అందుకే మొలకల్ని అల్పాహారంగా తీసుకోవాలట! - start your day with this protein rich breakfast
close
Published : 18/07/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే మొలకల్ని అల్పాహారంగా తీసుకోవాలట!

శరీరంలోని జీవక్రియల నిర్మాణంలో, కండరాలను బలోపేతం చేయడంలోనూ ప్రొటీన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి దోహదం చేస్తాయి. ప్రత్యేకించి ప్రొటీన్లతో నిండి ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల.. రోజంతా ఎలాంటి ఒత్తిడి, అలసట లేకుండా చురుగ్గా అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రొటీన్‌ షేక్స్‌, స్మూతీస్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాయామం చేసిన తర్వాత కోల్పోయిన శక్తిని తిరిగి పొందచ్చు. అందుకే ప్రొటీన్లు సమృద్ధిగా నిక్షిప్తమై ఉన్న మొలకల్ని అల్పాహారంగా తీసుకోమని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఫలితంగా అధిక బరువు తగ్గించుకోవడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని చెబుతున్నారు.

బరువు తగ్గేందుకు!

పెసలు, శెనగలు, బీన్స్‌, బఠానీ.. వంటి కాయధాన్యాల్లో ప్రొటీన్లతో పాటు శరీరానికి అత్యవసరమైన సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీర నిర్మాణంలో.. ముఖ్యంగా కండరాలు, ఎముకల ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరంలోని క్యాలరీలను కరిగించడంలోనూ ఇవి తోడ్పడతాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను, ఆకలి హార్మో్న్‌ను నియంత్రణలో ఉంచుతాయి. ఫలితంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రొటీన్లతో పాటు ఫోలేట్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, విటమిన్లు- సి, కె, ఇతర ఖనిజాలతో నిండిన స్ప్రౌట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చు.

ఇమ్యూనిటీ పెరుగుతుంది!

స్ప్రౌట్స్‌లో పుష్కలంగా ఉండే విటమిన్‌-సి తెల్లరక్త కణాలు అధికంగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది. ఇవి వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇక ఇందులోని విటమిన్‌-ఎ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి.

చర్మ సంరక్షణకు!

చర్మం, శిరోజాల సంరక్షణ అనేది మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. మొలకలను రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవి చర్మంతో పాటు శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా ప్రకాశవంతమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవాలంటే స్ప్రౌట్స్‌ను ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

జీర్ణక్రియా రేటు మెరుగుపడుతుంది!

జీర్ణక్రియా రేటును మెరుగుపరచడంలో పీచు ఎంతో కీలకం. ఇది మొలకెత్తిన గింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని పేగు కదలికల సామర్థ్యాన్ని పెంచి తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. తద్వారా మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఇవి కూడా!

* ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో జబ్బు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించే మొలకలు తీసుకోవడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.

* శరీరానికి అవసరమైన ఫ్యాటీ ఆమ్లాలు మొలకల్లో పుష్కలంగా ఉంటాయి.

* శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపించడంలో మొలకల్లోని పోషకాలు బాగా తోడ్పడతాయి.

* వీటిని తినడం వల్ల ఐరన్‌ పెద్ద మొత్తంలో శరీరానికి అందుతుంది. ఇది శరీరంలో హెమోగ్లోబిన్‌ స్థాయుల్ని పెంచడంతో పాటు ఆక్సిజన్‌ను అన్ని భాగాలకు సరఫరా చేసేందుకు సహాయపడుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని