RCBపై కోపం లేదు.. రాహుల్‌ వికెట్‌ తీస్తే గెలిచేవాళ్లం - rcb vs pbks comments
close
Published : 01/05/2021 11:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RCBపై కోపం లేదు.. రాహుల్‌ వికెట్‌ తీస్తే గెలిచేవాళ్లం

కోహ్లీ.. తొలి వికెట్‌కావడం ప్రత్యేకమన్న హర్‌ప్రీత్‌

తన ప్రదర్శనకు తన జిల్లా వాసులు గర్విస్తారని పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌ అంటున్నాడు. బెంగళూరుపై తనకేమీ కోపం లేదని కేఎల్‌ రాహుల్‌ చెబుతున్నాడు. రాహుల్‌ వికెట్‌ ఒక్కటి తీసుంటే సునాయాసంగా గెలిచేవాళ్లమని విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇకపై వేగంగా బంతులు వేసేందుకు ప్రయత్నిస్తానని క్రిస్‌ జోర్డాన్‌ తెలిపాడు. పంజాబ్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు 145/8 మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.


విరాట్‌ బాదిన బాధపడలేదు

(హర్‌ప్రీత్‌ బ్రార్‌: 25*; 17 బంతుల్లో 1×4, 2×6; 4-1-19-3)

నాది మోగా జిల్లా. అక్కడి ప్రజలు నాకు అండగా నిలుస్తారని, నా ప్రదర్శనకు గర్విస్తారని తెలుసు. కోహ్లీ నా బౌలింగ్‌లో బాదేసినప్పుడు నేను అతిగా ఆందోళన చెందలేదు. ఎందుకంటే పుంజుకొనేందుకు బౌలర్‌కు రెండో అవకాశం కచ్చితంగా వస్తుంది. ఐపీఎల్‌లో నా తొలి వికెట్‌ కోహ్లీదే కావడం నాకెంతో ప్రత్యేకం. మొదట్లో పరుగులిచ్చినా విరాట్‌ వికెట్‌ పడటంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రెండు ఓవర్లు ఆగాను. రాహుల్‌ భాయ్‌ పరిస్థితుల గురించి వివరిస్తూ ఎలాంటి షాట్లు ఆడొచ్చో సూచించాడు.


బెంగళూరుపై కోపం ఉండదు

(కేఎల్‌ రాహుల్‌: 91*; 57 బంతుల్లో 7×4, 5×6)

మేం హర్‌ప్రీత్‌ బ్రార్‌ను కొన్నాళ్లుగా సిద్ధం చేస్తున్నాం. ఇలాంటి పిచ్‌పై కచ్చితమైన లెంగ్తుల్లో బంతులు విసిరే ఫింగర్‌ స్పిన్నర్‌ మాకు అవసరం. అతడదే పని చేశాడు. ఆఖర్లో బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. నేనూ యువకుడినే. అయినప్పటికీ నాకున్న ఐపీఎల్‌, అంతర్జాతీయ అనుభవాన్ని కుర్రాళ్లతో పంచుకుంటాను. వారికెంతో ప్రతిభవుంది. కఠిన పరిస్థితుల్లో, ఒత్తిడిలో ఆడగలుగుతున్నారు. ఆర్‌సీబీపై నాకెలాంటి ఉద్దేశం లేదు.  వారితో తలపడినప్పుడల్లా మేం కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులే ఉంటున్నాయి. పైగా జట్టును ముందుండి నడిపించడం నా బాధ్యత. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెట్టాల్సినప్పుడు, వ్యూహాలు చెదరగొట్టేందుకు నేను దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా క్రిస్‌గేల్‌ విలువేంటో నాకు తెలుసు. ఏడెనిమిదేళ్లుగా అతడితో కలిసి ఆడుతున్నా. మూడో స్థానంలో ఆడటం అతడికి కొత్తే. కానీ జట్టు  కోసం అతడా పని చేస్తున్నాడు.


త్వరలోనే 150 కి.మీ వేగం

(క్రిస్‌ జోర్డాన్‌; 4-0-31-1)

ఇదో గొప్ప విజయం. మ్యాచులు కొన్నిసార్లు చేజారుతున్నాయి. అందుకే ప్రతి మ్యాచ్‌ కీలకమవుతోంది. మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. బౌలింగ్‌ వేగం గురించి ఆలోచించడం లేదు. త్వరలోనే 150కి.మీ వేగంతో బంతులు వేస్తాను. మాకు మంచి స్కోరు లభించిందనే చెప్పాలి. ఒకానొక దశలో 150-162 చేస్తామేమో అనిపించింది. కానీ 179 చేయడంతో చాలా ఆనందించాం. బంతితో ప్రాథమిక అంశాలు బాగుంటే చాలు. జట్టంతా సమష్టిగా ఆడింది. ఆఖర్లో కాస్త బద్దకంగా అనిపించింది. దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.


రాహుల్‌ వికెట్‌ తీసుంటేనా..!

(విరాట్‌ కోహ్లీ: 35; 34 బంతుల్లో 3×4, 1×6)

వారికి శుభారంభం లభించినా ఐదు వికెట్లు పడగొట్టి పుంజుకున్నాం. వారు 116/5తో ఉన్నప్పుడు 160 లక్ష్యం ఛేదించాల్సి వస్తుందని అనుకున్నాం. కానీ ఆఖర్లో 25-30 పరుగులు అదనంగా ఇచ్చాం. ఎక్కువగా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాం. మేం బౌండరీలు అధికంగా ఇచ్చాం. సరైన లెంగ్తుల్లో వేస్తే ఆడటం కష్టం. భాగస్వామ్యాల కోసం ప్రయత్నించాం. ఏదేమైనా బ్యాటింగ్‌ విభాగంలో విఫలమయ్యాం. కొన్ని పొరపాట్లు జరిగాయి. సరిదిద్దుకోవాలి. రజత్‌ పటీదార్‌కు మూడో స్థానంలో ఆడేందుకు స్వేచ్ఛనిచ్చాం. మా బ్యాటింగ్‌ లైనప్‌లో సమతూకం ఉంది. రజత్‌ నాణ్యమైన ఆటగాడే. ఇక ఆ ఒక్క (రాహుల్‌) వికెట్‌ తీసుంటే పంజాబ్‌ను చాపచుట్టేసేవాళ్లం. మధ్యలో వికెట్లు తీయకుంటే చేయాల్సిన లక్ష్యం మరెంతో ఉండేది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని