సడలని సంకల్పం - special story on hyderabad women who was doing multiple works by overcomimg disability
close
Published : 27/03/2021 21:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సడలని సంకల్పం

స్ఫూర్తిగా నిలుస్తున్న హైదరాబాద్‌ మహిళ

బోరబండ: వెన్నుముక విరిగినా ఆమెలోని ఆత్మవిశ్వాసం తగ్గలేదు. వైకల్యం వెంటాడుతున్నా వెనుకడుగు వేయలేదు. పట్టువిడవని సంకల్పం ముందు విధి సైతం చిన్నబోయింది. కష్టాల కడలికి ఎదురీదుతూ, ఒక్కో మెట్టు పైకెక్కుతూ తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు హైదరాబాద్‌కు చెందిన మహిళ. వెక్కిరించిన విధికే సవాలు విసిరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు బోరబండలోని కబీర్‌నగర్‌కు చెందిన ఛాయాదేవి.  20 ఏళ్ల క్రితం ఓ లారీ ఇంటిపైకి దూసుకొచ్చిన ప్రమాదంలో ఆమె వెన్నుముక విరిగిపోయింది. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. గర్భవతిగా ఉన్నప్పుడే ప్రమాదం జరగడంతో నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చారు.

అందంగా ఊహించుకున్న జీవితం అర్ధాంతరంగా మంచానికే పరిమితమవడంతో కుమిలిపోయారు. తిరిగి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని ధైర్యంగా ముందడుగు వేశారు. రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో ఇంట్లో తనకెంతో ఇష్టమైన కుట్టుపని, మొక్కల పెంపకాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో కుట్టుపనిని చుట్టుపక్కల వారికి శిక్షణ ఇచ్చిన ఛాయాదేవి చేతితో నడిచే కుట్టుమిషన్‌పై పనిచేయడం ప్రారంభించారు. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబానికి ఆసరాగా నిలిచారు.

చిన్నతనం నుంచే మొక్కల పెంపకం వ్యాపకంగా ఉండటంతో ఈ పరిస్థితుల్లోనూ తన వ్యాపకాన్ని వదులుకోలేదు. మంచానికే పరిమితమైనా మొక్కల పెంపకాన్ని కొనసాగించారు. కుండీల్లో మొక్కలను పెంచడం, మట్టి, ఎరువు వేయడం, అంట్లు కట్టడం, కత్తిరించడంతోపాటు కుండీలకు అందంగా రంగులు వేయడం వంటి పనులను ఇష్టంగా చేస్తున్నారు. ఇలా తన ఇంటి బాల్కనీ, మెట్లు, డాబాపై 300లకు పైగా మొక్కలను పెంచుతున్నారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పిల్లలకు పాఠాలు  చెబుతున్నారు. ఆసక్తి ఉన్నవారికి కుట్టు, అల్లికలపై శిక్షణ కూడా ఇస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని