నేను రైతుని అవుతానంటే కొట్టారు! - sreekaram director kishore interview
close
Published : 14/03/2021 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను రైతుని అవుతానంటే కొట్టారు!

‘శ్రీకారం’ చిత్ర దర్శకుడు బి.కిశోర్‌

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో పాల్గొని సినిమా గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు దర్శకుడు బి.కిశోర్‌. 

లఘు చిత్రం చూసి..

మాది చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లి గ్రామం. నాన్న రైతు. నేను డిగ్రీ చదివే సమయంలోనే సినిమా ప్యాషన్‌గా మారింది. ఆ ఇష్టాన్ని ఇంట్లో చెప్పి హైదరాబాద్‌ చేరుకున్నా. కొన్నాళ్లు అసిస్టెంట్‌ డైరెక్ట్రర్‌గా పనిచేసి, నాకు ఎంత అనుభవం వచ్చిందో తెలుసుకునేందుకు లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాను. వాటిల్లో ‘శతమానం భవతి’, ‘శ్రీకారం’ లఘుచిత్రాలకు మంచి పేరొచ్చింది. ‘శతమానం’ నా రెండో షార్ట్‌ఫిల్మ్‌. దాని తర్వాతే సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉందనుకుని కొన్నాళ్లు ఆగా. ‘శ్రీకారం’(షార్ట్‌ ఫిల్మ్‌) చూసిన తర్వాత 14రీల్స్‌ ప్లస్‌ సంస్థ నాకు సినిమా అవకాశం ఇచ్చింది. 

క్రెడిట్‌ వాళ్లదే..

చిత్ర విజయంతోపాటు  గౌరవం దక్కుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రచయితగా, కో డైరెక్టర్‌గా అంతగా అనుభవం లేకపోయినా  షార్ట్‌ఫిల్మ్‌ చూసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన మా నిర్మాతలు రామ్ ఆచంట‌, గోపీ ఆచంటకే ఈ క్రెడిటంతా దక్కుతుంది. అయితే సినిమా ప్రారంభించే మొదట్లో కొంచెం భయంగా ఉండేది. ‘చాలా పెద్ద బ్యానర్‌.. ముందు చేద్దాం అంటారు తర్వాత ఏదేదో చెప్తారు’ అంటూ కొందరు నిరుత్సాహపరిచారు. దాంతో నిర్మాతలతో మాట్లాడేటపుడు చేసేద్దాం అనిపించినా లోపల మాత్రం చేయకూడదు అనిపించేది. అంత పెద్ద వాళ్లతో ఈ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పలేం. అందుకే స్నేహితులతో ఈ విషయం గురించి మాట్లాడేవాణ్ని.

సూటిగా చెప్తే చాలు..

అప్పటి పరిస్థితుల దృష్ట్యా సినిమా కోసం రాసుకున్న కథనే లఘుచిత్రంగా తెరకెక్కించాను. ఇది ఓకే అయితే సినిమా తర్వాత చేయొచ్చు, కొంత అనుభవం వస్తుంది అనుకుని మొదలుపెట్టాను. దాన్ని చాలామంది ఆదరించారు. షార్ట్‌ఫిల్మ్‌ని సినిమాగా తీసుకొచ్చే ప్రయాణంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అలాంటి సమయంలో కమర్షియల్‌ హంగుల విషయం పక్కన పెట్టి మనం చెప్పాలనుకున్న అంశం సూటిగా చెప్తే చాలు అనిపించింది. ‘ఇదొక్కటే కాదు అప్పటికే ఇలాంటి కథతో కొన్ని సినిమాలు వచ్చాయి’ అనే చర్చలు సాగినా నాపై నమ్మకంతో వాటిని పట్టించుకోలేదు నిర్మాతలు. మరోవైపు నాకూ సమయం లేదు అప్పటికే నాలుగేళ్లు అవుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు. ఎప్పుడు సెటిల్ అవుతాననే ఆందోళన ఉండేది.  ఇప్పుడు నా కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 

ఆ భయం ఉండదు..

ఏ విషయాన్ని అయినా చెప్పడం కంటే చూపిస్తేనే బాగుంటుంది. ఈ ఆలోచనాధోరణి షార్ట్‌ఫిల్మ్స్‌ ద్వారా అలవడింది. నేను చెప్పదలచుకుంది ప్రేక్షకులకు 100 శాతం చేరువైందని భావిస్తున్నాను. వ్యవసాయం చేసే నాన్నలకు కొడుకు రైతు అవుతాడేమోననే భయం ఇకపై ఉండకపోవచ్చని అనుకుంటున్నా. సినిమా చూసిన యువ దర్శకులంతా నాకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

తండ్రీకొడుకుల లవ్‌ఫెయిల్యూర్‌..

నేను పెరిగిన వాతావరణం నుంచే ఎక్కువగా స్ఫూర్తి పొందాను. అలా రాసుకున్నదే ఈ కథ. అక్కడితోనే ఆగకుండా  వ్యవసాయ కుటుంబం నుంచి  వేరే రంగాల్లో స్థిరపడి తిరిగి ఫామింగ్‌ చేస్తున్న చాలామందిని కలిసి తమ అభిప్రాయాలు సేకరించాను.  వ్యవసాయం కుటుంబంలోని తండ్రీకొడుకుల లవ్‌.. ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటుందనే పాయింట్‌ తీసుకుని కథగా మలిచాను. వ్యవసాయం కుటుంబానికి దగ్గరగా ఉండే ముఖం అయితే బాగుంటుందనుకున్నపుడు శర్వానందే కరెక్ట్‌ అని ఫిక్స్‌ అయ్యా. తదుపరి సినిమా సినిమా యాక్షన్‌ నేపథ్యంలో ఇదే బ్యానర్లో ఉంటుంది‌.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..

నేను రైతునవుతానంటే కుటుంబ సభ్యులు కొట్టారు(నవ్వుతూ..). కుకింగ్‌పై అమితమైన ఇష్టం ఉండటంతో ఇంటర్‌ తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేద్దామనుకున్నా. ఈ విషయం తెలిశాక ఇంట్లో పెద్ద గోల చేశారు. దాంతో డిగ్రీలో ఉన్నప్పుడు వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నా. అదీ అవలేదు ఎందుకంటే తెలిసిన వాళ్లు, బంధువులు  బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలానే నేనూ ఉండాలని నా తల్లిదండ్రులు అనుకున్నారు. నాకేమో అది నచ్చదు. అందుకే నాకేం వచ్చు, ఏం రాదు బేరీజు వేసుకుని, నాకు సినిమా అంటే ఇష్టమని తెలుసుకుని వాళ్లే నన్ను ఇక్కడికి పంపించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని