సిరాజ్‌.. నీ పనికి గర్వపడుతున్నా: సచిన్‌  - sachin tendulkar felt happy for mohammed siraj cel
close
Updated : 18/02/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిరాజ్‌.. నీ పనికి గర్వపడుతున్నా: సచిన్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పట్ల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ శతకం సాధించిన వేళ సిరాజ్‌ చేసుకున్న సంబరాలు అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అశ్విన్‌ కన్నా ఎక్కువ సిరాజ్‌ సంతోషపడుతూ గాల్లోకి ఎగురుతూ, పంచులు విసురుతూ కనిపించాడు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌  అయింది. ఇదే విషయంపై తాజాగా స్పందించిన సచిన్‌.. సిరాజ్‌ చేసిన పనికి ఆనందించడమే కాకుండా అభినందించాడు.

బుధవారం రాత్రి ఓ ట్వీట్‌ చేసిన మాస్టర్‌ బ్లాస్టర్‌.. సిరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ సెంచరీ చేసినప్పుడు సిరాజ్‌ సంబరాలు చూడ్డానికి ఎంతో ఆసక్తిగా అనిపించాయి. వాటినెంతో ఆస్వాదించా. జట్టుగా ఆడే ఆటలో ఇలాంటివే ఉంటాయి. తోటి ఆటగాళ్ల ఘనతల్ని ఆస్వాదిస్తూ అందులో పాలుపంచుకోవడమే. టీమ్‌ఇండియా, సిరాజ్‌ పట్ల గర్వపడుతున్నా’ అని సచిన్‌ పేర్కొన్నాడు. అలాగే నాటి వీడియోను సైతం అభిమానులతో పంచుకున్నారు. దీనికి అశ్విన్‌ సైతం జవాబిచ్చాడు. సిరాజ్‌ జట్టు కోసం ఆడే ఆటగాడని మెచ్చుకున్నాడు.

కాగా, తాను 90 పరుగుల వద్ద  బ్యాటింగ్‌ చేస్తుండగా సిరాజ్‌ తన వద్దకొచ్చి మాట్లాడాడని అశ్విన్‌ గుర్తుచేసుకున్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్లో అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. సిరాజ్‌ చివరివరకూ క్రీజులో ఉంటాననే భరోసా ఇచ్చాడని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో అశ్విన్ ‌(79) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తుండగా సిరాజ్‌ పదో వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 49 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరికి అశ్విన్‌(106) శతకం పూర్తి చేసుకున్నాక స్టోన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇక బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మొత్తంగా 8 వికెట్లతో పాటు శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని