అతడికి కరోనా గురించి తెలియదు! - teenage guy wakes up after ten months without knowing corona
close
Updated : 28/06/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతడికి కరోనా గురించి తెలియదు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ గురించి తెలియని వారుండరు. గతేడాదంతా ఇది ప్రపంచాన్ని వణికించింది. కోట్ల మందికి సోకి.. లక్షల మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. కరోనా దెబ్బకు కుటుంబాలు, సంస్థలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఏదో ఒక రకంగా కరోనా వల్ల బాధితులుగా మారినవారే. దీంతో ప్రతి ఒక్కరి జీవితంలో కరోనా సంక్షోభం ఒక పీడకలగా మిగిలిపోయింది. కానీ, ఓ యువకుడికి మాత్రం రెండు సార్లు కరోనా సోకి.. తగ్గినా అతడికి కరోనా గురించి కానీ, దీని వల్ల ప్రపంచం ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి కానీ అస్సలు తెలియదు. ఎందుకంటే, కరోనా ముందు కోమాలోకి వెళ్లిన ఆ యువకుడు పది నెలల తర్వాత తిరిగి ఇటీవల స్పృహలోకి వచ్చాడు.

2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా వైరస్‌ ప్రబలిన విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తి.. ప్రభావం గురించి ఇతర దేశాలకు అంతగా తెలియని సమయంలో 2020 మార్చి 1న ఇంగ్లాండ్‌కు చెందిన 18 ఏళ్ల జోసెఫ్‌ ఫ్లావిల్‌ను ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో జోసెఫ్‌కు మెదడుకు దెబ్బతగలడంతో కోమాలోకి వెళ్లాడు. అదే సమయంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి చివరి వారంలో అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. బ్రిటన్‌లోనూ తొలిదశ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది.  

అప్పటి నుంచి జోసెఫ్‌ పది నెలలపాటు కోమాలోనే ఉన్నాడు. కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబసభ్యులు ఎవరినీ ఆస్పత్రి సిబ్బంది అతడి వద్దకు వెళ్లనివ్వలేదు. వైద్యులే అతడికి సంరక్షణగా ఉన్నారు. ఆస్పత్రిలో కరోనా బాధితుల తాకిడి పెరగడంతో జోసెఫ్‌కు రెండు సార్లు కరోనా సోకిందట. వైద్యులు దగ్గరుండి అతడిని పర్యవేక్షించడంతో మహమ్మారి నుంచి కోలుకున్నాడు. ఇటీవల కోమా నుంచి తేరుకొని స్పృహలోకి రావడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పది నెలల కాలంలో ప్రపంచం అతలాకుతలమైన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నాడు జోసెఫ్‌. ఇంతకాలం కోమాలో ఉండి కరోనా సృష్టించిన కల్లోలాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు కరోనా నిబంధనలు పాటిస్తూ కొత్త ప్రపంచంలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంకా పూర్తిగా గాయాలు నయం కాకపోవడంతో జోసెఫ్‌కు మరికొంత కాలం చికిత్స అవసరం. దీంతో జోసెఫ్‌ ఆస్పత్రి ఖర్చులకు, అతడి జీవితం మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ కొందరు ‘జోసెఫ్స్‌ జర్నీ’ పేరుతో ఫండ్‌ రైజింగ్‌ ప్రారంభించారు.

ఇవీ చదవండి..

యాంటీబాడీలన ఏమార్చేలా కరోనాలో మార్పులు

కొవిడ్‌ విజేతలకు ఒక్క డోసు టీకా చాలు!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని