
తాజా వార్తలు
సుహాసిని ఏడిపించేది... చిరంజీవి షూ తెచ్చి ఇచ్చారు
కళాతపస్వి కె.విశ్వనాథ్ మలిచిన ‘సప్తపది’తో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటీనటులు సబిత-గిరీశ్. 40 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ‘ఆలీతో సరదాగా’లో సందడి చేశారు. వారి నట జీవితం ఎలా మొదలైంది, సబిత ఎందుకు ఒక్క చిత్రానికే పరిమితమయ్యారు, గిరీష్ కొడుకు విలన్‌గా ఎందుకొచ్చాడు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవన్నీ మీ కోసం...
ఆలీ: విజయనగరం అమ్మాయి.. హైదరాబాదీగా ఎలా మారింది?
సబిత: మాది విజయనగరం... తెలుగు చిత్రసీమతో హైదరాబాదీగా మారాను. ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో మేనేజర్‌గా చేస్తున్నాను.
ఆలీ: అన్నా... మనం మొదటిసారిగా ఎక్కడ కలిశాం?
గిరీశ్: ఎస్.ఆర్.నగర్ గల్లీలో కలిశాం. అక్కడ ‘మంచుపల్లకి’ షూటింగ్ చేశాం. అందులో ఐదుగురు హీరోలున్నారు. చిరంజీవి, నారాయణరావు, రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్, నేను నటించాం. ఆ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు.
ఆలీ: మీ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు?
సబిత: ఆయన సైంటిస్ట్. అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేశారు. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ’లో డిప్యూటీ డైరెక్టరుగా పని చేశారు.
ఆలీ: ఒక్క సినిమాతోనే ఎందుకు పరిశ్రమ నుంచి నిష్క్రమించారు?
సబిత: అప్పట్లో మా తల్లిదండ్రులకి నచ్చలేదు. సినీరంగమంటే కొంచెం భయపడ్డారు.
ఆలీ: ఇంట్లో వాళ్లు భయపడ్డారా? మీరు భయపడ్డారా?
సబిత: నాకు అప్పుడు ఏం తెలియదు. చేసిందేదో చేశాను, వచ్చేశాను.
ఆలీ: ఎలా వచ్చింది మీకు ఆ అవకాశం?
సబిత: విశ్వనాథ్‌గారు ఓసారి నా డ్యాన్స్ కార్యక్రమం చూశారు. మా డ్యాన్స్ టీచర్ ఉమా రామారావుకి విశ్వనాథ్ గారు బాగా తెలుసు. ఆ సమయంలో విశ్వనాథ్‌గారు ‘శుభోదయం’, ‘సప్తపది’ కోసం కథానాయికలను చూస్తున్నారు అని తెలిసి మా గురువు గారు నా ఫొటోలు పంపించారు. ముందు నన్ను ఎంచుకోలేదు. కానీ ఆ తర్వాత నాకు అవకాశం లభించింది.
ఆలీ: సినీ రంగంలోకి ఎలా ప్రవేశించారు?
గిరీశ్: 1981లో చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కన్నడ బ్యాచ్‌లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాను. ఆ సమయంలో విశ్వనాథ్ గారి బృందం ఇన్స్టిట్యూట్కి వచ్చింది. అయితే ఆ రోజు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్లలేదు. విశ్వనాథ్ గారి టీమ్ అందరినీ చూసి పాత్రకు తగ్గట్టుగా లేరు అని వెళ్లిపోయారు. అప్పుడే మా గురువు గారు కన్నడ బృందంలో ఓ స్టూడెంట్ ఉన్నాడు.. చూస్తారా అని అడిగారు. దాంతో వారు ఆ అబ్బాయిని బుచ్చిరెడ్డిగారి ఆఫీస్‌కి రమ్మన్నారు. కానీ వారిని ఎలా సంప్రదించాలో తెలియలేదు. నంబరు లేదు, వివరాలు లేవు. రెండు రోజుల తర్వాత నేను టి.నగర్ బస్టాండ్‌లో బస్ కోసం ఎదురు చూస్తున్నాను. అక్కడ నేను మళ్లీ ఆ బృందం కంటపడ్డాను. అప్పుడు బుచ్చిరెడ్డి గారి ఆఫీసుకు తీసుకెళ్లారు. ఆ తరువాతి రోజు ఉదయం ఏడు గంటలకు విశ్వనాథ్‌గారి ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన పూజ చేసుకొని గంభీరమైన రూపంలో వచ్చారు. ఆయనను చూడగానే భయమేసింది. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. బుచ్చిరెడ్డి గారి ఆఫీసుకి వెళ్లి ఫొటో షూట్ చేద్దామన్నారు. అక్కడే నేను మొదటిసారిగా సబితను కలిశాను.
ఆలీ: ఆ రోజుల్లో ఫొటో షూట్ కూడా చేశారా?
సబిత-గిరీశ్: మా ఇద్దరి కాంబినేషన్ ఎలా వస్తుంది అని ఫొటోషూట్ చేశారు. అప్పుడు స్క్రీన్ టెస్ట్ అని నన్ను చెన్నైకి పిలిచారు. ‘హేమమాలినినే తిరస్కరించాం. మీరు ఎంపికవుతారో? లేదో? అనేది మాకు తెలియదు’ అని విశ్వనాథ్‌గారి టీమ్ అన్నారు. ఈలోగా విశ్వనాథ్ గారు అక్కడకు వచ్చి చూసి ఓకే చేసేశారు.
ఆలీ: విశ్వనాథ్ గారు ఏం చూశారు? కథానాయికగా మీకు అంత పెద్ద అవకాశం ఇచ్చారు?
సబిత: అదే అర్థం కాలేదు (నవ్వులు).
ఆలీ: మరి ఇప్పుడైనా అర్థమైందా?
సబిత: లేదు. నేను ఎప్పుడూ వేరే వాళ్లని చూసి సంతోషిస్తుంటాను. నా కంటే వాళ్లే అందంగా ఉన్నారనిపిస్తుంటుంది. నేను బాగుంటాననే భావన నాకెప్పుడూ కలగలేదు. అలాగే నా నాట్యం కంటే ఇతరులదే బాగుంది అనిపిస్తుంటుంది.
ఆలీ: మీది ఏ ఊరు? అక్కడి నుంచి చెన్నై ఇన్స్టిట్యూట్కి ఎలా వచ్చారు?
గిరీశ్: మాది కర్ణాటకలోని దార్వాడ్. బీఎస్సీ ఫొరెన్సిక్ సైన్స్ క్రిమినాలజీ చేశాను. నేను ఐపీఎస్ కోసం ప్రిపేర్ అవుతుండేవాడిని. సెప్టెంబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉంది. అదే సమయంలో అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూ వచ్చింది. జూలైలో ఆ ఇంటర్వ్యూలో పాల్గొని చెన్నై వచ్చేశాను.
ఆలీ: తెలుగు సినీ రంగం హైదరాబాద్‌కు రావటం వల్లే మీరు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందా? సినిమాలు కొనసాగించారా?
గిరీశ్: అలా అని ఏమీ లేదు. కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించాను. తెలుగులో ‘శుభలేఖ’, ‘సిరివెన్నెల’, ‘మంచుపల్లకి’ లాంటి చిత్రాలు చేశాను. కన్నడలోనూ కొన్ని సినిమాలు చేశాను.
ఆలీ: ఎన్ని సినిమాలు చేశారు? ఆ తర్వాత సినిమాలు వద్దనుకున్నారా?
గిరీశ్: మొత్తం 12 సినిమాలు చేశాను. సినిమాలు కొనసాగించాను. ఆ తర్వాత వ్యాపారం చేద్దామని, ఓ కెమికల్ బిజినెస్ ప్రారంభించాను.
ఆలీ: ఆ బిజినెస్‌లో సక్సెస్ అయ్యారా?
గిరీశ్: సక్సెస్ అయ్యాను. అయితే అప్పుడప్పుడు యాడ్స్ చేస్తూ కెమెరా ముందుకు వస్తుంటాను.
ఆలీ: నటన అనేది ప్యాషనా మీకు?
గిరీశ్: కెరీర్‌గా మొదలుపెట్టాను. ఇప్పుడు ప్యాషన్‌గా మిగిలిపోయింది.
ఆలీ: మీ అమ్మ టీచర్, నాన్న పోలీస్... వారిద్దరూ మీతో ఎలా ఉండేవాళ్లు?
సబిత: అమ్మనాన్న నాతో చాలా సరదాగా ఉండేవారు. మేము మొత్తం ఐదుగురం. అక్కలిద్దరూ ఇండియాలోనే ఉన్నారు. ఇద్దరు సోదరులు అమెరికాలో ఉంటున్నారు.
ఆలీ: నాట్యం అంటే మీకు ఇష్టం కదా. బాగా చదువుకోకపోతే తల్లిదండ్రులు ఏమంటారో అని చదువుకుంటూ నాట్యం చేసేవారట కదా?
సబిత: చదువురాకపోతే కష్టం అని మా తల్లిదండ్రులు నాట్యం మానేయమనేవారు. కానీ నేను రెండూ కంటిన్యూ చేశాను.
ఆలీ: కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పని చేయటం మీకు ఎలా అనిపించింది?
సబిత: అప్పుడు సినిమాల గురించి నాకు పెద్దగా తెలియదు. అమ్మానాన్న కూడా ఏం చెప్పలేదు. తర్వాత విశ్వనాథ్ గారి గురించి తెలుసుకున్నాను. ఆయన గొప్పతనం గురించి సినిమా చిత్రీకరణ జరిగిన రోజుల్లో తెలిసింది. ఆ తర్వాత ఆయనతో పని చేయడం చాలా అదృష్టంగా భావించాను.
ఆలీ: విశ్వనాథ్ గారిని ఖాకీ దుస్తుల్లో చూశారు కదా. ఆ దుస్తులు ఎందుకు వేస్తారు?
గిరీశ్: షూటింగ్ జరుగుతున్న సమయంలో క్రమశిక్షణగా ఉండాలి. దాని కోసం ఆయన ఖాకీ ధరిస్తారు. సాధారణ సమయంలో విశ్వనాథ్‌గారు సరదాగా ఉంటారు. అదే ఖాకీ డ్రెస్ వేస్తే... సీరియస్‌గా మారిపోతారు. ‘ఫొటో షూట్ తరువాత నీకు మురళి వాయించటం తెలుసా?’ అని అడిగారు. నేనేమో రాదు అన్నాను. దానికి ఆయన ‘నీకు రెండు లోపాలు ఉన్నాయి. ఒకటి తెలుగు రాదు, రెండోది మురళి వాయించటం రాదు’ అని అన్నారు. ‘రోజూ నువ్వు మురళి వాయించడం నేర్చుకోవాలి’ అని ఆదేశించారు. నేను ఫ్లూట్ నేర్పే బాలసుబ్రమణ్యం దగ్గర రోజూ ఉదయం ఏడు గంటలకు వెళ్లి మురళి వాయించడంలో శిక్షణ తీసుకున్నాను, ఆ తర్వాత తెలుగు నేర్చుకున్నాను.
ఆలీ: ఆయన దర్శకత్వంలో పని చేయటం ఎలా అనిపించింది?
గిరీశ్: ఆయన నా దగ్గర నుంచి ఏం ఆశించారో తెలియదు. ఎలా నటించాలో ఆయన చేసి చూపించారు. ఆయన చేసిన దాంట్లో ఒక్క శాతం చేసిన మనం సాధించినట్లే కదా.
ఆలీ: ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న సమయంలో కథానాయిక సుహాసిని మిమ్మల్ని పాట పాడమని ర్యాగింగ్ చేశారట కదా?
గిరీశ్: నాకంటే సుహాసిని ఒక సంవత్సరం సీనియర్. మద్రాస్‌లో మొట్టమొదటి స్నేహితురాలు సుహాసిని. అనుకోకుండా ఒక్కసారిగా ‘హలో, ఇక్కడకు రా? నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు? అని అన్నారు. అప్పుడు ‘మీరు ఏం చేయాలో చెబితే చేస్తాను’ అన్నాను. సరే అయితే ఒక పాట పాడు అన్నారు. నాకు హిందీ పాటలు మాత్రమే వచ్చు అన్నాను. అదే పాడు.. అంటే ‘డాన్’లో నుంచి ‘ఓ కైకే పాన్ బనారస్ వాలా...’ పాట పాడాను. ఆ తర్వాత మరో పాట, మరో పాట అంటూ వరుసగా పాడించుకున్నారు.
ఆలీ: సుహాసినితో ఏవైనా సినిమాలు చేశారా?
గిరీశ్: ఆమెతో ‘మంచుపల్లకి’, ‘సిరివెన్నెల’ చేశాను. ఇటీవలే లాక్డౌన్ సమయంలో మణిరత్నం-సుహాసిని కలసి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఐదు కథల ఎంథాలజీతో ఒక కథలో నేను నటించాను. ఇంకా ఆ చిత్రం విడుదల కాలేదు.
ఆలీ: స్టార్స్ తమ పిల్లల్ని హీరోగా తెరకు పరిచయం చేయాలనుకుంటారు. కానీ మీరు మీ అబ్బాయిని విలన్‌గా పరిచయం చేయలనుకున్నారు? మీరు చేయలేని విలన్ పాత్రను మీ అబ్బాయితో చేయించాలనుకున్నారా?
గిరీశ్: అది ధనుష్ ఆలోచన. మా అబ్బాయి తొలుత ‘రఘువరన్ బీటెక్’లో నటించాడు. అమితాబ్ బచ్చన్లోని అమి, నా పేరులోని ఈష్ తీసుకొని మా వాడికి అమితాష్ అనే పేరు పెట్టాను. హలీవుడ్లో ‘హార్ట్‌బీట్స్’లో లీడ్ యాక్టర్‌గా నటించాడు. ఆ తర్వాత రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’లోనూ నటించాడు.
ఆలీ: విలన్‌గా చేయాలనే ఆలోచన ధనుష్ చెప్తే వచ్చిందా?
గిరీశ్: అమితాష్ మద్రాస్ అన్నా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చేశారు. తర్వాత ముంబయిలో అనుపమ్ ఖేర్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేశారు. అమితాష్ పదో యేట నుంచే ఇంగ్లిష్ థియేటర్ ఆర్టిస్ట్. నటన అంటే ప్రాణం. సంగీత దర్శకుడు అనిరుధ్, అమితాష్ చిన్ననాటి స్నేహితులు. అనిరుధ్ సోదరి వివాహ వేడుకలో అమితాష్ను ధనుష్ చూసి ‘రఘువరన్ బీటెక్’లో విలన్‌గా నటిస్తావా అని అడిగారు. నేను అప్పుడు ‘ఎందుకు కెరీర్ విలన్‌గా మొదలుపెట్టడం’ అన్నాను. దానికి ఆయన ‘రజనీకాంత్ కూడా విలన్‌గా కెరీర్ మొదలు పెట్టారు’ అని గుర్తు చేశారు. దీంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అలా అమితాష్ తన కెరీర్ విలన్‌గా మొదలు పెట్టాడు.
ఆలీ: మీరు ‘సప్తపది’ మొదటి రోజు షూటింగ్‌కి వెళ్తుంటే కొందరు వచ్చి మీ కార్ ఆపి, కిందకి దిగండి చూస్తాం అన్నారట.. ఎవరు వాళ్లు, ఏంటా కథ?
సబిత: చిత్రీకరణ మొదలైన తొలి రోజున కొత్త కథానాయికను చూడాలని చాలామంది కళాశాల విద్యార్థులు నేనున్న రూమ్ దగ్గరకు వచ్చారు. దీంతో చిత్రబృందం నన్ను రూమ్ నుంచి బయటకు రావద్దన్నారు. ఆ సమయంలో సినిమాలోని రెండో కథానాయిక షూటింగ్‌కు వెళ్తోంది. ఇంతలో ఎవరో ‘కథానాయిక కారులో వెళ్తోంది’ అనేసరికి అందరూ ఆమె కారువైపు పరుగు తీశారు. జనాలు వెళ్లిపోయాక నన్ను షూటింగ్‌కి తీసుకెళ్లబోయారు. ఈ లోగా వారికి అసలు విషయం తెలిసి వెనక్కి వచ్చారు. నా కారు ముందుకు వచ్చి, డోర్ తీసి, నన్ను బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన అమరావతిలో జరిగింది.
ఆలీ: ‘సప్తపది’ విడుదల తర్వాత ప్రజల్లో వెళ్తునప్పుడు మీకెలా అనిపించేది?
సబిత: ఈ చిత్రం అయిపోయిన తర్వాత ‘నువ్వు కోఠిలో నడువు.. నేను చూస్తాను’ అని విశ్వనాథ్‌గారు నాతో ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత నేను కొన్ని రోజులు బయటకు వెళ్లలేదు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న తీసుకెళ్లారు. నేను మా కళాశాలకు వెళ్లగానే విద్యార్థులందరూ నా చుట్టూ చేరేవారు.
ఆలీ: ‘సప్తపది’ చివరి షెడ్యూల్ సమయంలో, ఎవరో ఒక పెద్దాయన వచ్చి, నా కుమార్తెను వివాహం చేసుకుంటే, నా మొత్తం ఆస్తి ఇచ్చేస్తాను, నా బిజినెస్ మీకు ఇచ్చేస్తాను. న్యూజిలాండ్ వచ్చేయి అని అడిగారట?
గిరీశ్: నా అభిమాని ఒక అమ్మాయి వచ్చి ‘నా చేతిపై మీ పేరు రాయండి’ అని అడిగింది. నేనెప్పుడూ అలా చేయలేదు అన్నాను. ‘నేను అందరికంటే భిన్నం’ అని ఏదేదో చెప్పింది. తర్వాత ‘మా తల్లిదండ్రులు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీరు డిన్నర్‌కు రావాలి’ అని అడిగింది. ఆ తర్వాత ఆమె సోదరుడు కూడా వచ్చి అడిగారు. ‘నేను షూటింగ్ అయ్యాక సాయంత్రం వస్తాను’ అని చెప్పాను. ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా ఆ అమ్మాయి వాళ్ల నాన్న ప్రపోజల్ తీసుకొచ్చారు. ‘మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... నా న్యూజిలాండ్ వ్యాపారం మొత్తం నీకే ఇచ్చేస్తా’ అన్నారు. ఈ మాట వినగానే మళ్లీ ఒకసారి ఆ అమ్మాయిని చూశాను. కాసేపు ఆలోచించి ఒప్పుకోలేదు.
ఆలీ: మీది పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమ వివాహమా?
గిరీశ్: నాది ప్రేమ వివాహం. తనది దార్వాడ. మేమిద్దరం ఒకే కాలేజీలో చదివేవాళ్లం. తర్వాత ప్రేమ, పెళ్లి.
ఆలీ: మీ ప్రేమ కథ వెనకాల కాలేజీలో ఎన్నికల యుద్ధం జరిగిందట కదా? ఆ ఎన్నికలే మిమ్మల్ని ఒకటి చేశాయట?
గిరీశ్: కాలేజీలో జనరల్ సెక్రటరీ ఎన్నికలు అంటే పెద్ద విషయం. అయితే నేను పోటీలో నిలబడకుండా... ‘రాజా’ అనే నా క్లాస్‌మేట్‌ను నిలబెట్టాను. క్లాస్, క్లాస్ తిరిగి ఎన్నికల ప్రచారం చేశాను. అదే సమయంలో కాలేజీకి కొత్తగా వీణ వచ్చింది. ఆమె ఉన్న క్లాస్‌కి వెళ్లి ‘రాజా’ గెలిస్తే కాలేజీకి ఏమేం చేస్తాం అనే విషయాల్ని వివరించాం. అది చూసి నచ్చి.. వీణ నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంది. అలా మా ప్రేమ మొదలై పెళ్లి జరిగింది.
ఆలీ: ఒక పాట చిత్రీకరణ సమయంలో మీరు ‘షూ’ మరచిపోతే.. ఒక పెద్ద హీరో షూ తెచ్చి ఇచ్చారట కదా? ఎవరా హీరో?
గిరీశ్: మన మెగాస్టార్ చిరంజీవి గారు. మద్రాస్‌లో ‘మంచుపల్లకి’ చిత్రీకరణ జరుగుతోంది. టెరస్‌పై ‘హ్యపీ న్యూ ఇయర్...’ పాట చేస్తున్నాం. అప్పుడు చిరంజీవి నన్ను చూసి ‘ఏంటి గిరు, షూ లేదు’ అని అడిగారు. ‘నాకు పాట అని తెలియదండీ’ అని అన్నాను. ఆ తర్వాత భోజన విరామంలో చిరు ఇంటికి తీసుకెళ్లి భోజనం చేసి, నా కోసం కొత్త షూ తెచ్చారు. ‘షూ లేకుండా సాంగ్ చేయలేం’ అని చెప్పి ఇచ్చి షూటింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికీ ఆ షూని నేను దాచుకున్నాను.
ఆలీ: ‘శంకరాభరణం’ హిందీ వెర్షన్ ‘సుర్‌సంగమ్’కి మీరు అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేస్తాను అని విశ్వనాథ్ గారిని అడిగారటా?
గిరీశ్: విశ్వనాథ్ గారు, నేను కార్లో వెళ్తున్న సమయంలో సర్ ‘మీరు ‘శంకరాభరణం’ని హిందీలో చేస్తే, నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలనుకుంటున్నాను’ అని అడిగాను. ఎందుకు అని అడిగారాయన. ‘శంకరాభరణం’ చాలా గొప్ప చిత్రం. ఆ సినిమా ఎలా తీస్తారు అనే విషయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా చూసి నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను’ అని చెప్పాను. ‘ఇప్పుడు ఇంకా ఏం అనుకోవట్లేదు. ఒకవేళ ఆలోచిస్తే తప్పకుండా పిలుస్తాను’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నన్ను పిలిచి ‘సుర్‌సంగమ్’ ప్రారంభిస్తున్నాం. దానికి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాలంటే నువ్వు హీరోవనే విషయం మరిచిపోవాలి’ అని అన్నారు. ఆయన చెప్పినట్లుగా హీరో అనే విషయాన్ని పక్కనపెట్టి ఆ సినిమాకు పని చేశాను.
ఆలీ: మీ తాతగారు పెద్ద సైంటిస్ట్ అని విన్నాను...
సబిత: ఆయన ప్యారిస్‌లో మేడమ్ క్యూరీతో కలసి పని చేశారు. యాక్టివ్ హైడ్రోజన్‌ను నేషన్ స్టేట్‌లో కనుగొన్నారు. ఇప్పటికీ ఆర్గానిక్, ఇనార్గానిక్ పుస్తకాల్లో ఆయన గురించి ఉంటుంది. డాక్టర్ వెంకటరామయ్య యాక్టివ్ హైడ్రోజన్‌గా గుర్తింపు పొందారు.
ఆలీ: మీది పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమ వివాహమా?
సబిత: నాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరం హైదరాబాద్‌లోనే కలిశాం. ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి. ఇద్దరు కవల అమ్మాయిలు. అందరూ విదేశాల్లోనే ఉన్నారు.
ఆలీ: మీ అల్లుడు హలీవుడ్లో సంగీత దర్శకుడా? ఏం సినిమాలు తీశారు?
సబిత: ‘హిట్‌మ్యాన్ బాడీగార్డ్’కి సంగీత విభాగంలో పని చేశారు. ఇప్పుడు అట్లీ ఓవర్సన్ అనే వ్యక్తి దగ్గర పని చేస్తున్నారు. ఐస్లాండ్లో ఉంటూ యూఎస్, యూరోపియన్ సినిమాలకు పని చేస్తారు. ఇక్కడ కూడా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘లూజర్’ అనే వెబ్ సిరీస్‌కు సంగీత దర్శకుడిగా పని చేశారు.
ఆలీ: మీరు హీరోయన్ అని మీ భర్తకు తెలుసా? మీ ‘సప్తపది’ చూశారా?
సబిత: ఆయన పెళ్లికి ముందు ‘సప్తపది’ చూశారు. మా పెళ్లి చూపులకు ముందు ఆయనకు నా డ్యాన్స్ క్యాసెట్ ఇచ్చారు. అది చూసి వచ్చారు. మా పెళ్లి చూపులు సమయంలో నాకు విషయం చెప్పకుండా... బెంగళూరు నుంచి హైదరాబాద్ రప్పించారు. తీరా ఇక్కడకి వచ్చాక నీకు పెళ్లి చూపులు అని చెప్పారు. అప్పుడు నేను కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉండేదాన్ని. పెళ్లి లాంటి ఆలోచనలే ఉండేవి కావు.
ఆలీ: మీరు ఇప్పటివరకు ఎన్ని నాట్య ప్రదర్శనలు ఇచ్చారు?
సబిత: హైదరాబాద్‌లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఆ తర్వాత సినిమా అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్లాను. అక్కడ అక్కినేని నాగేశ్వరరావుగారు నాతో మాట్లాడారు. ‘నీకు నటించే ఉద్దేశం ఉంటే.. మా సినిమాల్లో తీసుకుందాం అనుకుంటున్నాను’ అని అన్నారు. ‘అలాంటి ఆలోచన లేదు’ అని నేను చెప్పాను. ‘నీ లాంటి వాళ్లు మానేస్తే ఎలా... ఏం చేద్దాం అనుకుంటున్నావ్’ అని కోపంగా అడిగారు. లేదండి డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. చెన్నైలో వెంపటి చినసత్యంగారి దగ్గర సాంస్కృతిక నృత్యాన్ని నేర్చుకోవాలనేది నా కోరిక. సినిమాల్లో చేసేవారికి ఆయన నాట్యం నేర్పించరు అని విన్నాను అని ఏఎన్నార్‌గారికి చెప్పాను. ఆయన దగ్గరకు వెళ్లి నాట్యం నేర్పించమని అడిగితే.. కాదంటారేమో అని భయంగా ఉందని కూడా చెప్పాను. వెంటనే ఆయన ‘ఎందకమ్మా... ‘నాకు ఆయన తెలుసు. నేను సత్యంతో మాట్లాడతాను’ అని అన్నారు. ఆ తర్వాత రోజూ ఆయన నాతో మాట్లాడేవారు. అలా నన్ను నాగేశ్వరరావు గారు సత్యం గారి వద్దకు పంపించారు.
ఆలీ: ఇప్పటికీ మీరు నాట్యం చేస్తున్నారా?
సబిత: ఇప్పుడు చేయట్లేదు కానీ నాట్యానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులలో పని చేస్తున్నాను.
ఆలీ: విశ్వనాథ్ గారు మిమ్మల్ని చిన్న పిల్లను బుజ్జగించినట్లు, ఓపికతో చేయించుకున్నారట.. నిజమేనా?
సబిత: ఆయన ఏ రోజు ఆయన నాపై కోప్పడలేదు. కథ చెప్పి నాలోని భావాలను చూసి, మరింతగా ప్రోత్సహించేవారు. చాలా ఫ్రెండ్లీగా, ప్రొటెక్టివ్‌గా ఉండేవారు.
ఆలీ: విశ్వనాథ్ గారు ఎప్పుడైనా కోప్పడ్డారా?
గిరీశ్: ఆయన మా మీద కోప్పడింది లేదు. ఫ్రెండ్లీగానే ఉండేవారు. ఆయనకు నచ్చలేదంటే ఓ చూపు చూసేవారు. దాంతో మనం ఇంకా బాగా చేయాలని అర్థమైపోయేది.
ఆలీ: మొదటిగా మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు?
గిరీశ్: నాకు ₹5,001 ఇచ్చారు. ముందు ₹500 ఇచ్చారు. ఆ తర్వాత మద్రాసు వచ్చాక మిగిలిన డబ్బులు ఇచ్చారు. నిజానికి ₹500 ఇస్తారేమో అనుకున్నాను.
సబిత: నిజం చెప్పాలంటే రెమ్యూనరేషన్ అసలు విషయమే కాదు. ఇన్నేళ్లయినా ఆ చిత్రం అభిమానుల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయింది. అదే మాకు వెలకట్టలేని విలువ. ఇటీవల విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కినప్పుడు కూడా ‘సప్తపది’నే ప్రముఖంగా టెలీకాస్ట్ చేశారు.
గిరీశ్: ఐదారేళ్ల క్రితం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఓ మ్యూజిక్ అకాడెమీలో షో చేశారు. నేను, అమితాష్ ఆ షోకి వెళ్లాం. ‘ఎస్పీబీగారితో పరిచయం చేయవా’ అని అమితాష్ అడిగాడు. ఈ జనాల్లో ఎలా వీలవుతుంది అని అన్నాను. ఈ లోగా మమ్మల్ని చూసి గుర్తు పట్టి ‘హలో గిరీశ్ గారు’ అంటూ బాలు పలకరించారు. అదీ గుర్తింపు అంటే. ఎస్పీబీ జ్ఞాపకశక్తి చాలా మెండు.
ఆలీ: ఇప్పుడు మళ్లీ మీరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాల్లో చేస్తారా?
సబిత-గిరీశ్: తప్పకుండా చేస్తాం. మన దారిలో వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లడమే జీవితం.
ఆలీ: చిరంజీవికి ‘చిరు’ అని పేరు మీరే పెట్టారా?
గిరీశ్: అవును. గిరు, చిరులాగా. చిరు అని పెట్టాను.
ఆలీ: ‘సప్తపది’లో అమ్మవారితో భార్యను పోల్చే సీన్లో విమర్శలు ఏమైనా వచ్చాయా?
సబిత: ఆ రోజుల్లో రవికాంత్ (‘సప్తపది’లో భర్త పాత్రధారి) వచ్చి గది తలుపు వేయగానే థియేటర్లో అందరూ నవ్వేవారు. ఆయనకు ఫస్ట్ నైట్ ఏంటి అనుకునేవారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి ఆయన చూసిన చూపునకు థియేటర్ అంతా నిశ్శబ్దం అయ్యేది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
