Squid Game: స్క్విడ్‌గేమ్‌కి ఎందుకింత క్రేజ్‌? - special story on netflix web series squid game
close
Updated : 14/10/2021 07:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Squid Game: స్క్విడ్‌గేమ్‌కి ఎందుకింత క్రేజ్‌?

‘స్క్విడ్‌ గేమ్‌’..ఇప్పుడు ఏ దేశంలో చూసిన ఈ వెబ్‌ సిరీస్‌ గురించే చర్చ. సెప్టెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్‌సిరీస్‌ విడుదలైన 90 దేశాల్లో నెం.1గా కొనసాగుతుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. కేవలం 27 రోజుల్లో 111మిలియన్‌ వీక్షకులకు చేరువైందని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. అంటే ఏస్థాయిలో ఈ వెబ్‌సిరీస్‌ విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అక్టోబరు 17 నాటికి స్క్విడ్‌గేమ్‌ విడుదలై సరిగ్గా నెల రోజులు. ఈ కొరియన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ జనాలకు అంతగా నచ్చడానికి కారణమేంటి? దీన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు పడిన కష్టాలేంటో ఓసారి తెలుసుకుందాం.

పదేళ్ల నిరీక్షణ

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దగ్గర నుంచి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వెబ్‌సిరీస్‌.. దృశ్యరూపం దాల్చడానికి మాత్రం అనేక కష్టాలు ఎదుర్కొంది. దీన్ని దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్ తెరకెక్కించాడు‌. ‘స్క్విడ్‌గేమ్‌’ కథను 2009లోనే రాసుకున్నాడు. వెబ్‌ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మాత్రం పదేళ్లపాటు ప్రసవవేదన పడిందీ కథ. ఇంత కాలం పట్టడానికి ఆర్థికంగా ఆయనను వెంటాడిన కష్టాలు కూడా కారణమే. డబ్బుల్లేక ల్యాప్‌టాప్‌ అమ్మేసి జీవితాన్ని నెట్టికొచ్చిన సందర్భాలున్నాయి. స్క్రిప్ట్‌తో ఏ స్టూడియోకి వెళ్లినా తిరస్కరణే ఎదురయ్యేది. ‘చిన్నపిల్లల ఆటను ఎవరు చూస్తారు’ అని మొహం మీదే తలుపులేసిన వారున్నారు. ప్రపంచాన్ని కొవిడ్‌ కుదిపేశాక ‘స్క్విడ్‌గేమ్‌’ కథపై అందరి దృష్టి పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ హక్కులు తీసుకొని నిర్మించింది. ఇందులోని మొత్తం తొమ్మిది ఎపిసోడ్లని దర్శకుడే తెరకెక్కించాడు. ఆయన నిజజీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు దీన్ని మరింత బలంగా రాయడానికి తోడ్పడ్డాయి. అమెరికాతో పాటు మిగతా అన్నిదేశాల్లో ట్రెండింగ్‌లో ఉందీ సిరీస్‌. ఇండియా ఓటీటీ వీక్షకులను కూడా అమితంగా ఆకట్టుకోవడమే కాదు, కొద్ది రోజులుగా నెం.1 స్థానంలో కొనసాగుతుంది. 

అప్పుల్లో కూరుకున్న వారితో నెత్తుటి ఆట

 జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పుల పాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్‌ గ్రీన్‌లైట్‌, టగ్ ఆఫ్‌ వార్‌ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. చివరగా వచ్చే ఆట పేరే ‘స్క్విడ్‌ గేమ్’‌. దక్షిణ కొరియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న చిన్నపిల్లల ఆట ఇది. ఈ ఆరు ఆటల్లో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోవచ్చు. అన్ని సులభమైనవి, సరళమైన ఆటలే. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఈ ఆటలో ఓడిపోయినవారు పోటీ నుంచి శాశ్వతంగా ఎలిమినేట్‌ అవుతారు. ఆటలోంచే కాదు, జీవితం నుంచే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఓడిపోతే చంపేస్తారని అర్థం. మొదటి ఆట ఆడితే కానీ ఈ విషయం వారికి తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆరు ఆటలను దిగ్విజయంగా పూర్తిచేసుకొని చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేది చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. కథనం వీక్షకుడికి ఊపిరాడనివ్వదు.  చివరి దాకా ఉత్కంఠ రేపే కథనంతో థ్రిల్‌ గురిచేస్తుంది. 

మోసం, త్యాగం....భావోద్వేగం

పోటీలో పాల్గొనే పోటీదారులకు వాస్తవ జీవితంలో గడ్డు పరిస్థితులుంటాయి. ప్రధాన పాత్రైన సియాంగ్‌ జీ హున్‌కి భార్యతో విడాకులు అవుతాయి. ఉద్యోగం పోతుంది. లెక్కలేనంత అప్పులు చేస్తాడు. దీనికి తోడు జూదం అతడికి వ్యసనం. అందులోనూ డబ్బులు పోగొట్టుకుంటాడు. రెండో వివాహం చేసుకున్న అతడి భార్య.. కూతురిని కూడా తనతో పాటే అమెరికా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంటుంది.  కూతురిని తన సంరక్షణలోకి తెచ్చుకోడానికి డబ్బు కావాలి. అప్పు ఇచ్చినవాళ్ల నుంచి బెదిరింపులు, కూతురు తనకు దక్కదేమోనన్న భయం.. ఈ రెండు కారణాలతో  ప్రమాదకరమైన ‘స్క్విడ్‌గేమ్’ ఆటలోకి అడుగుపెడతాడు. అక్కడ తన క్లాస్‌మేట్‌ సాంగ్‌ వూ కలుస్తాడు. ఒంటరిగా పోరాటం చేయడం కన్నా..కలిసి కట్టుగా ఆడితే విజయం సాధించొచ్చని అలీ, ఇల్‌ నామ్ ఇలా ఐదుగురు జట్టుగా ఏర్పడతారు. ఈ పోరాటంలో ఒకరికొకరు అండగా నిలబడతారు. కొన్నిసార్లు సొంతవాళ్లనే మోసం చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా స్నేహం, సహకారం, మోసం, త్యాగాలతో వెబ్ సిరీస్‌ ఆద్యాంతం భావోద్వేగాల ప్రయాణంలా సాగి చూసే ప్రేక్షకుడికి కళ్లని తడిపేస్తుంది. ఈ పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉండడం కూడా ఈ వెబ్‌ సిరీస్‌ విజయానికి మరో కారణం.

 నిజజీవితంలోనూ ఉందా?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన బిలియనీర్లు ఈ ఆటను వినోదం కోసం సృష్టించుకుంటారు. ఇందులో అప్పులపాలైన సామాన్యులే వారికి పావులు. డబ్బుల కోసం వాళ్లు కొట్టుకు చస్తుంటే.. అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు. కావాల్సినంత డబ్బు సంపాదించిన తర్వాత  బోర్‌ కొట్టి ఇలాంటి హింసాత్మక పోటీని  ఏర్పాటు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక రహస్య దీవిని ఎంచుకుంటారు. పోటీల కోసం విశాలమైన మైదానాలను అన్ని హంగులతో భారీగా నిర్మిస్తారు. తొలత ఎంతో అందంగా, స్వర్గంలో ఉన్నట్లు కనిపించే ఆ ప్రదేశం... ఆ తర్వాత పోటీదారుల నెత్తుటితో తడిసి నరకం కన్నా భయంకరమైన ప్రదేశంగా మారుతుంది. నిజం జీవితంలోనూ ఇలాంటి పోటీలు జరిగే అవకాశం లేకపోలేదని కొందరు భావిస్తున్నారు. దుబాయి లాంటి సంపన్న దేశాల్లో సామాన్యులను పావులుగా చేసి ఇదే తరహా ఆటలు ఆడిస్తారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు జరిగిన దాఖలాలైతే ఏమీ లేవు.

సమాజంలోని అంతరాలకి దృశ్య రూపం

పెట్టుబడిదారీ విధానంలోని వాస్తవ రూపాన్ని, దాని పర్యావసనాలను ఈ వెబ్‌సిరీస్‌ కళ్లకు కట్టినట్లు చూపిందనడంలో సందేహం అక్కర్లేదు. సమాజంలోని అంతరాలను స్పష్టంగా చూపించడంలో నూటికి నూరు పాళ్లు విజయం సాధించింది. డబ్బుల కోసం సామాన్యులు కొట్టుకుచావడంలో.. ధనవంతులకు ఆనందం దొరుకుతుంది. ఈ కాన్సెప్ట్‌తోనే సమాజంలో వ్యత్యాసాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది బహిర్గతమవుతుంది. ఈ పోటీ ప్రపంచంలో పడి మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోతున్న మనుషుల నిజస్వరూపాన్ని కూడా  తెరపై చూపించింది. అందుకే జనాలను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. దక్షిణ కొరియా సమాజంలోని నిజమైన అంతరాలను చూపించిందని పలు వెబ్‌సైట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.  దక్షిణ కొరియా సమాజంపైనే తీసిన ‘పారసైట్‌’కి గతేడాది ఆస్కార్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో ముందే?

‘స్క్విడ్‌గేమ్‌’ విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు దీన్ని ఆస్కార్‌ చిత్రం ‘పారాసైట్‌’తో పోల్చుతున్నారు. ఈ సినిమాలాగే ‘స్క్విడ్‌గేమ్‌’ వెబ్‌సిరీస్‌ కూడా ఆర్థిక అసమానతల చుట్టూ అల్లుకున్న కథే.  ఈ స్థాయి హింసాత్మక ఘటనలు పారసైట్‌లో ఉండవు.  ‘ది గాడ్స్ విల్‌’ అనే జపాన్‌ సినిమాను కాపీ కొట్టారని ఆరోపణలు వచ్చాయి. వీటిని దర్శకుడు కొట్టిపారేశాడు. 2009 లోనే ఈ కథను రాసుకున్నట్లు స్పష్టం చేశాడు. బాలీవుడ్‌లో అదే ఏడాది(2009) ఇమ్రాన్‌ ఖాన్‌, శ్రుతిహాసన్‌, సంజయ్‌దత్‌ ప్రధానపాత్రల్లో ‘లక్‌’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం కూడా అచ్చంగా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కడం విశేషం. ‘లక్‌’లోనూ జీవితం బోర్‌ అనిపించి కొందరు బిలియనీర్లు ఇలాంటి ప్రాణాంతక పోటీలనే నిర్వహిస్తారు. అప్పులపాలైన కొందరు ఈ నెత్తుటి పోటీల్లో పాల్గొంటారు. ఇది బాక్సాఫీసు వద్ద విఫలమైంది. బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆ సమయానికి ఇలాంటి కథలను అంగీకరించే పరిస్థితిలో లేరు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీల కాలమది. అందుకే  ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. కరోనా తర్వాత ఆర్థిక, మానసిక స్థితిగతుల్లో వచ్చిన మార్పుల కారణంగానే వీక్షకులను ‘స్క్విడ్‌గేమ్‌’ అమితంగా ఆకట్టుకుంటుందని కొందరి అభిప్రాయం. ఏది ఏమైన  సరైన సమయంలో విడుదలైంది గనుకే ఈ స్థాయి విజయాన్ని అందుకుంది.  ఈ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలను బట్టి దీనికి సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శకుడు క్లూ ఇచ్చాడు. ఒకవేళ సెకండ్‌ సీజన్‌ కూడా వస్తే మరింత సంచలనాలు సృష్టిస్తుందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని