఆడిన ఇన్నింగ్సే జడ్డూను టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా మార్చింది. కానీ, అంతకుముందు ఏడాదిన్నర పాటు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పాడు. తాజాగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాలను పంచుకున్నాడు.

‘అప్పుడు ఏడాదిన్నర పాటు నిద్రలేని రాత్రులు గడిపా. ఆ సమయంలో రోజూ తెల్లవారుజాము దాదాపు 5 గంటల వరకు మెలకువతోనే ఉండేవాడిని. ఏం చేయాలి. మళ్లీ ఎలా పుంజుకోవాలనే విషయాలపైనే ఆలోచించేవాడిని. దాంతో నిద్ర పట్టేది కాదు. అప్పుడు టెస్టు జట్టులో కొనసాగుతున్నా.. తుది జట్టులో మాత్రం ఉండేవాడిని కాదు. వన్డేల్లో చోటు కోల్పోయా. టీమ్‌ఇండియాతో కొనసాగడం వల్ల దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడలేకపోయా. నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చేదికాదు. ఎలా ముందుకు సాగాలో అనేదానిపై తీవ్రంగా ఆలోచించేవాడిని. కానీ, 2018లో ఆడిన ఓవల్‌ టెస్టే మొత్తం మార్చేసింది. అది నా ఆటను, నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తర్వాత హార్దిక్‌ పాండ్య గాయపడటంతో నేను వన్డేల్లోకి తిరిగి వచ్చా. నాటి నుంచి నేను బాగా ఆడుతున్నా’ అని జడేజా చెప్పుకొచ్చాడు.

కాగా, ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 332 పరుగులు చేయగా, టీమ్‌ఇండియా 160కే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అదే సమయంలో జడేజా(86 నాటౌట్‌; 156 బంతుల్లో 11x4, 1x6) ఎనిమిదో ఆటగాడిగా బరిలోకి దిగి జట్టును ఆదుకున్నాడు. హనుమ విహారి(56; 124 బంతుల్లో 7x4, 1x6)తో కలిసి ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోరును 292 పరుగులకు చేరవేశాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే జడ్డూ తర్వాతికాలంలో కీలక ఆటగాడిగా మారాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లోనూ జడేజా(77).. ధోనీ(50)తో కలిసి మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలైనా అతడి పేరు మాత్రం మార్మోగిపోయింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని