Rohit sharma: ఎక్కువ ‘హిట్‌’ అవ్వాలంటే..! - rohit sharma should more concentrate on the ball in england series
close
Published : 25/05/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rohit sharma: ఎక్కువ ‘హిట్‌’ అవ్వాలంటే..!

మరింత ఏకాగ్రతతో ఆడాలన్న రోహిత్‌ చిన్ననాటి కోచ్‌

ముంబయి: ఓపెనర్‌ రోహిత్‌శర్మ టీమ్‌ఇండియాకు శుభారంభాలు అందించాలని అతడి చిన్ననాటి కోచ్‌ దినేశ్‌ లాడ్‌ అన్నాడు. బంతి ఎక్కువగా స్వింగ్‌ అయ్యే ఇంగ్లాండ్‌లో  మరింత శ్రద్ధగా ఆడాలని సూచించాడు. అక్కడి పరిస్థితులకు హిట్‌మ్యాన్‌ త్వరగానే అలవాటు పడతాడని ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో ఆరంభాలు బాగున్నా భారీ స్కోర్లు చేయలేకపోయాడని చెప్పారు. ఈ సారి మాత్రం అలా చేయొద్దని సలహా ఇచ్చాడు.

రోహిత్‌ 2014లో చివరిసారిగా ఇంగ్లాండ్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడాడు. అదీ మిడిలార్డర్లోనే కావడం గమనార్హం. టెస్టుల్లో ఓపెనర్‌గా మారాక అతడు మంచి స్కోర్లు చేస్తున్నాడు. శతకాలు బాదేస్తున్నాడు. బంతి ఎక్కువగా స్వింగ్‌ అయితే హిట్‌మ్యాన్‌ ఇబ్బంది పడే సంగతి తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఐదు శతకాలు బాదిన అనుభవం అతడికున్నా టెస్టు సిరీసులో ఎలా రాణిస్తాడోనన్న ఆత్రుత అభిమానుల్లో ఉంది.

‘ఇంగ్లాండ్‌లో రోహిత్‌ మరింత ఏకాగ్రతతో ఆడాలి. ప్రతి బంతినీ పక్కగా అంచనా వేయాలి. ఎందుకంటే అక్కడ స్వింగ్‌ అధికంగా ఉంటుంది. భారత్‌లో ఆంగ్లేయులతో జరిగిన సిరీసులో హిట్‌మ్యాన్‌ చాలా బాగా ఆడాడు. టర్నింగ్‌ పిచ్‌లపై చక్కని క్రికెటింగ్‌ షాట్లతో అలరించాడు. అవే వికెట్లపై మిగతా బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడటం మనం చూశాం. రోహిత్‌ ఇంగ్లాండ్‌ పరిస్థితులకు అలవాటు పడతాడన్న నమ్మకం ఉంది. బంతి స్వింగ్‌ అవుతుంది కాబట్టి కొన్ని సమస్యలు ఎదురవ్వొచ్చు. ఎక్కువ దృష్టి పెడితే రాణించొచ్చు. నెట్‌సెషన్స్‌, సాధన మ్యాచుల్లో నాణ్యమైన పేసర్లను ఎదుర్కొంటే అతడికి పరిస్థితులపై అతడికి అవగాహన వస్తుంది’ అని దినేశ్‌ అన్నాడు.

‘ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాలోనూ రోహిత్‌ బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు అతడి షాట్ల ఎంపిక సులభంగా అనిపించింది.  ఔటయ్యేలా ఎప్పుడూ కనిపించలేదు. కానీ కొన్ని ఇన్నింగ్సుల్లో మాత్రం తేలిగ్గా వికెట్‌ ఇచ్చేశాడు. ఈసారి మాత్రం అలా చేయొద్దు’ అని దినేశ్ లాడ్‌ సూచించాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని