1000 పడకలతో రిలయన్స్‌ కొవిడ్‌ ఆస్పత్రి - reliance to seetup 1000 beds covid hospitals
close
Updated : 29/04/2021 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1000 పడకలతో రిలయన్స్‌ కొవిడ్‌ ఆస్పత్రి

కొవిడ్‌ బాధితులకు ఉచితంగా వైద్యం
5రోజుల్లో 400 పడకలు సిద్ధం - వెల్లడించిన రిలయన్స్‌ ఫౌండేషన్‌

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. తన వంతు సహాయం చేసేందుకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన రెండు కొవిడ్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్‌ సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్‌నగర్‌లో వీటిని ఏర్పాటు చేస్తోన్న ఈ కేంద్రాల్లో.. కొవిడ్‌ బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తామని వెల్లడించింది. కేవలం ఐదు రోజుల్లోనే 400పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిని అందుబాటులోకి వస్తుందని రిలయన్స్‌ ప్రతినిధులు వెల్లడించారు.

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ధాటికి చాలా రాష్ట్రాల్లో ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఏ రూపంలోనైనా సహాయం చేయాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని కార్పొరేట్‌ సంస్థలకు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.. కొవిడ్‌ రోగుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.  దీంతో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వెయ్యి కొవిడ్‌ పడకలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జామ్‌నగర్‌లో ఉన్న ప్రభుత్వ దంత వైద్యశాలలో ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న 400 పడకలు సిద్ధంచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్‌ అధికారులు వెల్లడించారు. మరో 600 పడకలను జామ్‌నగర్‌లోని మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరో వారం, పది రోజుల్లోనే పూర్తిస్థాయిలో దీన్ని సిద్ధం చేస్తామని రిలయన్స్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వీటితో మొత్తం కలిపి 1875 పడకలను కొవిడ్‌ కేర్‌ కోసం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసింది.

రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేస్తోన్న ఈ కొవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిని రాష్ట్రప్రభుత్వం సమకూరుస్తుందని గుజరాత్‌ ప్రభుత్వం పేర్కొంది. ఇక ఆసుపత్రిలో వైద్య పరికరాలు, ఇతర సామగ్రితోపాటు చికిత్సకు అవసరమయ్యే సదుపాయాలను మాత్రం రిలయన్స్‌ సమకూరుస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్‌నగర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు సేవలు అందుతాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 15వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షా 33వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 174 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల్లో 6830 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 2లక్షలు దాటింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని