INDvsENG: స్వీయ సలహాతో ‘సూర్యకుమార్‌’ హిట్‌ - surya kumar yadavs self advice before going to play for india against england
close
Published : 25/05/2021 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INDvsENG: స్వీయ సలహాతో ‘సూర్యకుమార్‌’ హిట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌తో తలపడిన టీ20 సిరీస్‌లో యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దాంతో చాలా రోజులుగా భారత జట్టుకు ఆడాలన్న అతని కోరిక ఎట్టకేలకు నెరవేరింది. అయితే, ఏ ఆటగాడైనా తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేటప్పుడు తీవ్ర ఆందోళనకు గురవ్వడం సహజం. ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా తొలిసారి టీమ్‌ఇండియా తరఫున తాను బ్యాటింగ్‌ చేసే సమయంలోనూ అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నానని సూర్యకుమార్‌ అన్నాడు. ముంబయి ఇండియన్స్‌ తాజాగా ఆ వీడియోను పంచుకోగా, ఆ మ్యాచ్‌ ఆడేటప్పడు తనకు తానే స్వయంగా మార్గనిర్దేశం చేసుకున్నట్లు అతడు చెప్పాడు.

‘మీరు సరిగా గమనించి ఉంటే ఆ రోజు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మరోవైపు ఆదిలోనే రోహిత్‌ ఔటవ్వడంతో నిరాశ చెందా. కానీ, నేను మైదానంలోకి వెళ్లేటప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్లాను. దాంతో నేనెంత ఉత్సాహంగా ఉన్నానో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా అదే సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యా. అప్పటివరకు మూడో స్థానంలో ఎలా ఆడాననే విషయాలన్నీ బుర్రలో గిర్రున తిరిగాయి. దాంతో నాకు నేనే ఓ సలహా ఇచ్చుకున్నా. కొత్త ప్రయోగాలకు వెళ్లొద్దని, ఇంతకుముందు ఆ స్థానంలో ఎలా ఆడానో ఇప్పుడూ అలాగే ఆడాలనుకున్నా. నా సహజసిద్ధమైన ఆటే ఆడాలని నిర్ణయించుకున్నా’ అని సూర్యకుమార్‌ చెప్పుకొచ్చాడు.

అనంతరం ఆర్చర్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలచిన విషయంపై స్పందిస్తూ.. ప్రజలంతా దాని గురించే మాట్లాడుతున్నారని సూర్య గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌ అనుభవంతో ఆ సమయంలో ఇంగ్లాండ్‌ పేసర్‌ ఎలాంటి బంతులు విసురుతాడోననే విషయం తనకు ముందే తెలుసనీ, అనుకున్నట్లే ఆర్చర్‌ బంతి విసరడంతో దాన్ని సిక్సర్‌గా మలిచానని చెప్పాడు. కాగా ఆ మ్యాచ్‌లో రోహిత్ త్వరగా ఔటయ్యాక సూర్యకుమార్‌ బరిలోకి దిగాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడి 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 185/8 భారీ స్కోర్‌ సాధించింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ 177/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. దాంతో సూర్య ఆడిన తొలి మ్యాచ్‌లోనే అందర్నీ ఆకట్టుకున్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని