కరోనా: జేబుకు చిల్లుపడుతున్నా ప్రైవేటుకే మొగ్గు - state second wave of covid shortage of beds return to haunt govt hosps get more beds
close
Published : 17/04/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: జేబుకు చిల్లుపడుతున్నా ప్రైవేటుకే మొగ్గు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రెండో దశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంతో పోలిస్తే తెలంగాణలో వైరస్‌ బారినపడి ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. మహమ్మారి నుంచి కోలుకునేందుకు చాలా మంది ప్రైవేటు బాటపడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రైవేటులో పడకలు దొరకడం లేదు.

గతంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి సుమారు 15 వేల పడకలను అందుబాటులో ఉంచిన తెలంగాణ సర్కారు.. ఇప్పుడు ఐసోలేషన్‌ కేంద్రాలతో కలిపి సుమారు 30 వేలకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27,800లకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండగా అందులో 9 వేల మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2600లకు పైగా రోగులు ఉండగా, ప్రైవేటులో 6500 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రైవేటులో ఒక్కో పడకకు రోజుకి రూ.4 వేల బెడ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక మందులు, డాక్టర్‌ ఫీజు, నర్సింగ్‌ సేవలు, పీపీఈ కిట్ల రుసుం అంటూ సుమారు రోజుకు రూ.10 వేలు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో 3,843 పడకలకు ప్రస్తుతం 2,650 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటులో 4754 పడకలకు కేవలం 1,751 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కరీంనగర్‌లోని సర్కారు దవాఖానాలో 180 పడకలకు 92 ఖాళీగా ఉండగా.. ప్రైవేటులో 598కిగానూ 389 అందుబాటులో ఉన్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన 50 కొవిడ్‌ పడకలు పూర్తిగా నిండిపోయాయి. ఇక్కడ మరిన్ని పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

మేడ్చల్‌ జిల్లా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే 585 మంది చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్‌లో రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో సర్కారు దవాఖానాల్లో 561 పడకలు ఉండగా.. ఖాళీగా ఉన్నవి కేవలం 214 మాత్రమే. ప్రైవేటులోనూ 297 పడకలకు 266 ఇప్పటికే నిండిపోయాయి. కొవిడ్‌ నేపథ్యంలో సర్కారు ఆస్పత్రుల్లో వసతులను ప్రభుత్వం మెరుగుపర్చింది. ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టింది. అయినా ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని