కరోనా 2.0తో మనకు మళ్లీ భయం తప్పదా? - should india be worried about new corona virus
close
Published : 31/12/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా 2.0తో మనకు మళ్లీ భయం తప్పదా?

కొత్త స్ట్రెయిన్‌ కలవరంతో కొత్త ఏడాదిలోకి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా పేరు వింటేనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ప్రపంచ దేశాలను వణికించిన ఈ మహమ్మారితో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు అన్ని దేశాలనూ ఆర్థిక, ఆరోగ్య విపత్తులకు గురిచేసింది. మానవ జీవన గమనాన్నే ఛిన్నాభిన్నం చేసి 2020ని ‘విలయ నామ’ సంవత్సరంగా మార్చేసింది. చైనా నుంచి పుట్టుకొచ్చిన కొవిడ్‌ 19 భారత్‌లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సిన్ల పంపిణీకి సన్నద్ధమవుతున్న తరుణంలో బ్రిటన్‌లో మొదలైన కొత్త రకం కరోనా కలకలం కలవరపెడుతోంది. మామూలు కరోనా కంటే అధిక వేగంతో వ్యాప్తిచెందే లక్షణం కలిగిన కరోనా 2.0 హడలెత్తిస్తోంది. ఇప్పటికే భారత్‌లో 25 కొత్త స్ట్రెయిన్‌ కేసులు నమోదవ్వడంతో ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ఆనందంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాల్సిన జనం ఎప్పుడూ లేనివిధంగా ఆంక్షల మధ్య భయం భయంతో న్యూ ఇయర్‌కు స్వాగతం పలకాల్సిన పరిస్థితి ఎదురైంది.

చైనాలోని వుహాన్‌లో గతేడాది నవంబర్‌లో పుట్టుకొచ్చిన కరోనాతో పోలిస్తే 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఈ స్ట్రెయిన్‌ యూకేలో సెప్టెంబర్‌లోనే బయటపడింది. అయితే, డిసెంబర్‌ మధ్యలో ఈ వైరస్‌ గురించి తెలియడంతో ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ప్రపంచ దేశాలు మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకున్నాయి. బ్రిటన్‌లో వచ్చిన తర్వాత వారంలోనే ఇతర దేశాల్లోనూ ఈ స్ట్రెయిన్‌ వెలుగుచూడటంతో ‘కొత్త’ గుబులు మొదలైంది. దీంతో భారత్‌ సహా అనేక దేశాలు ఇప్పటికే అప్రమత్తమై బ్రిటన్‌కు రాకపోకలను నిలిపివేశాయి. డిసెంబర్‌ 23 నుంచి యూకేకు విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేసిన భారత్.. ఆ గడువును తాజాగా జనవరి 7వరకు పొడిగించింది. కానీ బ్రిటన్‌లో  కరోనా 2.0 కేసులు కలకలం సృష్టించడానికి నెలరోజుల నుంచి (నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 23 మధ్య కాలంలో) యూకే నుంచి దాదాపు 33వేల మంది ప్రయాణికులు భారత్‌కు రావడం గమనార్హం. అక్కడినుంచి వచ్చిన వారిలో 120మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, బాధితులకు సోకింది కొత్త రకం వైరస్సో, కాదో తేల్చేందుకు వారి జీనోమ్‌ నమూనాలను దేశంలో ఏర్పాటు చేసిన 10 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపగా.. 25 మందిలో కొత్త రకం కరోనా వైరస్‌ జాడలు ఉన్నట్టు తేలింది.

మరోవైపు, ఈ కొత్త రకం  కరోనా వైరస్‌ బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో విజృంభిస్తోంది. అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త స్ట్రెయిన్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో భారత్‌ మరింతగా అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్ని గుర్తించేందుకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. దీంతో యూకే నుంచి వచ్చిన వారెవరు? ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో తెలుసుకొని గుర్తించేందుకు రాష్ట్రాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల ఆచూకీ గల్లంతవ్వడమో, ఆరోగ్యశాఖ అధికారులకు వారు సహకరించకపోవడమో జరుగుతున్నట్టు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగించేవే. తమ రాష్ట్రానికి యూకే నుంచి 2400 మంది రాగా.. వారిలో 570 మంది జాడ ఇంకా తెలియలేదని, వారిని గుర్తించడం కష్టంగా మారిందని కర్ణాటక మంత్రి కె.సుధాకర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.  

ఇక బెంగళూరు విషయానికి వస్తే.. యూకే నుంచి 1614 మంది రాగా.. వారిలో 26మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురిలో కొత్తరకం కరోనా ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. తెలంగాణకు 1100 మంది యూకే నుంచి రాగా.. వారిలో దాదాపు 275మంది ఎక్కడున్నారో ఇంకా గుర్తించాల్సి ఉంది. అలాగే, పంజాబ్‌, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు కూడా యూకే నుంచి వచ్చినవారిని గుర్తించడం కష్టమంటున్నారు. ఏపీకి 1423 మంది రాగా.. వారిలో 1406 మందిని గుర్తించారు. మిగతా వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. 

ఇంకోవైపు, యూకే నుంచి భారత్‌కు వచ్చినవారు కూడా కలవరం చెందుతున్నారు. తాము అనుమానితులుగా కనబడటంతో వేధింపులకు అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి యూకే నుంచి మన దేశానికి వచ్చినవారిలో చాలా మందిలో కరోనా లేదు. 5శాతం మందిలో కూడా కొవిడ్‌-19 నిర్ధారణ కాలేదు. కొద్దిమందిలో మాత్రమే బ్రిటన్‌ స్ట్రెయిన్‌ ఉన్నట్టు తేలింది. యూకే నుంచి భారత్‌కు వచ్చిన సందర్భంలో మామూలుగానే పరీక్షలు నిర్వహించారు. అయితే, తాజాగా ఈ కొత్త స్ట్రెయిన్‌ కలకలం సృష్టించడంతో అక్కడి నుంచి వచ్చిన ప్రతిఒక్కరినీ గుర్తించేందుకు రాష్ట్రాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇంకా అనేకమంది యూకే రిటర్న్స్‌ ఆచూకీ తెలియకపోవడంతో జనంలో ‘కొత్త’ కలవరం మరింతగా పెరుగుతోంది.

ఇవీ చదవండి..

కరోనా మరణాలు: వణికిపోతున్న అగ్రదేశం

భారత ప్రజలకు స్వదేశీ టీకానే: మోదీ


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని