Tollywood: తెరను నడిపించే తారామణులేరీ? - story on tollywood women centric films
close
Updated : 02/07/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: తెరను నడిపించే తారామణులేరీ?

 విద్యాబాలన్‌, అలియా భట్, కంగనా రనౌత్‌, తాప్సీ.. బాలీవుడ్‌ ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్లు. కథా ప్రాధాన్యమున్న చిత్రాలు, ముఖ్యంగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో బీటౌన్‌లో బలమైన ముద్ర వేస్తున్నారు. కనీసం ఏడాదిలో ఒక్కటైనా అలాంటి సినిమాను ప్రేక్షకులందించి అభిరుచిని చాటుకుంటున్నారు. కనీసం పది చిత్రాలైనా ప్రతి ఏటా బాలీవుడ్‌ను పలకరిస్తున్నాయి. మరీ తెలుగు పరిస్థితి ఏంటి? కథానాయికల చుట్టూ అల్లుకున్న చిత్రాలు ఎన్ని వస్తున్నాయంటే సమాధానం దొరకదు. అలాంటి సినిమాల్లో నటించేందుకు ముందుకొస్తున్న నటీమణులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం తెరకెక్కుతున్న లేడీ ఓరియేంటెడ్‌ సినిమాలేంటి? టాలీవుడ్‌లో మహిళల చిత్రాలు తక్కువగా రావడానికి కారణాలేంటో పరిశీలిద్దాం. 

గతమెంతో ఘనం

తెలుగు సినిమాల్లో కథ హీరో చుట్టూనే తిరుగుతుంది. హీరోయిన్లు నాలుగు పాటలకు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమవుతారు. సినిమా వ్యాపారం కూడా వారి మీదే ఆధారపడి ఉంటుంది. అయితే తెలుగులో భావనను బద్దలు కొట్టిన ఫీమెల్‌ ఓరియేంటెడ్‌ సినిమాలున్నాయి. స్త్రీతత్వాన్ని, సమస్యలు, జీవన విధానాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కించారు దర్శకనిర్మాతలు.  వాటిలో  ‘అంతులేని కథ’, ‘మీనా’, ‘జ్యోతి’, ‘మాతృదేవోభవ’, ‘దాసి’, ‘అమ్మ రాజీనామా’, ‘మయూరి’, ‘సితార’, ‘పదహారేళ్ల వయసు’, ‘ఆమె’ ఇలా గతంలో పలు చిత్రాలు సూపర్‌ హిట్లుగా నిలిచాయి.  ఆ తర్వాత వాటికి అంతటి గ్లామర్‌ను తీసుకొచ్చింది మాత్రం లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి. 

మహిళా చిత్రాల వేగుచుక్క విజయశాంతి

 విజయనిర్మల, జయసుధ, శారదల తర్వాత ఆ బాధ్యతను భుజానేసుకున్న నటి విజయశాంతి.  అంత వరకు ఫిమేల్‌ ఓరియేంటెడ్‌ సినిమాలంటే అవార్డు చిత్రాలనే ముద్రను పూర్తిగా చెరిపేశారు. కమర్షియల్‌ హంగులతో విజయాల బాట పట్టించారామె. అంతవరకు హీరోల పక్కన ఆడిపాడిన ఆమే.. ఆ తర్వాత వారితో పోటీపడి వసూళ్లు సాధించారు. లేడీ  పోలీసాఫీసర్‌గా ‘కర్తవ్యం’, దొరలపై తిరుగుబాటు చేసే యువతిగా ‘ఒసేయ్‌ రాములమ్మ’తో పాటు ‘ప్రతిఘటన’ లాంటి చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి. ‘వైజయంతి’, ‘శాంభవి ఐపీస్‌’ ఇలా వరుసగా అలాంటి సినిమాల్లోనే నటించారు.

అరుంధతితో ఆశలు

 ఆ తర్వాత అడపాదడపా సినిమాలు తెరకెక్కినా విజయవంతంగా ఆడినవి తక్కువే. కమర్షియల్‌గా విజయాలు సాధించడమే కష్టమైన తరుణంలో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు ఊపిరి పోసింది అనుష్క. ‘అరుంధతి’గా వెండితెరపై విశ్వరూపం చూపించింది. కలెక్షన్లూ దండిగానే వచ్చాయి. హారర్‌ సినిమా అయినప్పటికీ కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. హీరో లేకుండానే బాక్సాఫీసును కొల్లగొట్టొచ్చని చూపించిందామె. ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ సినిమాలతో విజయాలు సాధించింది. ‘పంచాక్షరీ’, ‘సైజ్‌ జీరో’, ‘నిశ్శబ్దం’ సినిమాలు పరాజయం పాలయ్యాయి.  ఛార్మీ ‘అనుకోకుండా ఒక రోజు’, ‘మంత్ర’, ‘మంత్ర2’, ‘జ్యోతిలక్ష్మి’ చిత్రాలతో ఆకట్టుకుంది.  ‘ఆనంద్’‌, ‘గోదావరి’, ‘ఫిదా’ సినిమాలతో హీరోయిన్‌ పాత్రలను బలంగా రాసుకున్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల.  ‘మహానటి’తో కీర్తి సురేశ్‌ ఘనవిజయాన్ని అందుకుంది. అంజలి ‘గీతాంజలి’తో హిట్‌ కొట్టింది. ఇవే గత పదేళ్లుగా తెలుగులో గుర్తుండిపోయే మహిళా చిత్రాలు. 

నయనతార అనువాదాలు

తమిళనాట లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న భామ నయనతార. తెలుగులో ‘కహాని’ రీమేక్‌ ‘అనామిక’లో నటించింది. తమిళంలో ఆమెవి పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. వాటిలో ‘కర్తవ్యం’, ‘అంజలి ఐపీఎస్’‌, ‘మయూరి’, ‘వాసుకి’, ‘కోకో కోకిల’ చిత్రాలు తెలుగులోకి అనువాదమయ్యాయి. అయితే ‘కర్తవ్యం’ మినహా ఏవీ ఇక్కడ మెప్పించలేకపోయాయి.  తమిళంలో రాబోయే ‘నేట్రికారన్’‌, ‘ఆరమ్‌ 2’ చిత్రాలూ నయనతార చుట్టూ తిరిగే కథలతోనే తెరకెక్కుతున్నాయి.   

సమంతా.. కీర్తీ సురేశ్‌

ఇప్పుడున్న హీరోయిన్లలో ఎక్కువ మంది గ్లామరస్‌ రోల్స్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. లేడీ ఓరియేంటెడ్‌ సినిమాలు చేస్తున్నవారు తక్కువ. అనుష్క తర్వాత సమంతా అలాంటి ప్రయత్నాలు చేసి విజయాలు సాధించింది. తమిళ రెబల్‌ రాజీగా ‘ఫ్యామిలీమ్యాన్‌2’లో నటించి ప్రశంసలు పొందింది సమంత.  ఆమె తెలుగులో  ‘యూ టర్న్‌’తో పాటు నందిని రెడ్డితో చేసిన ‘ఓ బేబీ’లో నటించింది. వీటిలో ‘ఓబేబీ’  కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించింది. ఇప్పుడు గుణశేఖర్‌ ‘శాకుంతలం’లో టైటిల్‌ రోల్‌లో కనిపించనుంది. ఒక హిట్‌, ఒక ఫ్లాప్‌ల అనుభవం ఉన్న సమంత ఈ సినిమాతో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకుంది కీర్తి సురేశ్‌. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు  ‘గుడ్‌ లక్‌ సఖి’లో పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తోంది. కాజల్‌ కూడా ‘ఉమ’ అనే సినిమాకు సంతకం చేసింది. తమన్నా ‘దటీజ్‌ మహాలక్ష్మి’ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినా ఇంకా విడుదలకు నోచుకోలేదు. తమన్నా వెబ్‌ సిరీస్‌లలో ఇలాంటి పాత్రలు పోషించినా సినిమాల్లోకి వచ్చేసరికి గ్లామర్‌ డాల్‌గా ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఏకంగా అలాంటి సినిమాలు చేయలేనని ఓ ఇంటర్వ్యూలలో చెప్పడం గమనార్హం. దీంతో అనుష్క, సమంత తప్ప మహిళల చిత్రాలకు మరో నటి కనిపించట్లేదు. 

మార్కెటే కారణమా?

హిందీలో మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు కనీసం పది విడుదలవుతాయి. అక్కడ కంగన, తాప్సీ, విద్యాబాలన్‌, అలియా భట్‌ వీరంతా అలాంటి సినిమాలతో స్టార్‌డమ్ సాధించుకున్నవారే. తెలుగులో ఈ సంఖ్య పరిమితం. దీనికి కారణం సినిమా మార్కెట్‌ అనే అంటున్నారు ఫిలిం మేకర్స్‌.  ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకాదరణతో పాటు వసూళ్లు ఉండవని తరచూ వినిపించే మాట.  బాలీవుడ్‌ సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్‌ ఉంది. పైగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. దీనివల్ల సినిమా నష్టపోయే అవకాశమే ఉండదు. టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితి లేదు.  తెలుగు సినిమా మార్కెట్‌  హీరో చుట్టూ తిరుగుతుంది. కథ, కథనాలు ఎంత బలంగా ఉన్నా.. సినిమా  విజయవంతంగా ఆడాలంటే కథానాయకుడు ఉండాల్సిందే. అందుకే తెలుగులో మహిళా చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. రెండు రాష్ట్రాలకే పరిమితమై ఉన్న మార్కెట్‌లో హీరోలతో పోటీపడి వసూళ్లు సాధించడం కష్టమనే భావన ఉంది. యువదర్శకులు ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రోత్సాహం దక్కట్లేదు.  ఓటీటీలు వచ్చాక కథా బలమున్న సినిమాలకు ఆదరణ పెరిగింది.  ప్రతిభను నిరూపించుకోడానికి, వైవిధ్యాన్ని చూపించేందుకు ఓటీటీ మంచి వేదిక. ఇక ముందైనా  ఇలాంటి కథలపై దృష్టి సారించి మంచి చిత్రాలను అందిస్తారని ఆశిద్దాం. 

Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని