‘నిర్ణయాలు నన్ను తీసుకోనివ్వండి’.. సిద్ధూ కామెంట్స్‌.. హీటెక్కుతున్న పంజాబ్‌ పాలిటిక్స్‌! - sidhu asks congress leadership for freedom to take decisions
close
Published : 28/08/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నిర్ణయాలు నన్ను తీసుకోనివ్వండి’.. సిద్ధూ కామెంట్స్‌.. హీటెక్కుతున్న పంజాబ్‌ పాలిటిక్స్‌!

దిల్లీ: పంజాబ్‌లో రాజకీయ వేడెక్కుతోంది. నిన్నటి వరకూ అమరీందర్‌పై తిరుగుబావుటా ఎపిసోడ్‌ చర్చకు రాగా.. తాజాగా కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ సిద్ధూ కామెంట్స్‌ హాట్‌ టాపిగ్గా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలంటూ పార్టీ హైకమాండ్‌ను సిద్ధూ కోరారు. లేదంటే తగిన రీతిలో బదులు ఇవ్వాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందంటూ దీనిపై ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ బదులిచ్చారు. అదే సమయంలో పంజాబ్‌ బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్ఠానాన్ని కోరడం, సిద్ధూ సలహాదారుల్లో ఒకరు బాధ్యతల నుంచి వైదొలగడం వంటి పరిణామాలతో పంజాబ్‌ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

సిద్ధూ సలహాదారులు ఇద్దరూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అందులో ఒకరైన మల్వీందర్‌సింగ్‌ మాలీ ఇటీవల ఫేస్‌బుక్‌లో కశ్మీర్‌ అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఇటీవల హరీశ్‌ రావత్‌ స్పందిస్తూ సలహాదారులిద్దరినీ తొలగించాలని సిద్ధూకు సూచించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ సిద్ధూ తొలగించకపోతే తానే తొలగిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మల్వీందర్‌ సలహాదారుడిగా వైదొలిగారు.

తాజా పరిణామాలపై సిద్ధూ స్పందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పారు. పార్టీని రెండు దశాబ్దాల పాటు అధికారంలో ఉంచే ప్రణాళిక తన వద్ద ఉందన్నారు. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకుంటే తగిన రీతిలో బదులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సిద్ధూ వ్యాఖ్యలపై రావత్‌ స్పందించారు. సిద్ధూ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలీదని చెప్పారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా చేసుకుని స్పందించబోనని చెప్పారు. పంజాబ్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా పార్టీ నియమాలకు లోబడి నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ సిద్ధూకు ఉందని చెప్పారు. 

అలాగే పార్టీ పంజాబ్‌ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగించాలని అధిష్ఠానాన్ని కోరినట్లు రావత్‌ తెలిపారు. ప్రస్తుతం రావత్‌ ఉత్తరాఖండ్‌ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టేందుకు తన విజ్ఞప్తిని పరిశీలించాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పారు. ఒకవేళ పార్టీ పంజాబ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి బాధ్యతల్లో కొనసాగాలని ఆదేశిస్తే తప్పకుండా పాటిస్తానని చెప్పుకొచ్చారు. సిద్ధూ ఎపిసోడ్‌ నేపథ్యంలో రావత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తానికి వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్న వేళ పంజాబ్‌లోని తాజా పరిణామాలు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఇరకాటంలో పెట్టాయనే చెప్పాలి!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని