
తాజా వార్తలు
నిర్మాతగా, దర్శకుడిగా చేసినా నటుడిగా దొరికే సంతృప్తే వేరు. నాకదే గొప్పగా అనిపిస్తుంది’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. హాస్యనటుడిగా తెరపై మెరిసి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి చిత్రాలతో కథానాయకుడిగానూ సత్తా చాటారు. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో నటిస్తూనే ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ చిత్రంతో దర్శకనిర్మాతగా కొత్త అవతారమెత్తారు. వెన్నెల కిషోర్, సత్య, షకలక శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శ్రీనివాస్ రెడ్డి.
నటుడిగా సాఫీగా సాగిపోతున్న మీరు నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది?
శ్రీనివాసరెడ్డి: నాకు సినిమాపై ఇష్టం కన్నా ప్రేమ ఎక్కువ. ఓ చిన్న కథతో కొత్తవారికి అవకాశమిస్తూ తక్కువ బడ్జెట్లో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్ర స్క్రీన్‌ప్లే రచయిత చెప్పిన చిన్న లైన్ నుంచి ఈ కథను సిద్ధం చేసుకున్నాం. ఇది చాలా బాగా రావడంతో నేనే స్వయంగా నిర్మించాలని అనుకున్నా. అందుకే ‘ఫ్లయింగ్ కలర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాం. మా హాస్యనటులందరం కలిసి పెట్టుకున్న గ్రూప్ ఇది. ఇది శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో అదే పేరుతో బ్యానర్‌ని రిజిస్టర్ చేయించా.
మరి మీరే ఎందుకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది?
శ్రీనివాసరెడ్డి: దర్శకత్వ బాధ్యతను అనుకోకుండా అందుకున్నప్పటికీ దర్శకుడిగా మారాలన్న కల నాకు ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఈవీవీ నుంచి అనిల్ రావిపూడి వరకు నేను పనిచేసిన ప్రతి దర్శకుడి వద్ద మెళకువలు నేర్చుకునేవాడిని. కథలో చాలా పాత్రలున్నా.. అందరి పాత్రలకీ మంచి ప్రాధాన్యత ఉంది. ఇందులో చేస్తున్న సత్య, వెన్నెల కిషోర్, శంకర్ వంటి వారందరి బలాబలేంటో నాకు బాగా తెలుసు. కాబట్టి మరో దర్శకుడితో తెరకెక్కించే కన్నా నేనే దర్శకత్వం చేస్తే బాగుంటుందనిపించి ఆ బాధ్యత తీసుకున్నా.
మీ ప్రయత్నం విఫలమైతే వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా?
శ్రీనివాసరెడ్డి: సినిమా విఫలమైతే ఇండస్ట్రీలో నాకు చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచన లేదు. నాకున్న నాలెడ్జ్‌లో ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలో తెలుసు. అందుకు తగిన కసరత్తులు చేశాం. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా రాసుకున్నాం. అందరినీ కూర్చొబెట్టి కథ చెప్పిన తర్వాత ఒక్కరు కూడా ‘ఈ సినిమా వద్దులే’ అని చెప్పలేదు. అయితే, సినిమా తీసే విషయంలో ఇప్పటికీ నేను నేర్చుకునే దశలోనే ఉన్నా. ఇండస్ట్రీలోని చాలా మంది పెద్దలు సినిమా చూసి, చెప్పిన చిన్న చిన్న సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి.
ఈ కథా నేపథ్యం ఏంటి?
శ్రీనివాసరెడ్డి: ‘క్షణక్షణం’, ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రాల తరహాలో ఒకరోజులో ఉదయం నుంచి సాయంత్రంలోపు నడిచే కథ ఇది. మాదకద్రవ్యాల ముఠా నేపథ్యం చుట్టూ తిరుగుతుంది. వీళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. అనుకోకుండా ఆ వ్యవహారంలో మేం చిక్కుంటాం. ఈ నేపథ్యంలో కథలోని పాత్రలన్నీ ఒకొక్కటిగా బయటకొస్తుంటాయి. ఇదంతా పూర్తిగా హైదరాబాద్ రోడ్లపైనే జరుగుతుండటం, మాదకద్రవ్యాల చుట్టూ అల్లుకున్న కథ కావడంతో దీనికి తగ్గట్లుగానే ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ అన్న పేరు పెట్టాం.
కేవలం ఎంటర్టైన్మెంట్గానే ఉంటుందా?
శ్రీనివాసరెడ్డి: మేం చెప్పాలనుకున్న కథను, సందేశాన్ని ఎంతో వినోదాత్మకంగా చూపించబోతున్నాం. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన అనేక అంశాల్ని ఇందులో నవ్వులు పూయించేలా చూపించాం.
ఈ సినిమా కోసమే ‘సరిలేరు నీకెవ్వరు’ వదులుకున్నారా?
శ్రీనివాసరెడ్డి: అవును దర్శకత్వం వహిస్తుండటంతో చిత్రం చెయ్యలేకపోయా. ఒకటి రెండు సినిమాలూ వదులుకున్నా. మా నాన్న ఇందులో చిన్న పాత్ర చేశారు. తొలి సన్నివేశాన్ని ఆయనపైనే తీశా. బాధాకరంగా ఇటీవలే ఆయన కన్నుమూశారు. ఈ చిత్రంతో మా అల్లుడిని నటుడిగా తెరకు పరిచయం చేశా. ఈ చిత్రీకరణ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా.
దర్శకత్వాన్ని కొనసాగిస్తారా?
శ్రీనివాసరెడ్డి: స్వతహాగా హాస్యనటుడిని కాబట్టి దర్శకుడిగా వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించడానికే ఇష్టపడతా. దర్శకత్వం చేసినా నటుడిగా ఎప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంటా. ప్రస్తుతానికి నటుడిగా నాలుగు చిత్రాలు చేయబోతున్నా
బన్ని.. హారర్ స్టార్ అయిపోతావన్నారు..
‘‘గీతాంజలి’, ‘ఆనందోబ్రహ్మా’ల వల్ల ఎక్కువగా ఆ తరహా కథలే వస్తున్నాయి. అందుకే కథానాయకుడిగానూ అవకాశాలొస్తున్నాయి అదే జోనర్లో చేయడం ఇష్టం లేక ఒకే చెప్పట్లేదు. అల్లు అర్జున్ ఒకసారి ఫోన్ చేసినప్పుడు నువ్వు హారర్లే చేస్తూ పోతే చిత్రసీమకు నువ్వొక హారర్ స్టార్ అయిపోతావేమో అన్నారు.