వీరే వెండితెర ‘అల్లూరి సీతారామరాజులు’ - telugu actor who play alluri seetarama raju
close
Published : 30/03/2021 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీరే వెండితెర ‘అల్లూరి సీతారామరాజులు’

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితగాథ తెలుగువారికి సుపరిచితమే. అలాంటి స్వాతంత్ర్య యోధుడి పాత్రలో యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మరో విప్లవ వీరుడు కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఇటీవల చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘అల్లూరి మహోగ్రరూపం’అంటూ విడుదల చేసిన లుక్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతామరాజుగా ఏయే సినిమాల్లో ఎవరెవరు అలరించారో చూద్దామా!

ల్లూరి సీతారామరాజు పాత్రపై ఎంతో మనసుపడ్డ వ్యక్తి.. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌. 1950వ సంవత్సరంలోనే ఆయన రామరాజుగా నటించాలని అనుకున్నారు. అందుకు సంబంధించి మేకప్‌ టెస్ట్‌ కూడా చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. దీంతో ఆయన నటించిన జానపద చిత్రం ‘జయసింహ’ పాటల పుస్తకం వెనుక అల్లూరి గెటప్‌లో దిగిన ఫొటోను ప్రచురించారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా సీతారామరాజు పాత్ర చేయడం సాధ్యపడలేదు. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు కూడా తయారుచేయించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈలోగా తోటి నటుడు కృష్ణ సినిమా తీయడంతో ఇంకాస్త ఆలస్యమైంది. పరుచూరి బ్రదర్స్‌ హవా నడుస్తున్న సమయంలో కథ సిద్ధం చేయమని కోరగా, ‘కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చూడండి అన్నగారు.. అప్పటికీ మీకు సినిమా చేయాలనిపిస్తే తప్పకుండా కథ రాస్తాం’ అని చెప్పడంతో ప్రత్యేకంగా షో వేయించుకుని సినిమా చూసి, కృష్ణను అభినందించారు. ఇక తాను సీతారామరాజు సినిమా చేయొద్దని నిర్ణయించుకున్నారు. అయితే, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రాల్లోని పాటల్లో అల్లూరి గెటప్‌ వేసి, నటుడిగా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు.

* ఏయన్నార్‌-వాణీశ్రీ నటించిన ‘ఆలు మగలు’ చిత్రంలో జగ్గయ్య అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. అక్కినేని నాగేశ్వరరావుతో కూడా అల్లూరి గెటప్‌ వేయించాలని తాతినేని ప్రకాశరావు ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో తీయలేకపోయారు.

‘‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడూ ఒక్కో విప్లవ వీరుడై బ్రిటిష్‌ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు. సమూహ శక్తి. సంగ్రామభేరి.. స్వాతంత్ర్య నినాదం.. స్వేచ్ఛా మారుతం’’ అంటూ సూపర్‌స్టార్‌ కృష్ణ డైలాగ్‌లు చెబుతుంటే థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడి నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగిపోయింది. అంతలా ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో ఒదిగిపోయి నటించారాయన. వి.రామచంద్రరావు దర్శకత్వంలో 1974 మే 1 విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’రికార్డులు బద్దలు కొట్టింది.ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించి రజతోత్సవాన్ని, 17 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకొంది. రిపీట్‌ రన్‌లో కూడా వందరోజులు ఆడిన ‘మాయాబజార్‌’, ‘దేవదాసు’ వంటి అతి తక్కువ సినిమాల సరసన అల్లూరి సీతారామరాజు చోటు సంపాదించింది.

తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాలనటుడిగానే తనదైన ముద్రవేశారు మహేశ్‌బాబు.  1988లో కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ముగ్గురు కొడుకులు’ చిత్రంలో మహేశ్‌బాబు నటించారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా మహేశ్‌ ఏకపాత్రాభినయంతో అదరగొట్టారు. ఆ తర్వాత ‘ఖలేజా’లో సీతారామరాజు పేరును తన పాత్రకు పెట్టుకున్నారు.

బాలకృష్ణ కూడా అల్లూరిగా కనిపించి సందడి చేశారు. ‘భారతంలో బాలచంద్రుడు’ చిత్రంలో ఓ సన్నివేశంలో సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ కోసం మరోసారి అల్లూరి గెటప్‌ వేశారు.

ఇప్పటి వరకూ ఎవరూ చూడని అల్లూరి

గ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజు పాత్ర ఇంతకు ముందెప్పుడూ చూడని రీతిలో ఉండబోతోంది. ఎందుకంటే అల్లూరి విప్లవ శంఖం పూరించకముందు కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారు. అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? తదితర విషయాలు చాలా మందికి తెలియవు. అదే సమయంలో తెలంగాణలో గోండు నాయకుడు ‘కొమురం భీం’ కూడా కొన్ని రోజులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లారు. వీరిద్దరూ కలిశారా? లేదా? అన్నది చరిత్రకు వదిలేస్తే, కలిసి ఏం చేశారన్నది మాత్రం చూపించే బాధ్యత జక్కన్న తీసుకున్నారు. కేవలం వారి పాత్రలను మాత్రమే తీసుకుని పూర్తి ఫిక్షనల్‌ స్టోరీగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. మరి వెండితెరపై ఈ నయా సీతారామరాజు పోరాటం ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

-ఇంటర్నెట్‌డెస్క్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని