భారత్‌లోనూ దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకం వైరస్‌లు! - south african brazilian variants of covid 19 have entered india
close
Published : 16/02/2021 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లోనూ దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకం వైరస్‌లు!

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

దిల్లీ: వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉందని భావిస్తోన్న బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా కొత్తరకం కరోనా కేసులు భారత్‌లోనూ వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బ్రెజిల్‌ రకానికి చెందిన కొత్తరకం ఒక కేసు నమోదు కాగా, దక్షిణాఫ్రికా రకం కేసులు నాలుగు నిర్ధారణ అయినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. వైరస్‌ నిర్ధారణ అయిన వారితోపాటు వారికి సన్నిహితంగా మెలిగిన వారిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు.

ఇక అత్యధిక తీవ్రత కలిగిన బ్రిటన్‌ రకం వైరస్‌ కేసులు భారత్‌లో భారీగానే నమోదయ్యాయి. ఇప్పటివరకు 187మంది రోగుల్లో బ్రిటన్‌ రకం కరోనా నిర్ధారణ అయినట్లు ఐసీఎంఆర్‌ డీజీ వెల్లడించారు. అయితే, వీరిలో ఇప్పటివరకు ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తాజాగా భారత్‌లో వెలుగుచూసిన దక్షిణాఫ్రికా రకం వైరస్‌ ఇప్పటికే 44దేశాల్లో విస్తరించగా, బ్రెజిల్‌ రకం మాత్రం ఇప్పటివరకు 15దేశాల్లో గుర్తించినట్లు వివరించారు. 

ప్రస్తుతం మనదగ్గర ఉన్న వ్యాక్సిన్‌లకు బ్రిటన్‌ రకాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లు భావిస్తున్నామని బలరాం భార్గవ పేర్కొన్నారు. బ్రిటన్‌ కొత్తరకం వైరస్‌తో పోలిస్తే దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకం వైరస్‌లు భిన్నంగా ఉన్నందున వీటిపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు పనిచేస్తాయా? లేదా? అనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు.

ఇదిలా ఉంటే, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాల్లో వెలుగుచూసిన మ్యుటేషన్‌ చెందిన కరోనా కొత్తరకాలు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయన్న విషయం తెలిసిందే. బ్రిటన్‌లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్‌ ఇప్పటికే 80 దేశాలకు పైగా పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే వెల్లడించింది. సాధారణ రకం కంటే దాదాపు 30 నుంచి 70శాతం వేగంతో వ్యాప్తిచెందడమే కాకుండా బ్రిటన్‌లో కొవిడ్‌ మరణాలు పెరగడానికి ఈ రకం కారణమని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే, భారత్‌లో మాత్రం వీటి ప్రభావం తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

87లక్షల మందికి పైగా టీకాలు

ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87,40,595 మంది కొవిడ్ టీకా తీసుకున్నారని తెలిపారు. వారిలో 85,69,917 మంది మొదటి డోసు,  1,70,678 మంది రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. అలాగే 14 రాష్ట్రాలు 70 శాతం మందికి పైగా ఆరోగ్య సిబ్బందికి టీకాలు అందించే ప్రక్రియను పూర్తిచేశాయన్నారు. అయితే దిల్లీ 42 శాతం మంది వైద్య సిబ్బందికి మాత్రమే టీకాలు వేసిందని తెలిపారు. పది రాష్ట్రాలు కేవలం పది శాతం మంది సిబ్బందికే టీకాలు పంపిణీ చేశాయని పేర్కొన్నారు.  

యాక్టివ్‌ కేసులు ఆ రెండు రాష్ట్రాల్లోనే..
కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత ఆందోళనకరంగా ఉంది. క్రియాశీల కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో 61,550, మహారాష్ట్రలో 37,383 క్రియాశీల కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 72 శాతమని రాజేశ్ వెల్లడించారు. కొత్త రకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. 

ప్రతి పదిలక్షల మందికి 56 కేసులు ..
గత ఏడు రోజులుగా ప్రతి పదిలక్షల మందిలో 56 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. నిన్న 9,121 మంది కరోనా బారిన పడగా..81 మంది ప్రాణాలు కోల్పోయారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని