కరోనా పగ పట్టింది.. బడి రూపు మారింది - schools turns open land into farm
close
Updated : 13/12/2020 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పగ పట్టింది.. బడి రూపు మారింది


(నమూనా చిత్రం)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ మహమ్మారి విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. కరోనాకు భయపడి ఇంకా పాఠశాలలు తెరవకపోవడంతో విద్యార్థుల చదువులు ఆన్‌లైన్‌కి పరిమితమయ్యాయి. అదీ పూర్తిగా అమలు అవుతున్నట్లు కనిపించట్లేదు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీవితాలు తలకిందులయ్యాయి. ఎంతో గౌరవప్రదమైన ఉద్యోగం కోల్పోయి చిరువ్యాపారాలు చేసుకుంటూ పొట్టనింపుకొంటున్నారు. విద్యార్థులను.. ఉపాధ్యాయులను ఒక్క చోటుకి చేర్చే పాఠశాలల పరిస్థితి మరింత దారుణం. విద్యార్థులు రాక.. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేక అనేక చిన్న పాఠశాలలు మూతపడ్డాయి. పెద్ద పాఠశాలలను కొనసాగించడం భారమై యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నాయి. అయినా ఫలితం దక్కట్లేదు. ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పాఠశాల ఆవరణను, గదుల్ని ఇతర పనులకు వినియోగించి ఆదాయం పొందుతున్నాయి.

కర్ణాటకలోని కడూర్‌ తాలుకాలో శాంతినికేతన్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఉంది. కరోనా వల్ల అన్ని పాఠశాలలాగే.. సీబీఎస్‌ఈ సిలబస్‌ పాఠాలు చెప్పే ఈ పాఠశాల కూడా మూతపడింది. విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారు. దీంతో ఉపాధ్యాయులకూ పనిలేకుండా పోయింది. ఫలితంగా పాఠశాల తరగతి గదులు మూగబోయాయి. ఆవరణలో నిశ్శబ్దం ఆవరించింది. ఆదాయం లేకపోతే ఖాళీ పాఠశాల నిర్వహణ సైతం కష్టమైపోతుందని యాజమాన్యం భావించింది. దీంతో బడి పరిధిలోని రెండున్నర ఎకరాల ఆవరణను వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. వ్యవసాయానికి సంబంధించిన సామగ్రిని భద్రపర్చుకోవడానికి తరగతి గదులను ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పూలు, బీన్స్‌, వంకాయలు, మిరప వంటి పంటలను పండిస్తున్నారు. ఈ విధంగానైనా కాస్తోకూస్తో ఆదాయం తెచ్చుకునేందుకు పాఠశాల యాజమాన్యం యత్నిస్తోంది.

మరికొన్ని పాఠశాలలది ఇదే దారి

కర్ణాటకలోనే చిత్రదుర్గ జిల్లాలోని  మిషన్‌ స్కూల్‌ యాజమాన్యం సైతం తరగతి గదుల్ని వెల్డింగ్‌ పనులు చేసే వ్యాపారులకు అద్దెకిచ్చింది. అమడల్లి కార్వార్‌ ప్రాంతంలో ఉన్న ఎడ్యూకేర్‌  ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 1.2 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆవరణను మత్స్యకారులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ స్థలంలో చేపలను ఎండబెడుతున్నారు. తమిళనాడులోని పలు పాఠశాలలు సైతం బడి ఆవరణలో ఆర్గానిక్‌ పంటలు పండిస్తున్నాయి. వీటితో వచ్చే ఆదాయాన్ని పాఠశాల నిర్వహణకు వినియోగిస్తున్నాయి. కెన్యా దేశంలో ఓ పాఠశాల యాజమాన్యం తరగతి గదులను ఏకంగా కోళ్లఫారంగా మార్చేసింది. తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు పాఠశాలలు వాటి ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి.

ఇవీ చదవండి..

కరోనా కాలం: చేపల చెరువుగా స్విమ్మింగ్‌పూల్‌!

కరోనా కాలంలోనూ.. కొలువులున్నాయ్‌!  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని