Cricket News: ఒకేసారి 150 బౌన్సర్లతో సాధన - shafali verma facing 150 bouncers at a time
close
Published : 31/05/2021 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: ఒకేసారి 150 బౌన్సర్లతో సాధన

అన్ని విభాగాల్లో మెరుగవుతున్న షెఫాలీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెరుగైన క్రికెట్‌ ఆడేందుకు కఠోరంగా శ్రమిస్తున్నానని టీమ్‌ఇండియా చిచ్చరపిడుగు షెఫాలీ వర్మ అంటోంది. బౌన్సర్లను చితకబాదేందుకు ఒకేసారి 150 బౌన్సర్లు సాధన చేస్తున్నానని తెలిపింది. భారత్‌ తరఫున వన్డే, టెస్టు క్రికెట్‌ ఆడేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌ క్రికెట్‌ ఆడేందుకు ఆత్రుతగా ఉందని వెల్లడించింది. హరియాణా క్రికెటర్లు తనకెన్నో విలువైన సలహాలు ఇస్తున్నారని తెలిపింది.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో షెఫాలీ వర్మ సంచలన బ్యాటింగ్‌ ప్రదర్శనలు అందరికీ తెలిసిందే. 17 ఏళ్ల ఈ క్రికెటర్‌ మరింత పరిణతి సాధించేందుకు కృషి చేస్తోంది. పవర్ హిట్టింగ్‌తో పాటు బ్యాక్‌ ఫుట్‌, ఫ్రంట్‌ ఫుట్‌ బ్యాటింగ్‌ మెరుగుపరుచుకుంటోంది. ఈ మధ్యే బీసీసీఐ ఆమె కాంట్రాక్టును ఉన్నతీకరించింది. అంతేకాకుండా బిగ్‌బాష్‌, ది హండ్రెడ్‌, ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20లు ఆడనుంది.

‘ప్రతి సిరీస్‌ నుంచి పాఠాలు నేర్చుకోవడమే నా లక్ష్యం. టీ20 ప్రపంచకప్‌ తర్వాత నా నైపుణ్యాలు, ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకున్నా. నాణ్యమైన షాట్లను ఎంపిక చేసుకుంటున్నా. దక్షిణాఫ్రికా సిరీసులో మెరుగ్గా ఆడినట్టు అనిపించింది. గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత నా దేహంపై దృష్టి సారించా. బౌన్సర్లు ఆడేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. ఒకేసారి 150 బౌన్సర్లు ఆడుతున్నా. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ సాధన చేస్తున్నా. ఒకేపని మళ్లీ మళ్లీ చేస్తుంటే మెరుగవుతామని నా నమ్మకం’ అని షెఫాలీ తెలిపింది.

సయ్యద్‌ ముస్తాక్ అలీ, రంజీ ట్రోఫీ సందర్భంగా షెఫాలీ పురుషుల జట్టుతో కలిసి సాధన చేసింది. రంజీ క్రికెటర్ల బౌలింగ్‌లో ఆడటం వల్ల బ్యాక్‌ఫుట్‌ ఆట మెరుగైందని తెలిపింది. హర్షల్‌ పటేల్‌, మోహిత్‌ భయ్యా, రాహుల్‌ తెవాతియాతో బౌన్సర్ల గురించి అడిగి తెలుసుకున్నానని వివరించింది. హరియాణా కోచ్‌ సైతం తనకు విలువైన సలహాలు ఇచ్చారని పేర్కొంది. టీమ్‌ఇండియా బ్యాటర్లు, సిబ్బందీ తనకు సలహాలు ఇస్తుంటారని, తన ఓపెనింగ్‌ భాగస్వామి స్మృతి మంధాన ప్రతిదీ వివరిస్తుందని వెల్లడించింది. బిగ్‌బాష్‌లో హేలీతో కలిసి ఆడేందుకు ఎదురు చూస్తున్నానంది. బీసీసీఐ కాంట్రాక్టుతో మరికాస్త ఎక్కువ డబ్బు వస్తోందని, తండ్రికి ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని