షారుక్‌ లైఫ్‌.. ఈ విషయాలు మీకు తెలుసా? - shahrukh khan birthday special story
close
Updated : 02/11/2020 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షారుక్‌ లైఫ్‌.. ఈ విషయాలు మీకు తెలుసా?

ఆయన సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. ఆ స్టార్‌ బయట కనపడితే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడేవారు ఎందరో. నటుడిగా మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ఆయనే బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్‌.. మన షారుక్‌ ఖాన్‌. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా షారుక్‌ జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..

అసలు పేరు అది..

షారుక్‌కు తొలుత అబ్దుల్‌ రెహమాన్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత దాన్ని షారుక్‌గా మార్చారు. షారుక్‌ అంటే రాజులాంటి వాడని అర్థమట.


కెరీర్‌..

1980లలో టెలివిజన్‌ సిరీస్‌తో షారుక్‌ కెరీర్‌ ఆరంభించారు. 1992లో ‘దీవానా’తో తెరంగేట్రం చేశారు. ‘డర్‌’ (1993), ‘బాజీగర్‌’ (1993), ‘అంజామ్‌’ (1994) సినిమాల్లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ (1995), ‘దిల్‌తో పాగల్‌ హై’ (1997), ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ (1998), ‘కభీ ఖుషీ కభీ గమ్‌’ (2001) తదితర ప్రేమకథా చిత్రాలతో స్టార్‌ హీరోగా రాణించారు. 2002లో వచ్చిన ‘దేవదాస్‌’ సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో షారుక్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారాయన.


పద్మశ్రీ షారుక్‌..

నటుడిగానే కాదు నిర్మాతగానూ షారుక్‌ విజయవంతంగా రాణిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థను స్థాపించి అనేక సినిమాల్ని నిర్మించారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ అనేక అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఉత్తమ నటుడిగా షారుక్‌ 14 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. ప్రపంచంలోని ధనిక నటుల్లో షారుక్‌ కూడా ఒకరు. ఆయన దాదాపు 80 సినిమాల్లో నటించారు.


తల్లిదండ్రులు ఉండుంటే..

బాద్‌షా సినీ కెరీర్‌ ఆరంభించడానికి ముందే ఆయన తల్లిదండ్రులు మరణించారు. ఈ విషయంలో ఆయన అనేక సందర్భాల్లో ఆవేదన చెందారు. తన సక్సెస్‌ను తల్లిదండ్రులు చూడలేదని, వారు ప్రాణాలతో ఉండుంటే చాలా సంతోషించే వారని అన్నారు.


మైనపు విగ్రహం..

2007లో లండన్‌లోని మేడమ్‌ టుసాడ్స్‌లో షారుక్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదే మ్యూజియం తర్వాత ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని లాస్‌ ఏంజెల్స్‌, హాంగ్‌కాంగ్‌, న్యూయార్క్‌లోని తమ శాఖల్లో షారుక్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.


ఇస్త్రీ దుస్తుల్లోనే..

షారుక్‌లో క్రేజీ కోణాలు చాలానే ఉన్నాయి. ఆయన రాత్రి సమయాల్లో బాగా ఐరన్‌ చేసిన పైజామాలో మాత్రమే నిద్రపోతారట. దీనికి కారణం ఏంటని ఓసారి మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. ఫన్నీగా జవాబు ఇచ్చారు. ‘మన కలలోకి ఎవరు వస్తోరో మనకు తెలియదు కదా.. అందుకే సరైన దుస్తులు ధరించి నిద్రపోవాలి’ అన్నారు.


ప్రేమ.. పెళ్లి..

షారుక్‌ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్‌ తమ ప్రేమకథను పంచుకున్నారు. దిల్లీకి చెందిన షారుక్‌ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. వీరి తొలి మీటింగ్‌ ఐదు నిమిషాలు కూడా లేదట. ఆపై షారుక్‌ గౌరీ ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. వివాహానికి ముందు షారుక్‌, గౌరీల మధ్య చిన్న గొడవ రావడంతో.. షారుక్‌కు చెప్పకుండా గౌరీ దిల్లీ నుంచి ముంబయి బయలుదేరారు. అప్పుడు షారుక్‌ జేబులో రూ.10వేలు మాత్రమే ఉన్నాయట. ప్రియురాలు కోపంతో వెళ్లిపోవడంతో ఆమె వెంటే షారుక్‌ కూడా బయలుదేరారట. చివరికి ముంబయి బీచ్‌లో ఇద్దరు కలుసుకున్నారు. 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. షారుక్‌ తన పెళ్లి కోసం ‘రాజు బన్‌గయా జెంటిల్‌మెన్‌’ సినిమా కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి సూటు అద్దెకు తీసుకున్నట్లు ఓసారి చెప్పారు.


దిల్లీ టు ముంబయి

పెళ్లికి ముందు షారుక్‌ సీరియల్స్‌లో నటించారు. తన తల్లి మరణం తర్వాత ఆ బాధ నుంచి బయటికి రావడానికి ఆయన దిల్లీ నుంచి ముంబయికి షిప్ట్‌ అయ్యారట. ఆపై హీరోగా అరంగేట్రం చేసి.. స్టార్‌గా ఎదిగారు. ముంబయిలోని అతి సుందరమైన భవనాల్లో ఒక్కటైన మన్నత్‌ను ఆయన కొన్నారు. దీన్ని కొనాలని సల్మాన్‌ ఖన్‌ కూడా అనుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన తండ్రి సలీమ్‌ ఖాన్‌కు చెబితే.. ‘ఇంత పెద్ద ఇల్లు తీసుకుని ఏం చేస్తావ్‌?’ అని అడిగారట. దీంతో సల్మాన్‌ కొనే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆపై షారుక్‌ దీన్ని సొంతం చేసుకున్నారు. మన్నత్‌ నివాసం వద్ద రోజూ వందల మంది వచ్చి సెల్ఫీలు దిగి, పోతూ ఉంటారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని