దేశం అయోమయ పరిస్థితుల్లో ఉంది - sc allows harish salve to withdraw as amicus raps some senior lawyers for imputing motives to it
close
Published : 23/04/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశం అయోమయ పరిస్థితుల్లో ఉంది

అమికస్‌ క్యూరీగా తప్పుకున్న హరీశ్‌ సాల్వే

సుప్రీం విచారణ ఏప్రిల్‌ 27కు వాయిదా

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతిపై సుప్రీంకోర్టు సుమోటోగా చేపడుతున్న విచారణ నుంచి ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే అమికస్‌ క్యూరీగా తప్పుకొన్నారు. దేశం ప్రస్తుతం అత్యంత అయోమయ స్థితిలో ఉందన్న సాల్వే.. న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత క్లిష్టమైన విచారణ ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే తనకు ఎప్పటినుంచో తెలిసి ఉన్నందున ఈ విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్లు తెలిపారు. 

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో వైరస్‌ నియంత్రణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేను కోర్టు సహాయకుడి(అమికస్‌ క్యూరీ)గా నియమించింది. అయితే సాల్వే నియామకంపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ ప్రారంభమైన వెంటనే అమికస్‌ క్యూరీగా తప్పుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. ‘‘ప్రస్తుతం దేశం అయోమయ పరిస్థితుల్లో ఉంది. న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత సున్నితమైన అంశం ఇది. అయితే సీజేఐ నాకు స్కూల్‌, కాలేజీ రోజుల నుంచే తెలుసు. అందువల్ల విచారణ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో నేను తప్పుకోవాలనుకుంటున్నాను’’అని సాల్వే తెలిపారు. ఆయన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. అయితే ఆయన నియామకం.. ధర్మాసనం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమే అని తెలిపింది. కాగా.. ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా మాట్లాడుతూ.. సాల్వే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. 

న్యాయవాదుల ఆరోపణలు బాధాకరం..

ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు నిర్ణయంపై కొందరు సీనియర్‌ న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టుల్లో విచారణను ఆపాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అయినా కొందరు న్యాయవాదులు తప్పుగా ఆపాదిస్తూ వాదనలు నిలిపివేయడం సరికాదని కోర్టు పేర్కొంది. అంతేగాక, సాల్వే వచ్చిన విమర్శలపైనా ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఈ కేసులో మరో అమికస్‌ క్యూరీని నియమించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొవిడ్‌ నియంత్రణపై కేంద్రం తన స్పందన తెలియజేయాలని ఆదేశించిన సుప్రీం.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 27నకు వాయిదా వేసింది. 

దేశంలో నెలకొన్న కరోనా కల్లోల స్థితిని సుప్రీంకోర్టు జాతీయ అత్యవసర స్థితితో పోల్చిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌, నిత్యావసర మందుల్ని సరైన రీతిలో సరఫరా చేయడానికి, కరోనా రోగులకు చికిత్స అందించడానికి ఒక జాతీయ ప్రణాళిక రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అంతేగాక, లాక్‌డౌన్‌ విధింపుపై హైకోర్టులకున్న న్యాయపరమైన అధికారాలను పరిశీలిస్తామని తెలిపింది. కొవిడ్‌ సంబంధిత అంశాలపై ఆరు హైకోర్టుల్లో విచారణ జరుగుతున్నందున గందరగోళం ఏర్పడే పరిస్థితులున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని