రోజుని మొదలు పెట్టేయండిలా... - starting your day spl article
close
Published : 10/02/2021 23:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోజుని మొదలు పెట్టేయండిలా...

హర్షిత ఉదయం నిద్ర లేవడమే ఉత్సాహంగా ఇంటి పనితోపాటు వంటపనీ మొదలుపెడుతుంది. సమయానికి పనులన్నీ ముగించి మరీ... ఆఫీస్‌కు బయలుదేరుతుంది. ఆమని మాత్రం ఎంత త్వరగా నిద్ర లేచినా... అనుకున్నట్లుగా పని పూర్తి చేయలేదు. ఆ రోజంతా ఆ ప్రభావం ఆమెపై పడుతుంది. వాటిని గుర్తు తెచ్చుకుంటూ పరధ్యానంగానే ఉంటుంది. దీంతో ఏ పనీ సవ్యంగా పూర్తికాదు. అలాకాకుండా ఉదయం నిద్ర లేవడమే ఆ రోజును ఎలా మొదలుపెట్టాలో ముందుగా ప్రణాళిక వేసుకున్నవారే జీవితంలో విజయాలు సాధించగలరు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు అని చెబుతున్నారు నిపుణులు.

ఆస్వాదించాలి: ప్రతి రోజూ ఉదయాన్ని మనసారా ఆస్వాదించడం నేర్చుకోవాలి. పక్షుల కువకువలు, లేలేత సూర్యకిరణాలు, అప్పుడే విచ్చుకుంటున్న పూలు ఇవన్నీ మనసును ఉత్సాహపరుస్తాయి. అటువంటి సమయంలో శరీరమూ, మనసూ శక్తివంతంగా ఉంటాయి. అప్పుడు ఏ పనైనా ఉత్సాహంగా మొదలుపెట్టొచ్చు.

ముందు రోజు: నిద్ర పోయేముందు మరుసటి రోజు చేయాల్సిన పనులను ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇలా చేస్తే తెల్లవారిన తరువాత పనులన్నింటినీ చకచకా పూర్తి చేయొచ్చు. అలాగే ముందురోజు మర్చిపోయిన లేదా సమయం లేకపోవడంవల్ల పూర్తిచేయలేని వాటిపై కూడా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది.  

వృథా చేయొద్దు: సమయం చాలా విలువైంది. గడిచిన క్షణాన్ని తిరిగి తీసుకురాలేం. అందుకే ప్రతి నిమిషాన్నీ విలువగా గడపడం నేర్చుకోవాలి. అప్పుడే సమయం మన చేతిలో ఉంటుంది. ప్రణాళిక మేరకు బాధ్యతలన్నింటినీ పూర్తిచేయగలుగుతాం.

యోగా: శరీరానికి, మనసుకు రోజూ వ్యాయామం అవసరం. ఉదయం నిద్ర లేచిన తరువాత, అలాగే రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాలపాటు యోగా, ధ్యానం చేస్తే ఆ రోజంతా ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. మనసంతా ప్రశాంతంగా మారుతుంది. రాత్రి హాయిగా నిద్రపడుతుంది. మరుసటి రోజు ఉత్సాహంగా నిద్ర లేవొచ్చు.

కుటుంబంతో: ఎంత బిజీ జీవితమైనా, కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. పనులెన్ని ఉన్నా, ఉదయంపూట కుటుంబసభ్యులతో కలిసి పదినిమిషాలు వ్యాయామం చేయడం, లేదా సాయంత్రం తోటపని కలిసి చేయడం వల్ల అందరిమధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. అందుకే ఆ రోజు చేయాల్సిన పనుల పట్టికలో వీటినీ జత చేసుకోవడం మర్చిపోకూడదు.

పట్టికగా: దైనందిన కార్యక్రమాలు, చేయాల్సిన పనులు, బాధ్యతలను ఓ పుస్తకంలో నోట్‌ చేసుకోవడం అలవరుచుకోవాలి. అలాగే ఏ రోజు ఏ పని చేయాలో వారానికి, నెలకు విడదీసి పట్టికలా తయారుచేసుకుంటే పని సులువు అవుతుంది. అప్పుడే ఏ విషయాన్నీ... అశ్రద్ధ చేశామనే ఆలోచన రాదు. ప్రతి అంశాన్నీ మనసులో గుర్తు ఉంచుకోవడానికి వీలుగా ఉంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని