BA Raju: అకాల మరణం కలచివేస్తోంది! - rip raju garu celebrity tweets
close
Updated : 22/05/2021 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BA Raju: అకాల మరణం కలచివేస్తోంది!

దిగ్భ్రాంతికి గురైన సినీ తారలు

హైదరాబాద్‌: ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, పీఆర్వో బీఏ రాజు శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. రాజమౌళి, తారక్‌, మహేశ్‌బాబు, సమంత, విశాల్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బీఏ రాజుతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ట్వీట్లు పెట్టారు.

‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల నుంచి మాకు బీఏ రాజుగారితో పరిచయం ఉంది. ఎటువంటి కల్మషం లేని మంచి మనిషి. మేం నటించిన చాలా చిత్రాలకు ఆయన పీఆర్వోగా పని చేశారు. మాకు వ్యక్తిగత పీఆర్వోగానూ వ్యవహరించారు. తరచూ మేం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పటికీ మా కొత్త సినిమాలు వస్తే ఫోన్‌ చేసి మాట్లాడతారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. మా పిల్లల సినిమాలపై కూడా అదే శ్రద్ధ చూపించారు. మాకు అండగా ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. బీఏ రాజు మరణం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది. ఎంతో బాధగా ఉంది. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు రాజుగారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ - రాజశేఖర్‌ దంపతులు


‘అపరిమితమైన ప్రేమాభిమానంతో వృత్తిపరమైన బంధాన్ని వ్యక్తిగత అనుబంధంగా ఎలా మార్చుకోవచ్చో తెలియజేసిన గొప్ప వ్యక్తి!! బీఏ రాజు గారు ఇకపై మన మధ్య ఉండరని తెలిసి షాక్‌ అయ్యాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియచేస్తున్నా’ - సూర్య

‘బీఏ రాజు గారు ఆకస్మిక మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. సినిమాని, టాలెంట్‌ని ప్రమోట్‌ చేయడానికి తన శాయశక్తుల శ్రమించే వ్యక్తి ఆయన’ - దుల్కర్‌ సల్మాన్‌

‘బీఏ రాజుతో నాకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. ఈరోజు ఆయన మనమధ్య లేరనే వార్త నన్నెంతో కలచివేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ - నందమూరి బాలకృష్ణ

‘నా స్నేహితుడు బీఏ రాజు మరణ వార్త తెలిసి నాకెంతో బాధగా అనిపించింది. తెలుగు, తమిళ చిత్రపరిశ్రమల మధ్య ఓ అందమైన వారధిలా ఆయన వ్యవహరించారు. రాజు గారు.. మీరు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతారు. నా ఆలోచనల్లో ఉంటారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ - విక్రమ్‌

‘రాజుగారు.. ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేవగానే మీరు ఇకపై మా మధ్య ఉండరనే వార్త నన్ను కలచివేసింది’ - అనూప్‌ రూబెన్స్‌

‘బీఏ రాజు అకాల మరణం నన్ను షాక్‌కు గురి చేసింది. నన్నెంతో కలచివేసింది. ఆయన ఓ అద్భుతమైన సినీ జర్నలిస్ట్‌. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ - వక్కంతం వంశీ

‘బీఏ రాజు గారిని మిస్‌ కావడం ఎంతో బాధగా ఉంది. సినీ పరిశ్రమలో ఉన్న ప్రతిఒక్కర్నీ ఆయన ఎంతో ప్రోత్సహించేవారు. అలాగే అందరికీ అండగా ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ - అఖిల్‌ అక్కినేని

‘బీఏ రాజు ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఓ కుటుంబసభ్యుడ్ని కోల్పోయినట్లు ఉంది’ - రవితేజ

‘మంచి మనస్సున్న గొప్ప వ్యక్తి బీఏ రాజు గారు మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఓం శాంతి’ - ఎస్‌జే సూర్య

‘బీఏ రాజు గారు కన్నుమూశారని తెలిసి భావోద్వేగానికి లోనయ్యాను. చిన్నప్పుడు తరచూ మా నాన్నగారి సినిమా సెట్స్‌లో ఆయన్ని ఎక్కువగా చూసేవాడిని. ‘అస్లెంబీ రౌడీ’లో ఆయన నటించిన ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోను. మృదుభాష స్వభావి, మంచి మనస్సున్న వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఓం శాంతి’ - మంచు విష్ణు

‘నటుడిగా మొట్టమొదటిసారి హైదరాబాద్‌కి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ బీఏరాజు గారు నాతో ఉన్నారు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, ఎంతో అండగా ఉండే వ్యక్తి ఆయన. ఇకపై ఆయన మన మధ్య ఉండరనే నిజాన్ని నమ్మడం ఎంతో కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ - కార్తి 

‘సినీ పరిశ్రమకు మీరు అందించిన సేవలు చిరస్మరణీయం. ఓం శాంతి. మీ కుటుంబసభ్యులకు, ఆప్తులకు మా ప్రగాఢ సానుభూతి’ - వైజయంతి మూవీస్‌

‘బీఏ రాజు మరణ వార్తతో ఎంతో కలత చెందాను. నా బాధను చెప్పడానికి మాటలు కూడా కరవయ్యాయి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అలాగే, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ - క్రిష్‌

‘37 సంవత్సరాలుగా నా స్నేహితుడు, ఆప్తుడు బీఏరాజు. ఇకపై ఆయన్ని ఎంతో మిస్‌ అవుతాను. అలాగే ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద లోటు’ - నాగార్జున

‘బీఏ రాజుగారు.. నాకు మాటలు కూడా రావడం లేదు!! నా మొదటి సినిమా నుంచి ఆయన నాకు బాగా తెలుసు. భౌతికంగా ఆయన మనకు దూరం కావడం ఎంతో బాధగా ఉంది’ - వెంకటేశ్‌

‘ఇప్పటికీ నేను ఇంకా తేరుకోలేకపోతున్నా. సినీ రంగం, సినిమా పట్ల ఆయకున్న ప్రేమ వర్ణణాతీతం. ఆయన మరణం సినీ పరిశ్రమకే కాదు వ్యక్తిగతంగా మాకు కూడా తీరని లోటు’ - నాగవంశీ

‘మీ చిరునవ్వులు.. ప్రతిఒక్కర్నీ ప్రోత్సహించేలా మీ మాటలు.. ఇకపై మేము ఎంతో మిస్‌ అవుతాం రాజు గారు’ - రామ్‌ 

‘బీఏ రాజు గారు మృతి చెందారని తెలిసి ఎంతో బాధకు లోనయ్యాను. చిత్రపరిశ్రమకు ఇది తీరని లోటు. ఓం శాంతి’ - కాజల్‌

‘ఇది నిజంగానే షాక్‌కు గురి చేసింది. సినీ పాత్రికేయుడు, పీఆర్వో బీఏ రాజు గారు అకాల మరణం నన్ను కలచివేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ - శ్రీ విష్ణు

‘సినిమానే ప్రపంచమనుకొని.. ఆ సినిమా తప్ప మరేమీ తెలియని.. మన సినిమా తల్లి ముద్దుబిడ్డ.. సూపర్‌హిట్‌ బీఏ రాజు ఆకస్మిక మరణం మన తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. టాలీవుడ్‌ ఎన్‌సైక్లోపిడియాను మనం కోల్పోయాం’ - నాగబాబు

‘ఉదయాన్నే బీఏరాజు గారి మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. నా పుట్టినరోజు నాడే ఆయనతో మాట్లాడాను. యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాటి నుంచి ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయనుంటే ఒక ధైర్యం ఉండేది. మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నా రాజు గారు’ - అనసూయ

‘బీఏరాజు మరణం నిజంగా షాక్‌ అయ్యాను. సినీ పాత్రికేయుడిగా, 1500 చిత్రాలకు పీఆర్వోగా పనిచేసిన ఎంతో మంచి వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉంది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇకపై ఆయన్ని ఎంతో మిస్‌ అవుతాం’ - రాజమౌళి

‘బీఏరాజు గారి అకాలమరణం నన్ను షాక్‌కు గురి చేసింది. సినీ జర్నలిస్ట్‌, పీఆర్వోగా సినీ పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలందించారు. తెలుగు చిత్రపరిశ్రమలో నా ప్రయాణం మొదలైనప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీర్చలేని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ - ఎన్టీఆర్‌

‘బీఏ రాజు గారి అకాలమరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నతనం నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నాను. ఆయన నాకెంతో ఆప్తుడు. మా కుటుంబమంటే ఆయనకు ఎనలేని గౌరవం. మేమే ఆయనకు ప్రపంచం. ఆయన మరణం సినీ పరిశ్రమకే కాదు ముఖ్యంగా మా కుటుంబానికి పెద్ద లోటు. రాజుగారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతాం’ - మహేశ్‌బాబు

‘బీఏ రాజు... నువ్వు లేని తెలుగు సినీ మీడియా, పబ్లిసిటీ... ఎప్పటికీ లోటే. తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ - రాఘవేంద్రరావు

‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ ప్రతి ప్రాజెక్ట్‌.. అది హిట్టైనా ఫ్లాపైనా ఆయన ఎంతో సపోర్ట్‌ అందించేవారు. రాజుగారి మరణం ఎప్పటికీ తీరని లోటు’ - సమంత

‘నాకు ఎప్పుడూ అండగా ఉండమే కాకుండా క్లిష్ట సమయాల్లో మంచి సలహాలు అందించే వ్యక్తి, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన వ్యక్తి రాజుగారు. మీ మరణంతో నా హృదయం ముక్కలైంది’ - తమన్‌

‘రాజుగారి అకాల మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఎంతో కాలం నుంచి నాకు ఆయనతో  అనుబంధం ఉంది. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన చిరునవ్వుని ఇకపై మిస్‌ అవుతాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను’ - శ్రీనువైట్ల

‘బీఏ రాజు మరణం నన్ను షాక్‌కు గురి చేసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మంచి మనస్సున్న వ్యక్తి. నాపై, నా సినిమాలపై ఆయన చూపించిన ప్రేమ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మిస్‌ యూ సర్‌. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ - కొరటాల శివ

‘ఇది అన్యాయం రాజుగారు.. వాట్సాప్‌లో మీరు ప్రేమగా పంపే మెస్సేజ్‌లు, ఆశీస్సులు.. ట్విట్టర్‌లో మీరు పెట్టే పాతతరం తాలూకూ ‘సినిమా’ ఫొటోలు, జ్ఞాపకాలు.. ప్రతి సినిమా ఫంక్షన్స్‌లో నవ్వుతూ ఎదురయ్యే మీ పలకరింపులు.. ప్రతి వారం మా ఆఫీస్‌లలో మీరు అందించే ‘సూపర్‌హిట్‌’ పత్రికలు.. ఇలా ఎన్నో.. ఇవన్నీ ఇంకా నా జ్ఞాపకాలేనా..!! మీ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ - అనిల్‌ రావిపూడి

‘నో.. రాజుగారి అకాలమరణం నన్ను ఎంతో బాధిస్తోంది. రాజు.. మీరు సినిమా పట్ల చూపించే ప్రేమ ఇకపై మేము ఎంతో మిస్‌ అవుతాం. ఇంతకాలం ప్రతిఒక్కరి కోసం మీరు నిలిచినందుకు ధన్యవాదాలు. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ - ప్రకాశ్‌రాజ్‌

‘నటుడిగా నా కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించిన, నాకు అండగా నిలిచిన నా సోదరుడు, స్నేహితుడు రాజు మరణ వార్తతో హృదయం ముక్కలైంది. ఆయన స్థానాన్ని పూడ్చడానికి ఎంతో కాలం పడుతుంది’ - విశాల్‌

‘దీనిని నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని వారాల క్రితమే రాజుగారిని కలిశాను. ఆయన ఎంతో మంచి మనస్సున్న గొప్ప వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ పలికరించేవారు. చిరునవ్వుతో ప్రతిఒక్కర్నీ ప్రోత్సహించేవారు’ - ఆనంద్‌ దేవరకొండ

‘రాజుగారి అకాలమరణం నన్ను షాక్‌కు గురి చేసింది. సినీ జర్నలిజంలో ఎన్నో విలువలు తెలిసిన గొప్ప వ్యక్తి. మా కుటుంబానికి మంచి ఆప్తుడు, తరచూ మమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ - నాగశౌర్య

‘మా బ్యానర్‌ ప్రారంభమైన నాటి నుంచి బీఏరాజుగారితో మాకెంతో అనుబంధం ఉంది. నేడు ఆయన అకాల మరణం మమ్మల్ని ఎంతో కలచివేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ఆయన మరణం పెద్ద లోటు’ - ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌

‘సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌, పీఆర్వో రాజుగారి అకాల మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఆయన నాతో కలిసి పనిచేశారు. మన సినీ పరిశ్రమకు ఇదొక పెద్ద లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ - కల్యాణ్‌రామ్‌

‘ప్రతి శుక్రవారం విడుదలై సినిమా విజయం సాధిస్తుందని నమ్మే ఒకే ఒక్క వ్యక్తి రాజు గారు. ఆయన్ని ఇకపై ఎంతో మిస్‌ అవుతాం. మీరు చూపించే అమితమైన ప్రేమ, మీ వాట్సాప్‌ మెస్సేజ్‌లు మిస్‌ అవుతాం’ - నాని

‘బీఏరాజు అకాలమరణం మమ్మల్ని ఎంతో కలిచివేస్తోంది. స్వచ్ఛమైన మనస్సు కలిగిన, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే గొప్ప వ్యక్తి. ఆయన మా కుటుంబసభ్యుడు. ఆయన స్థానాన్ని ఇకపై ఎవరూ పూడ్చలేరు. ఆయన కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ - సురేశ్‌ ప్రొడెక్షన్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని