బుల్లితెరపై ఓ మేజిక్‌... యమలీల ..ఆ తర్వాత - s v krishna reddy special interview about yamaleela telugu daily serial on ETV
close
Published : 13/09/2020 18:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్లితెరపై ఓ మేజిక్‌... యమలీల ..ఆ తర్వాత

ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్‌పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదం, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో ‘యమలీల’ ఓ సంచలనం. పాతికేళ్ల్లుగా హాస్యనటుడిగానే అలరించిన అలీ, ఈ సినిమాతో కథానాయకుడిగా మారాడు. ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా ‘యమలీల... ఆ తర్వాత’ పేరుతో ఓ ధారావాహిక రూపొందింది. ‘యమలీల’లో నటించిన అలీ, మంజు భార్గవి ఇందులోనూ తల్లీకొడుకులుగా నటించడం విశేషం. ఈ నెల 21వతేదీ(సోమవారం) రాత్రి 8 గంటలకి ఈటీవీలో ప్రసారం కానుందీ ధారావాహిక. దీనికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ... ●

* బుల్లితెరతో ప్రయాణం ఇదే తొలిసారి కదా...?

నిజానికి ఇదొక కొత్త ఆలోచన. సినిమా తర్వాత కథని ఇలా కూడా చెప్పొచ్చా? అనిపించింది. అందులోనూ సినిమాలోని తారలే మళ్లీ ఈ కథలో కనిపిస్తారు. ఇదొక గొప్ప ప్రయత్నం అనిపించింది. రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు, దర్శకుడు సురేష్‌, సహాయ దర్శకుడు బాలాజీ... ఇలా మేమంతా కలిసి ఈ కథని తీర్చిదిద్దాం. నాకు ఏ కథనైనా సినిమా కోసం రెండు, రెండున్నర గంటల నిడివితో చెప్పడమే అలవాటు. తొలిసారి ధారావాహిక కోసం అల్లడం కొత్త అనుభవాన్నిచ్చింది. ప్రేక్షకులతో మళ్లీ నిరంతరం టచ్‌లో ఉండే అవకాశం ‘యమలీల... ఆ తరువాత’తో దక్కింది. ‘ఈటీవీ’ కలగజేసిన ఓ గొప్ప అవకాశమిది.

* అప్పట్లో ‘యమలీల’ కథ ఎలా పుట్టింది? ఆ సినిమా మీపైన, మీ కెరీర్‌పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించింది?

రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన నుంచే ‘యమలీల’ కథ పుట్టింది. పైన బెర్త్‌లో పడుకుని ఎదురుగా ఉన్న ఫ్యాన్‌ చూస్తూ ‘ఇది కిందపడితే ఏంటి పరిస్థితి?’ అనుకున్నా. అలా కింద పడితే అనే అంశం గురించి అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు ‘ఆకాశం నుంచి మన భవిష్యత్తు గురించి రాసిన పుస్తకం పడిపోతే? అది మరొకరికి దొరికితే?’ అనే విషయాలపై ఆలోచనలు వచ్చాయి. అక్కడ్నుంచి అల్లుకున్న కథే ‘యమలీల’.

* కుటుంబ నేపథ్యంతో సినిమాలు తీయాలంటే గుర్తుకొచ్చే దర్శకుల్లో మీరుంటారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న కథలపైనా, ఈ ట్రెండ్‌పైనా మీ అభిప్రాయమేమిటి?

ఎప్పుడు ఏది అవసరమో, అప్పటికి అది తయారు చేస్తూ ఉంటుంది పరిశ్రమ. ప్రేక్షకులు ఏది ఆదరిస్తుంటారో దాన్నే అనుసరించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఎప్పుడైనా సరే... ప్రేక్షకులకి ఏదైనా కొత్తగా చెప్పగలిగితే తప్పకుండా స్వీకరిస్తారు. వాళ్లకి విభిన్నమైన రుచులు కావాలి. అలా దర్శకుడిగా నేనూ కొన్ని రుచుల్ని అందించా. వినోదం, సెంటిమెంట్‌ అనే అంశాలు నిరంతరం. వినోదాన్ని ఆస్వాదించడం మనిషి ఒక్కడికే అందిన ఓ గొప్ప అవకాశం, అదృష్టం. మనిషి గుండె కొట్టుకున్నంతసేపు సెంటిమెంట్‌ ఉంటుంది. అలా మనిషి భావోద్వేగాలపై దృష్టి పెట్టి కథలు చెబుతుంటా. ప్రస్తుతం మనుపటిలా కంటెంట్‌ ప్రధానంగా సాగే సినిమాలొస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ఉద్ధృతి మరింత పెరుగుతుంది.

* ఓటీటీల హవా నడుస్తోంది. ‘యమలీల... ఆ తరువాత’ తరహాలో కథల్ని ఓటీటీ కోసం తెరకెక్కించే ఆలోచనులున్నాయా?

ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ని నేను గమనిస్తుంటా. అక్కడ థ్రిల్లర్‌ కథలు, ట్రెండీ కథలు ఎక్కువగా రూపొందుతుంటాయి. నేను అటువైపుగా ఇంకా ఆలోచించలేదు. తదుపరి సినిమాల కోసమే రెండు స్క్రిప్టులు తయారు చేసుకున్నా. అందులో ఒకటి ‘వినోదం’ తరహాలో ఆద్యంతం నవ్వించే కథ. పరిస్థితులు అనుకూలించగానే చిత్రీకరణ మొదలు పెడతాం.●

* ‘యమలీల’ కథ ఎక్కడ ముగిసిందో, అక్కడ్నుంచే ఈ ధారావాహిక మొదలవుతుందా?

కొన్నాళ్ల తర్వాత మొదలయ్యే కథ ఇది. తల్లి మాట జవదాటకుండా ఆమె చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కథానాయకుడు. అక్కడ్నుంచి జరిగే కథే ఇది. ఇందులో తల్లి - కొడుకుతోపాటు, తండ్రి - కూతురు బంధాలు, ఆ నేపథ్యంలో సెంటిమెంట్‌ ఉంటుంది. సినిమాలోలాగే ఇక్కడా తల్లిగా మంజు భార్గవి, తనయుడిగా అలీ కనిపిస్తారు. సుమన్‌ యముడిగా నటించారు. శేఖర్‌ కెమెరా పనితనం, ఈశ్వర్‌ సంగీతం ధారావాహికకు బాగా కుదిరాయి.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని