రివ్యూ:  తెల్ల‌వారితే గురువారం - sri simha thellavarithe guruvaram telugu movie review
close
Published : 27/03/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ:  తెల్ల‌వారితే గురువారం

చిత్రం: తెల్లవారితే గురువారం;  న‌టీన‌టులు: శ్రీ‌సింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా, రాజీవ్ క‌న‌కాల‌, స‌త్యా, అజ‌య్‌, వైవా హ‌ర్ష‌, శ‌ర‌ణ్యా ప్ర‌దీప్‌, గిరిధ‌ర్‌, ప్రియ‌, ర‌వివ‌ర్మ‌, పార్వ‌తి, సిరి హ‌నుమంత్‌, మౌర్య‌, ప‌ద్మావ‌తి త‌దిత‌రులు; సంగీతం: కాల‌భైర‌వ‌; ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ ర‌గుతు; ర‌చ‌న‌: నాగేంద్ర పిళ్లా; కూర్పు‌: స‌త్య గిడుతూరి; పాట‌లు: కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, ర‌ఘురామ్‌, కృష్ణ వ‌ల్లెపు; నిర్మాత‌లు: ర‌జని కొర్ర‌పాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని; ద‌ర్శ‌కత్వం: మ‌ణికాంత్ గెల్లి; సంస్థ‌‌: వారాహి చ‌ల‌న‌చిత్రం, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌; విడుద‌ల‌: 27-03-2021

‘మ‌త్తు వ‌ద‌ల‌రా`’తో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా.  తొలి చిత్రంతోనే  విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రేక్ష‌కుల దృష్టిని, ప‌రిశ్ర‌మ‌ల దృష్టినీ ఆక‌ర్షించాడు.  ఆ చిత్రం త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మ‌రో చిత్రం `తెల్ల‌వారితే గురువారం`. కొత్త ర‌క‌మైన క‌థ‌ల్ని ప్రోత్స‌హించే సంస్థగా పేరున్న వారాహి చ‌ల‌న చిత్రంలో ఈ  సినిమాని నిర్మించ‌డం...  అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్, ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం...  ప్ర‌చార చిత్రాలు కూడా ఆక‌ర్షించ‌డంతో సినిమాపై  ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? ఆకట్టుకుందా?

క‌థేంటంటే?: వీరేంద్ర అలియాస్ వీరు (శ్రీసింహా)కి మ‌ధు (మిషా నారంగ్‌)తో పెళ్లి కుదురుతుంది. ఇక తెల్లారితే పెళ్లి ముహూర్తం.  ఇంత‌లో వీరుకి త‌ను ప్రేమించిన అమ్మాయి కృష్ణ‌వేణి (చిత్ర‌శుక్లా) నుంచి ఫోన్ వ‌స్తుంది‌. అంతే... రాత్రికి రాత్రే పెళ్లి మంట‌పం నుంచి పారిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. పెళ్లి కూతురు మ‌ధు కూడా అదే ప్ర‌య‌త్నం చేస్తుంది. వీరు అయితే ప్రేమించిన అమ్మాయికోసం వెళ్లిపోవాల‌నుకుంటాడు. మ‌రి మ‌ధు స‌మ‌స్యేమిటి?  ఎవ‌రికివాళ్లు విడిగా పెళ్లి మంట‌పం నుంచి  పారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది? ఆ త‌ర్వాత వారి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి?  త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: కొత్త ర‌క‌మైన క‌థ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయ‌డంలో ఎలాంటి సందేహం లేదు. జీవితాల నుంచి... చిన్న చిన్న అంశాల ఆధారంగానే ఆస‌క్తిర‌క‌మైన క‌థ‌ల్ని అల్లి తెర‌పైకి తీసుకొస్తోంది యువ‌త‌రం. ఆ క‌థ‌ల్లో నిజాయ‌తీ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంటుంది. ఇది మంచి ప‌రిణామ‌మే. అయితే ఆ క‌థ‌ల్ని ఎక్కువ‌మందికి న‌చ్చేలా... మ‌రింత ప‌క‌డ్బందీగా  చెప్ప‌డంలోనే త‌డ‌బాటు క‌నిపిస్తుంటుంది. ఈ క‌థలోనూ కొత్త‌ద‌నం ఉంది.  సున్నిత‌మైన అంశాల‌తో నిజాయ‌తీగా క‌థ చెప్పారు.  ఇలాంటి అంశాలు కూడా క‌థావ‌స్తువులుగా ఉప‌యోడ‌ప‌గతాయా? అని ఆశ్చ‌ర్య‌పోయేలా ర‌చ‌న చేశారు. పెళ్లన‌గానే భ‌య‌ప‌డే ఓ అమ్మాయి... ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డే ఓ అబ్బాయి... అస‌లు  త‌న‌కేం కావాలో స్ప‌ష్ట‌త లేని మ‌రో అమ్మాయి.. ఈ మూడు పాత్ర‌ల చుట్టూ ఒక రాత్రి జ‌రిగే క‌థ ఇది.  పెళ్లి ముహూర్తానికి ముందు ఇంటి నుంచి పారిపోయిన‌వాళ్ల గురించి మ‌నం వింటూనే ఉంటాం.  ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ని మ‌లిచిన తీరు మెప్పిస్తుంది. కాబోయే వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ పెళ్లి మంట‌పం నుంచి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించే ఆరంభ స‌న్నివేశాలతోనే ప్రేక్ష‌కుల్ని క‌థ‌లో లీనం చేశాడు ద‌ర్శ‌కుడు.  అక్క‌డ్నుంచి ఆ ఇద్ద‌రి ఫ్లాష్ బ్యాక్‌లతో క‌థ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. క‌థ‌లో నుంచే హాస్యం పండేలా ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది.

క‌థానాయ‌కుడు, అత‌ని స్నేహ‌బృందం, పెళ్లి కొడుకు మేన‌మామ‌గా స‌త్య చేసే హ‌డావుడి క‌డుపుబ్బా న‌వ్విస్తుంది.  క‌థ ఎత్తుగ‌డ‌, ఆ త‌ర్వాత స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తించినా... ద్వితీయార్థం మొద‌ల‌య్యాక క‌థ  ప్రేక్ష‌కుడి ఊహకు త‌గ్గ‌ట్టుగా మారిపోవ‌డమే ఇబ్బందిగా మారింది.  ప‌తాక స‌న్నివేశాల్లో మ‌లుపు కోస‌మా అన్న‌ట్టుగా అజ‌య్ ఎపిసోడ్ వ‌చ్చినా అది సాగ‌దీత‌గా మారిందే త‌ప్ప ఆ స‌న్నివేశాల‌తో పెద్ద‌గా ఒరిగిందేమీ లేదు.  పైగా అప్ప‌టిదాకా ఫీల్‌గుడ్ అనుభూతినిచ్చిన సినిమా కాస్త మ‌రో దారిలోకి వెళ్లిన‌ట్టు అనిపిస్తుంది. ఇందులోని పాత్ర‌ల్లో బ‌లం ఉంది. ప్ర‌తి పాత్ర‌కీ ఓ ప్ర‌త్యేక ల‌క్ష‌ణం ఉంటుంది. దాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంతం అయ్యాడు. అక్క‌డ‌క్క‌డా కాస్త  సాగ‌దీత‌గా అనిపించినా ఇంటిల్లిపాదీ క‌లిసి చూసే వినోదం ఇందులో ఉంది.

ఎవ‌రెలా చేశారంటే: రొమాంటిక్ కామెడీ క‌థ‌తో కూడిన ఈ సినిమాలో శ్రీసింహా చ‌క్క‌గా ఒదిగిపోయాడు.  పాత్ర‌కి తగిన‌ట్టుగా అమాయ‌కంగా, ఆవేశంగా క‌నిపిస్తూ వినోదం పండించాడు.  మిషా నాంగ‌ర్ అమాయ‌కంగా, ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్రతో మెప్పిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో ఆమె అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది.  చిత్ర‌శుక్లా  గంద‌ర‌గోళానికి గుర‌య్యే అమ్మాయిగా మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించింది. ఎదుటివాళ్లు ఏం చెబుతున్నారో విన‌కుండా మాట్లాడే పాత్ర‌లో స‌త్య కామెడీ న‌వ్విస్తుంది. వైవాహ‌ర్ష‌, ర‌వి వ‌ర్మ‌, రాజీవ్ క‌న‌కాల‌, శ‌ర‌ణ్య త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.  సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. కాల‌భైర‌వ పాట‌లు, నేప‌థ్య సంగీతం చిత్రానికి బ‌లాన్నిచ్చింది.  ‌మ‌ణికాంత్  గెల్లి  కొత్త క‌థ‌నైతే చెప్పాడు కానీ, దాన్ని మ‌రింత బిగితో చెప్ప‌డంలో విఫ‌ల‌మయ్యారు. ర‌చ‌యిత నాగేంద్ర పిల్లా క‌థ‌లో కొత్త‌ద‌నం ఉంది. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకుంటాయి.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ క‌థ‌ - క‌థ‌నం
+ న‌టీన‌టులు - సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు
+ హాస్యం  

చివ‌రిగా:  కుటుంబ వినోదంతో ... ‘తెల్ల‌వారితే గురువారం’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని