Radhe Review: రివ్యూ: రాధే - salman khan radhe movie review
close
Updated : 13/05/2021 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radhe Review: రివ్యూ: రాధే

చిత్రం: రాధే; నటీనటులు: సల్మాన్‌ఖాన్‌, దిశా పటానీ, రణ్‌దీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌, సుధాంశు పాండే, మేఘా ఆకాశ్‌ తదితరులు; సంగీతం: సంచిత్‌ బల్హరా, అంకిత్‌ బల్హరా (పాటలు: సాజిద్‌-వాజిద్‌, దేవిశ్రీ ప్రసాద్‌, హిమేశ్‌ రేష్మియా); సినిమాటోగ్రఫీ: అయాంక బోస్‌; ఎడిటింగ్‌: రితేశ్‌ సోని; నిర్మాత: సల్మాన్‌ఖాన్‌, సోహైల్‌ఖాన్‌, అతుల్‌ అగ్నిహోత్రి, నిఖిల్‌ నమిత్‌, జీ స్టూడియోస్‌; మూల కథ: ది అవుట్‌ లాస్‌ మూవీ; స్క్రీన్‌ప్లే, మాటలు: ఎ.సి.ముగిల్‌, విజయ్‌ మౌర్య; దర్శకత్వం: ప్రభుదేవా; విడుదల: జీప్లెక్స్‌

బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయానికి మంచి పేరుంది. వారిలో కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ ఒకరు. ఆయన చిత్రం వస్తుందంటే అభిమానులకు పండగే. కేవలం హిందీలోనే కాదు, ఇతర భాషల్లోనూ సల్మాన్‌కు అభిమానులు ఉన్నారు. తాజాగా ప్రభుదేవా దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘రాధే’. కొరియన్‌ చిత్రం ‘ది అవుట్‌ లాస్‌’ రీమేక్‌గా తెరకెక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న థియేటర్‌లతో పాటు, జీప్లెక్స్‌ వేదికగా అభిమానుల ముందుకొచ్చింది. మరి సల్మాన్‌ నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది? గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాంటెడ్‌’ను మరిపించిందా?

కథేంటంటే: రానా (రణ్‌దీప్‌ హుడా) ముంబయిలో పెద్ద డ్రగ్‌ డీలర్‌. తన చీకటి వ్యాపారాన్ని నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నంలో ఉంటాడు. ఇందుకోసం ఎలాంటి ఘాతుకానికైనా వెనుకాడడు. అతడిని అడ్డుకునేందుకు ముంబయి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతారు. గుండె ధైర్యం, తెగింపు ఉన్న పోలీస్‌ ఆఫీసర్‌ కోసం వెతుకుతారు. అప్పుడు వారికి రాధే (సల్మాన్‌ఖాన్‌) కనిపిస్తాడు. అప్పటికే అతడిపై సస్పెన్షన్‌ వేటు ఉండటంతో దాన్ని ఎత్తేసి విధుల్లోకి తీసుకుంటారు. దీంతో రంగంలోకి దిగిన రాధే.. పని మొదలు పెడతాడు. మరి రానాను అడ్డుకునేందుకు రాధే చేపట్టిన మిషన్‌ ఏంటి? ఈ క్రమంలో దియా (దిశా పటానీ) ఎలా పరిచయం అయింది? చివరకు రాధే తన మిషన్‌ పూర్తి చేశాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఈ ప్రపంచంలో ఉండేది ఏడు కథా వస్తువులే. ఎవరు రాసినా, ఏది రాసినా ఈ ఏడింటిలో నుంచే రాయాలి. అయితే, ఎలా రాశాం? ఎలా తీర్చిదిద్దాం? అన్న దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద హీరోల చిత్రాలంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. తమ హీరో వందమందిని రౌడీలను ఒకేసారి చితక్కొట్టాలి.. విలన్‌పై పంచ్‌డైలాగ్‌లు విసరాలి.. భారీ ఛేజింగ్‌ సన్నివేశాలు, యాక్షన్‌ సీన్లు ఉండాలి. కానీ, అవే ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలను బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిస్తున్నాయి. ‘రాధే’ విషయంలోనూ అదే జరిగింది. కేవలం అభిమానులను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ప్రభుదేవా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. డ్రగ్స్‌, మాఫియాను నడిపే ఒక విలన్‌.. అతడిని అడ్డుకునేందుకు ఒక పోలీస్‌ ఆఫీసర్‌.. ఈ ప్లాట్‌తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇందుకోసం కొరియన్‌ చిత్రాన్ని రీమేక్‌ చేయాల్సిన అవసరం కూడా లేదు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే నాలుగైదు హిట్‌ సినిమాలు చూస్తే చాలు! సినిమా మొదలైన దగ్గరి నుంచి చివరి వరకూ కథానాయకుడి పాత్రను హైలైట్‌ చేయడం తప్ప మరో సన్నివేశం కనిపించదు. కథ పాతదే అయినా దాన్ని ఆసక్తికరంగా మలిచి విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నా.. కనీసం ఆ ఛాయలు ‘రాధే’లో కనిపించవు.

అనవసర, అతి యాక్షన్‌ సన్నివేశాలు విసుగెత్తిస్తాయి. వాటికి తోడు ప్రతి సన్నివేశాన్ని సీజీఐలో తీర్చిదిద్దారు. ఎస్‌యూవీతో గాల్లోకి ఎగిరి హెలికాప్టర్‌ను ఢీకొట్టే సన్నివేశం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలా ప్రతి సీజీఐ సీన్‌ మరింత నాసిరకంగా ఉండటంతో మరో డ్రాబ్యాక్‌. సినిమా ఆసాంతం ప్రేక్షకుడి ఊహకు తగినట్టే నడుస్తుంది తప్ప.. ఒక్క సన్నివేశంలో కూడా ఉత్కంఠ, ట్విస్ట్‌ ఉండవు. ఎందుకు అత్యాచారాలు జరుగుతాయో..? ఎందుకు హత్యలు జరుగుతాయో తెలియకుండా సినిమా నడుస్తుంటుంది? మధ్యలో రాధే రావడం రౌడీలను చితక్కొట్టడం.. ఇది తప్ప సినిమాలో మరో సన్నివేశం ఉండదు. కథానాయిక దిశా పటానీ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం. సన్నివేశాలన్నీ సల్మాన్‌, దిశ, రణ్‌దీప్‌ హుడా, జాకీష్రాఫ్‌ మధ్య ఎక్కువ నడుస్తాయి. దీంతో చూసిన సన్నివేశాలనే చూశామా? అన్న నిర్లిప్తత ప్రేక్షకుడిలో కనిపిస్తుంది. పోనీ రణ్‌దీప్‌ హుడా పాత్రనైనా బలంగా తీర్చిదిద్దారా?అంటే అదీ లేదు. పతాక సన్నివేశాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.

ఎవరెలా చేశారంటే: రాధే కథను సల్మాన్‌ ఎలా ఒప్పుకొన్నాడో అర్థం కాదు. అస్సలు ఏమాత్రం కొత్తదనం కనిపించదు. ‘భారత్‌’, ‘ట్యూబ్‌లైట్‌’ వంటి చిత్రాలు చేసిన హీరో ఇతనేనా అనిపిస్తుంది. కేవలం యాక్షన్‌ సన్నివేశాలతోనే సినిమా హిట్‌ అయిపోదని సల్మాన్‌కు తెలుసు. మరి అన్నీ తెలిసి ఈ కథ ఎలా ఓకే చేశాడో అతడికే తెలియాలి. దిశ అందాల ఆరబోత, డ్యాన్స్‌లకు తప్ప ప్రత్యేకత ఏమీ లేదు. ప్రతినాయకుడిగా రణ్‌దీప్‌ హుడా మెప్పించలేకపోయాడు. సాంకేతికంగా సినిమా మరీ తీసికట్టుగా ఉంది. నేపథ్య సంగీతం తప్ప ఒక్క పాట కూడా అలరించదు. యాక్షన్‌ సన్నివేశాలన్నీ సీజేలో చేశారు. నాసిరకం సీజే సన్నివేశాలు తెరపై కనిపిస్తూనే ఉంటాయి. థియేటర్‌లో విడుదల చేసే పరిస్థితి లేదని తెలిసి, ‘మమ’ అనిపించినట్లు అర్థమవుతోంది. కొరియన్‌ మాఫియా డ్రామా ‘ది అవుట్‌ లాస్‌’ రీమేక్‌గా దర్శకుడు ప్రభుదేవా దీన్ని తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడనే చెప్పాలి.

బలాలు బలహీనతలు
+ సల్మాన్‌ఖాన్‌ - కథ, కథనాలు
  - దర్శకత్వం
  - యాక్షన్‌ సనివేశాలు

చివరిగా: ‘రాధే’.. సినిమా చూస్తే మీకు మిగిలేది ‘బాధే’
గమనిక: ఈ సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని