Ichata Vahanumulu Niluparadu Review రివ్యూ: ఇచ్చట వాహనములు నిలుపరాదు - sushanth ichata vahanumulu niluparadu telugu movie review
close
Updated : 27/08/2021 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ichata Vahanumulu Niluparadu Review రివ్యూ: ఇచ్చట వాహనములు నిలుపరాదు

చిత్రం: ఇచ్చట వాహ‌నములు నిలుప‌రాదు; న‌టీన‌టులు: సుశాంత్‌, మీనాక్షి చౌద‌రి, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు; సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు; ఛాయాగ్రహణం: ఎమ్‌.సుకుమార్‌; కూర్పు: గ్యారీ బిహెచ్‌; మాటలు: సురేష్‌బాబా, భాస్కర్‌; నిర్మాత‌: ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల‌; ద‌ర్శక‌త్వం: ఎస్‌.ద‌ర్శ‌న్‌; విడుద‌ల: 27-08-2021

తెలుగు చిత్రసీమ‌లో వినోదాల‌ సంద‌డి కొన‌సాగుతోంది. గ‌త మూడు వారాల్లాగే ఈ వారం కూడా అర‌డ‌జ‌ను వ‌ర‌కూ చిన్న చిత్రాలు థియేట‌ర్ల ముందుకు వ‌రుస క‌ట్టాయి. వీటిలో ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు‘ ఒక‌టి. చి.ల‌.సౌ., అల‌.. వైకుంఠ‌పుర‌ములో వంటి విజ‌యాల త‌ర్వాత సుశాంత్ నుంచి వ‌స్తున్న చిత్రమిది. కొత్త ద‌ర్శకుడు ఎస్‌.దర్శన్ తెరకెక్కించారు. విభిన్నమైన థ్రిల్లర్ క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం.. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో సినీప్రియుల దృష్టిని ఆక‌ర్షించింది. మ‌రి ఈ సినిమాతో సుశాంత్ త‌న విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగించారా? ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంది?

క‌థేంటంటే: అరుణ్ (సుశాంత్) ఓ మ‌ధ్యత‌ర‌గ‌తి కుర్రాడు. డిజైన్ స్టూడియో అనే కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా ప‌ని చేస్తుంటాడు. అదే కంపెనీలో ఆర్కిటెక్ట్ ఇంట‌ర్న్ కోసం జాయిన్ అవుతుంది మీనాక్షి (మీనాక్షి చౌద‌రి). ఇద్దరూ తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతారు. మీనాక్షి అన్న న‌ర్సింగ్‌ యాద‌వ్ (వెంక‌ట్‌) స్నేహ‌పురి ఏరియాకి ఓ నాయ‌కుడిలా వ్యవ‌హ‌రిస్తుంటాడు. త‌న ఏరియాలో జ‌రిగే వ‌రుస దొంగ‌త‌నాలు, దోపిడీల‌ను అడ్డుకునేందుకు త‌న మ‌నుషుల‌తో నిత్యం గ‌స్తీ కాయిస్తుంటాడు. ఓరోజు న‌ర్సింగ్‌ ఊరెళ్లడంతో.. మీనాక్షిని క‌లిసేందుకు అరుణ్ త‌న కొత్త బైక్‌పై స్నేహ‌పురి ఏరియాకు వెళ్తాడు. నో పార్కింగ్ అని బోర్డున్న ఓ ఇంటిముందు త‌న బైక్ పార్క్ చేసి ఆమెను క‌లిసేందుకు వెళ్తాడు. అదే స‌మ‌యంలో అక్కడ ఓ సీరియ‌ల్ న‌టి హ‌త్య జ‌రుగుతుంది. అది అనుకోకుండా అరుణ్ మెడ‌కు చుట్టుకుంటుంది. అరుణ్‌కు సాయం చేసేందుకు వ‌చ్చిన పులి (ప్రియ‌ద‌ర్శి) కూడా క‌నిపించ‌కుండా పోతాడు. మ‌రి ఆ హ‌త్యకు కార‌కులు ఎవ‌రు? అరుణ్ ఆ కేసు నుంచి, ఆ స్నేహ‌పురి ఏరియా నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? క‌నిపించ‌కుండా పోయిన పులికి ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలో న‌ర్సింగ్‌, భూష‌ణ్ (ర‌వివ‌ర్మ‌), సీఐ రుద్ర (కృష్ణ చైత‌న్య‌)ల‌కు ఉన్న లింకేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌.  కామెడీ.. రొమాన్స్‌.. యాక్షన్‌.. థ్రిల్లింగ్‌.. ఇలా అన్ని అంశాల‌ను స‌మ‌పాళ్లలో మేళ‌విస్తూ ద‌ర్శకుడు ఎంతో చ‌క్కగా క‌థ రాసుకున్నారు. నిర్లక్ష్యంగా చేసిన కొన్ని ప‌నుల వ‌ల్ల క‌థానాయ‌కుడు ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడు.. త‌న వాళ్లని ఎలా ఇబ్బందుల్లో పెట్టుకున్నాడు.. వాటి నుంచి ఎలా బ‌య‌ట‌పడ్డాడన్నది క్లుప్తంగా చిత్ర  ఇతివృత్తం. ఓ లైన్‌గా చెప్పుకున్నప్పుడు ఇది చిన్న పాయింట్‌లా క‌నిపించినా.. దీంట్లో అంతర్లీనంగా మ‌రికొన్ని ఉప‌క‌థ‌లు క‌నిపిస్తుంటాయి. స్నేహ‌పురి కాల‌నీలో న‌ర్సింగ్‌.. భూష‌ణ్‌ల పొలిటిక‌ల్ వార్‌, రాజ‌కీయంగా.. వ్యక్తిగ‌తంగా న‌ర్సింగ్‌ను దెబ్బ తీయ‌డానికి భూష‌ణ్‌తో క‌లిసి సీఐ రుద్ర వేసే ప‌న్నాగాలు.. ఈ పోరులో అనుకోకుండా స‌మ‌స్యల్లో చిక్కుకున్న అరుణ్ జీవితం.. అతని ప్రేమ‌క‌థ వంటివి క‌నిపిస్తాయి. వీట‌న్నింటిని ఒక‌దానితో ఒక‌టి ద‌ర్శకుడు ముడిపెట్టిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ఆరంభంలో తొలి ఇర‌వై నిమిషాలు అరుణ్‌, మీనాక్షిల పరిచ‌యం.. వారిద్దరూ ప్రేమ‌లో ప‌డ‌టం.. ఇద్దరి మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాల‌తోనే న‌డిచిపోతుంది. ఆయా స‌న్నివేశాలు అక్కడక్కడామెప్పించినా.. క‌థ‌లో ఎలాంటి ముంద‌డుగు ప‌డిన‌ట్లు అనిపించ‌దు.

అరుణ్ కొత్త బైక్ కొనుక్కుని మీనాక్షి ఇంటికి వెళ్లడం.. ప‌ది గంట‌ల త‌ర్వాత అత‌ను ర‌క్తమోడుతూ తిరిగి రావ‌డం.. మ‌రోవైపు అత‌ని త‌ల్లి ప్రమాదానికి గుర‌వ‌డం.. స్నేహితుడు పులిని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో మ‌ధ్యలో ఏం జ‌రిగిందన్న ఆస‌క్తి ప్రేక్షకుల్లో క‌లుగుతుంది. అక్కడి నుంచి నేరుగా క‌థ‌లోకి వెళ్లిపోయిన‌ దర్శకుడు.. ఎక్కడా ప్రేక్షకుడి దృష్టి మ‌రల్చకుండా క‌థ‌నాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా మీనాక్షి ఇంట్లో నుంచి అరుణ్ బ‌య‌ట ప‌డేందుకు చేసే ప్రయ‌త్నాలు.. అత‌ని బైక్‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లేందుకు సుక్కు (వెన్నెల కిషోర్‌), మేట‌ర్ (హ‌రీష్‌)లు చేసే ప్రయ‌త్నాలు థ్రిల్ పంచుతూనే..  న‌వ్వులు పూయిస్తుంటాయి. అయితే కొన్ని స‌న్నివేశాల్లో నాట‌కీయ‌త మ‌రీ ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది.  ద్వితీయార్ధంలో అరుణ్ హ‌త్య కేసు నుంచి బయట పడేసేందుకు చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహ‌పురి కాల‌నీ  కుర్రాళ్లతో చేసే పోరాటాలు..తదితర సన్నివేశాలతో కథనం ప‌రుగులు పెడుతుంటుంది. క్లైమాక్స్‌లో హ‌త్య కేసు కార‌కుల్ని హీరో త‌న తెలివితేట‌ల‌తో బ‌య‌ట‌పెట్టే సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా అనిపించినా.. ముగింపు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. 

ఎవ‌రెలా చేశారంటే: అరుణ్ పాత్రలో సుశాంత్ ఒదిగిపోయాడు. ప్రతి స‌న్నివేశాన్ని చాలా ఈజ్‌తో అవ‌లీల‌గా చేసేశాడు. డ్యాన్స్‌.. యాక్షన్ ప‌రంగా చాలా కొత్తగా క‌నిపించాడు. సుశాంత్‌.. మీనాక్షిల జోడీ బాగుంది. ముఖ్యంగా మీనాక్షి తెర‌పై చాలా క్యూట్‌గా క‌నిపించింది. న‌ట‌న‌కు ఆస్కారం దొరికిన ప్రతి స‌న్నివేశంలోనూ మెప్పించే ప్రయ‌త్నం చేసింది. సుక్కుగా వెన్నెల కిషోర్‌, మేట‌ర్‌గా హ‌రీష్ న‌వ్వులు పూయించారు. ఆరంభంలో వెంక‌ట్ పాత్రను బ‌లంగా చూపించినా.. త‌ర్వాత ఆ పాత్రని పెద్దగా వాడుకోలేదు. భూష‌ణ్‌గా ర‌వివ‌ర్మ న‌ట‌న బాగుంది. సీఐ రుద్రగా కృష్ణ‌చైత‌న్య త‌న‌దైన విల‌నిజంతో మెప్పించాడు. ద‌ర్శిని పెద్దగా వాడుకోలేదు. డైరెక్టర్‌ దర్శన్‌ తాను అనుకున్న క‌థ‌ని అనుకున్నట్లుగా తెర‌పై చూపించ‌గ‌లిగాడు. ఆరంభంలో ల‌వ్ ట్రాక్ నిడివి త‌గ్గించి.. అసలు క‌థ‌పై దృష్టి పెట్టి ఉంటే ప్రథమార్ధం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారేది. ప్రవీణ్‌ లక్కరాజు నేప‌థ్య సంగీతం, సుకుమార్ ఛాయాగ్రహణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాట‌లు మాత్రం ప‌ర్వాలేద‌నిపించాయి. క‌థ‌కు త‌గ్గట్లుగా సినిమా నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

బ‌లాలు

+ క‌థా నేప‌థ్యం

+ సుశాంత్, మీనాక్షి జోడీ

+ ద్వితీయార్ధం

బ‌లహీన‌త‌లు

- ప్రథమార్ధం

చివ‌రిగా: ర‌య్‌.. ర‌య్‌.. థ్రిల్లింగ్ రైడ్‌ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని