గెలుపే జీవితం కాదు జీవితాన్ని గెలవాలి - review on little miss sunshine
close
Published : 24/06/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గెలుపే జీవితం కాదు జీవితాన్ని గెలవాలి

సినిమా: లిటిల్‌ మిస్‌ సన్‌షైన్‌; భాష: ఇంగ్లీష్; విడుదల: 2006; దర్శకులు: జోనాథన్‌ డేటన్, ఫారిస్‌; స్క్రీన్‌ప్లే: మైఖెల్‌ ఆర్న్‌ట్‌; తారాగణం: గ్రెగ్‌ కిన్నియర్, స్టీవ్‌ కారెల్, అలెన్‌ ఆర్కెన్‌, తదితరులు; నిడివి: 102 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: డీస్నీ హాట్‌స్టార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గెలుపు గురించి వందల సంఖ్యలో సినిమా లొచ్చాయి. వేలాది పుస్తకాలు మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. గెలవడమే జీవిత పరమార్థం అనేంతగా ప్రపంచం దాని వెనక పరుగులు పెడుతోంది. అయితే విజయం కోసమే జీవితమనే ఈ భావన తప్పని చూపించే ప్రయత్నం చేసింది ‘లిటిల్‌ మిస్‌ సన్‌షైన్‌’ అనే సినిమా. ఓడిపోవడం, బాధొస్తే కన్నీళ్లు పెట్టుకోవడం, నీలా నువ్వు బతకడం తప్పేమీ కాదని చెబుతూనే ప్రేక్షకులను భావోద్వేగాల సమ్మేళనంలో ముంచెత్తిన సినిమా ఇది.

స్వతంత్ర చిత్రంగా 2006లో విడుదలై సంచలనం సృష్టించింది ‘లిటిల్‌ మిస్‌ సన్‌షైన్‌’. ట్రావెలింగ్‌ సినిమాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. భిన్న వ్యక్తిత్వాలున్న ఓ కుటుంబం వోక్స్‌ వ్యాగన్‌ వ్యాన్‌లోసాగించిన రోడ్డు ప్రయాణమే ఈ సినిమా కథ. కలలు, వైఫల్యాలు, గెలుపోటమలు, కుటుంబ బాంధవ్యాల గొప్పతనం ఇలా చాలా అంశాలను చర్చించిన ఫీల్‌ గుడ్‌ మూవీ ఇది. అలాగని ఇదేమీ సీరియస్‌ మూవీ కాదు. ఆద్యాంతం నవ్వులు పూయిస్తే గుండెను తడిపేస్తుంది.

కథ: విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వాలున్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరుగురి కథ ఇది. మోటివేషనల్‌ స్పీకర్‌ కావాలని ప్రయత్నిస్తూ విఫలమవుతుంటాడు రిచర్డ్‌. అతని భార్య షెరిల్‌ ఇంటిపనులతో పాటు కుటుంబ సభ్యులను సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. షెరిల్‌ సోదరుడైన ఫ్రాంక్‌ ఆత్మహత్య ప్రయత్నం విఫలమై నిరాశలో మునిగిపోతాడు. షెరిల్‌ మొదటి భర్త సంతానమైన డ్వేన్‌.. పైలేట్‌ అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడొద్దని ఓ వింత నిర్ణయం తీసుకున్న టీనేజర్‌. డ్రగ్స్‌కు బానిసైన రిచర్డ్‌ తండ్రి ఎడ్విన్‌ వీళ్లతోనే ఉంటాడు. ఇలా ఒకరి  ఆలోచనలు ఒకరికి సరిపోని గందరగోళంగా కనిపించే కుటుంబం వీరిది. అందరూ ఏదో ఒక నిరాశలో బతుకుతుంటారు. ఒక్క అలివ్‌ తప్ప. రిచర్డ్, షెరిల్‌ సంతానమైన అలివ్‌ ఆ ఇంట్లో అందరికన్నా చిన్నది. ఆ చిన్నారి పాపకు కాలిఫోర్నియాలో జరిగే చిన్నపిల్లల అందాల పోటీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. పోటీకి రెండు రోజుల సమయమే మిగిలి ఉంటుంది. ప్రయాణానికి కావాల్సిన డబ్బు వారిదగ్గర ఉండదు. దీంతో పాతబడిన పసుపు పచ్చ వోక్స్‌ వ్యాగన్‌లో కాలిఫోర్నియాకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు. అలా ఆ కుటుంబం మెక్సికో నుంచి కాలిఫోర్నియా చేరడానికి చేసిన 800 మైళ్ల ప్రయాణమే ఈ సినిమా కథ. అనుకున్న సమయానికి అక్కడికి చేరుకున్నారా? ఆ ప్రయాణంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అలివ్‌ పోటీల్లో పాల్గొని అందాల కిరీటాన్ని గెలుచుకుందా? ఒకరంటే ఒకరికి పడని ఆ కుటుంబంలో ఆ ప్రయాణం ఎలాంటి మార్పులు తెచ్చింది? అనేది కథ.

ఓడిపోవడం తప్పు కాదు: ‘లిటిల్‌ మిస్‌ సన్‌షైన్‌’ చిత్రంలోని కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపముంటుంది. కోలుకోలేని వైఫల్యాలు ఎదురవుతాయి. మోటివేషన్‌ స్పీకర్‌ కావాలనే రిచర్డ్‌ కలకు అవాంతరాలు ఎదురవుతాయి. డ్వేన్‌ పైలెట్‌ ఆశలూ గల్లంతవుతాయి. ఫ్రాంక్‌ ప్రేమలో విఫలమై ఉంటాడు. ఇలా అందరూ ఏదో ఒక     విషయంలో ఓడిపోయి ఉన్నవారే. ఆ వైఫల్యాలను అంగీకరించి జీవితంలో ముందుకు సాగేందుకు ఆ ప్రయాణం ఎంతగానో తోడ్పడుతుంది. ఆ సంఘర్షణను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తారు. ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోకుడదనే గొప్ప స్ఫూర్తిని కలిగిస్తుంది ఈ సినిమా.

బాంధవ్యాల మాధుర్యం: స్నేహితులను మనం ఎంచుకునే వీలుంటుంది. కుటుంబాన్ని ఎంచుకోలేం. ఒక ఇంట్లో ఉండేవారి అందరి కలలు, అభిప్రాయాలు ఒకే రకంగా ఉండవు. ఇలా విభిన్న మనస్తత్వాలు ఉన్నా కలిసి ఉండొచ్చని ఈ సినిమా చూపిస్తుంది. సమష్టిగా ఉంటే మంచి ఫలితాలు సాధించొచ్చని చూపిస్తుంది. కుటుంబ బాంధవ్యాల్లోని గొప్పతనాన్ని విడమర్చి చూపిస్తాయి సన్నివేశాలు. కలసి ఉండటం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెబుతుంది కథనం. ఏళ్లుగా అణిచిపెట్టున్న బాధకు  పరిష్కారం కుటుంబం దగ్గరే దొరుకుతుందని చూపిస్తుందీ సినిమా. మొదట్లో ఎవరికివారే ప్రత్యేకంగా ఉండే ఈ ఆరుగురు చివరకు ఒక్కటయ్యే విధానం ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది.

కాసుల వర్షం.. రెండు ఆస్కార్లు: అమెరికాలో తొలుత ఈ సినిమా పట్టుమని పది థియేటర్లలోనూ విడుదలవ్వలేదు. సినిమాకు వచ్చిన స్పందన చూసి థియేటర్ల సంఖ్యను వెయ్యికి పైగా పెంచారు. 8 మిలియన్‌ డాలర్లతోనే ఈ సినిమా పూర్తయింది. అయినప్పటికీ చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. కెమెరామెన్‌ టిమోథీ వెండితెరపై నిజంగానే మాయ చేశాడు. అమెరికా రోడ్డు ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా బడ్జెట్‌కు పన్నెండు రెట్ల వసూళ్లను సాధించి పెట్టిందీ చిత్రం. 100 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లతో హాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచింది. అకాడెమీ అవార్డుల్లో మొత్తం నాలుగు విభాగాల్లో పోటీపడి ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే(మైఖెల్‌ ఆర్న్‌ట్‌), సహాయ నటుడు(అలన్‌ అర్కిన్‌) విభాగాల్లో ఆస్కార్‌ గెలుచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని