చలించిన రిషభ్‌ పంత్‌.. ఆక్సిజన్‌ కోసం విరాళం.. - rishabh pant announced to donate for an ngo which helps buying oxygen and medical kits
close
Published : 08/05/2021 21:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చలించిన రిషభ్‌ పంత్‌.. ఆక్సిజన్‌ కోసం విరాళం..

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులను చూసి టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ చలించిపోయాడు. ఏడాది కాలంగా ఈ మహమ్మారి వేలాది మందిని బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రెండో దశలోనూ పాజిటివ్‌ కేసులు, మరణాలు అధికమవుతున్నాయి. ప్రజలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు లేక నిత్యం ఎంతో మంది కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవన్నీ తనను కలచివేశాయని, దాంతో హేమ్‌కుంత్‌ ఫౌండేషన్‌కు విరాళం అందజేస్తున్నానని పంత్‌ ఓ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు.

‘మన దేశంలో నిరాశ, నిర్వేదం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దాంతో నేను కూడా ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక సన్నిహితుడిని కోల్పోయిన వ్యక్తిగా.. ఏడాది కాలంగా ఎంతో మందిని కోల్పోయిన కుటుంబాల పరిస్థితులను అర్థం చేసుకోగలను. ఈ సందర్భంగా ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మనల్ని వీడిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆటగాడిగా క్రీడల నుంచి నేను ఓ ముఖ్యమైన విషయం నేర్చుకున్నా. ఒక నిర్దిష్టమైన ఫలితం కోసం బృందంగా కలిసి పనిచేస్తే వచ్చే శక్తి ఏంటో తెలుసుకున్నా. ఏడాది కాలంగా ప్రజలకెంతో సహాయం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇదే నా వందనం. ఈ కష్టకాలాన్ని అధిగమించేందుకు సహాయం చేయడానికి మనందరి సమిష్టి కృషి అవసరం’ అని పంత్‌ పేర్కొన్నాడు.

‘నేను హేమ్‌కుంత్‌ ఫౌండేషన్‌కు విరాళం అందజేస్తున్నా. అది ఆక్సిజన్‌ సిలిండర్లు, పడకలు, కొవిడ్‌ రిలీఫ్ కిట్లు అందజేయడానికి ఉపయోగపడతాయి. ప్రధాన నగరాలతో పోలిస్తే మౌలిక వసతుల సామర్థ్యం లేని గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలకు వైద్య సహాయం అందించే సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నా. ఈ సందర్భంగా మీరు కూడా తగినంత విరాళాలు అందజేయాలని కోరుతున్నా. దాంతో మనమంతా మారుమూల ప్రాంతాలకు వైద్య సదుపాయం కల్పించవచ్చు. అలాగే కరోనాపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ అవగాహన, వాక్సినేషన్‌ కార్యక్రమాలను కూడా వారికి తెలియజేయవచ్చు’ అని పంత్‌ వివరించాడు. చివరగా అందరూ జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన నిబంధనలు పాటించాలని కోరాడు. వీలైతే వాక్సినేషన్‌ కూడా చేయించుకోవాలని సూచించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని