బంగాళాదుంపలు ఎలా నిల్వ చేయాలో తెలుసా? - simple tips and tricks to make potatoes last longer
close
Published : 21/07/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగాళాదుంపలు ఎలా నిల్వ చేయాలో తెలుసా?

మనం ఎక్కువగా వండుకునే కూరగాయల్లో బంగాళాదుంపలు కూడా ఒకటి. రుచికరమైన కర్రీలు, ఫ్రైలు, చిప్స్‌... ఇంకా రకరకాల వంటకాలను వీటితో తయారు చేసుకుంటాం. పిల్లలు కూడా వీటిని ఇష్టపడి తింటుంటారు. అయితే బంగాళాదుంపల నిల్వకు సంబంధించి తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు కొంతమంది. వీటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేయడమో లేదా ప్లాస్టిక్‌ సంచుల్లో ఉంచడమో చేస్తుంటారు. ఫలితంగా ఇవి త్వరగా కుళ్లిపోయే అవకాశముంది.

ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే..

ఇతర పండ్లు, కూరగాయలతో పోల్చితే బంగాళాదుంపలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. అయితే అది సరైన పద్ధతులు పాటించినప్పుడే. లేకపోతే బంగాళాదుంపలపై మొలకలు వస్తాయి. రంగు మారిపోయి తాజాదనం, రుచిని కూడా కోల్పోతాయి. ఇవి వండుకోవడానికి ఏ మాత్రం పనికిరావు. ఈ క్రమంలో కొన్ని చిట్కాలు పాటిస్తే బంగాళాదుంపలను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

ఈ జాగ్రత్తలతో..

* బాగా గాలి తగిలే ప్రదేశాలు, చల్లని ప్రదేశాల్లో బంగాళాదుంపలను నిల్వ చేయాలి.

* చల్లటి టెంపరేచర్ ఉండే ఫ్రిజ్‌లో వీటిని స్టోర్‌ చేస్తే... దుంపల్లోని స్టార్చ్‌ షుగర్‌గా రూపాంతరం చెందుతుంది. ఫలితంగా ఉడికించినప్పుడు ఇవి తియ్యగా మారిపోతాయి.

* సూర్యరశ్మి ఎక్కువగా తగిలే ప్రాంతాలు, ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లోనూ వీటిని నిల్వ చేయకూడదు. వీలైనంతవరకు చల్లని చీకటి ప్రదేశాల్లోనే స్టోర్‌ చేయాలి.

* రంధ్రాలున్న ప్లాస్టిక్‌ బ్యాగులు, పేపర్‌ సంచుల్లో వీటిని నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి.

* నిల్వ చేసేముందు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగాళాదుంపలను నీటితో కడగద్దు. దీనివల్ల త్వరగా పాడైపోయే అవకాశముంది.

* బంగాళాదుంపలను సరిగా స్టోర్‌ చేయకపోతే వాటి ఉపరితలం ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఫలితంగా సొలనిన్‌ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది.

* సొలనిన్‌ వల్ల ఇవి తాజాదనం, రుచిని కోల్పోయి చేదుగా మారిపోతాయి. వీటిని తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు వీటిని అసలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

* అప్పుడప్పుడు బంగాళాదుంపల మీద మొలకలు వస్తుంటాయి. తినేటప్పుడు లేదా వండేటప్పుడు వీటిని తొలగించుకోవాలి. చల్లగా ఉండే చీకటి ప్రదేశాల్లో నిల్వ చేయడం ద్వారా మొలకలు రాకుండా నిరోధించవచ్చు.

* మార్కెట్ నుంచి కొత్తగా తెచ్చిన దుంపలను పాత వాటితో కలపద్దు. అలాగే పాడైన దుంపలను ఎప్పటికప్పుడు వేరు చేయాలి. లేకపోతే మిగతావి కూడా కుళ్లిపోతాయి.

* ఇతర కూరగాయలతో కలిపి వీటిని నిల్వ చేయకూడదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని