Samantha: నా కారణంగా బాధపడితే క్షమించండి: సమంత  - telugu news actor samantha interview about family man season 2 shaakunthalam
close
Updated : 25/08/2021 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: నా కారణంగా బాధపడితే క్షమించండి: సమంత 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జెస్సీ’, ‘ఇందు’, ‘బిందు’, ‘గీత’, ‘శశి’, ‘అంజలి’, ‘సమీర’, ‘రామలక్ష్మి’, ‘మధురవాణి’, ‘శ్రావణి’ తదితర వైవిధ్య పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది నటి సమంత (Samantha). ఆ వైవిధ్యతని వెండితెరపైనే కాకుండా డిజిటల్‌ మాధ్యమాల్లోనూ చూపించాలనుకుంది. అలా చేసిన ప్రయత్నం, ప్రయోగమే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’ (The family man 2) వెబ్‌ సిరీస్‌. ఇందులో ‘రాజీ’ పాత్రని పోషించి, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. డీ గ్లామర్‌గా కనిపించి ‘తను సమంతనేనా?’ అనే ఆశ్చర్యంలో పడేసింది. ఉత్తమ నటిగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (Indian film festival of melbourne) అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా సమంత ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో ముచ్చటించింది. ఆ వివరాలివీ...

* ఉత్తమ నటిగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌- 2021 అవార్డు గెలుచుకున్నారు. ఎలా ఫీల్‌ అవుతున్నారు?

సమంత: చాలా చాలా ఆనందంగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’.. నేను నటించిన తొలి వెబ్‌ సిరీస్‌. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ నటిగా అవార్డు పొందడం నాలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ సిరీస్‌ ఇప్పటికే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ అవార్డు ప్రకటనతో మరింత ప్రోత్సాహం అందినట్టే.

* ‘ఫ్యామిలీమ్యాన్‌ 2’ వెబ్‌సిరీస్‌లో రాజీగా అత్యుత్తమంగా నటించారు. కానీ మీ పాత్ర, సిరీస్‌లపై విమర్శలు వచ్చాయి కదా..!

సమంత: అవును. సిరీస్‌ విడుదలకి ముందు కొన్ని విమర్శలు ఎదురైనా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆ ట్రోలింగ్‌ ఆగిపోయింది. అయితే రాజీ పాత్ర పోషించినందుకు ఇప్పటికీ నాపై ఆగ్రహం వ్యక్తం చేసేవారున్నారు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ పాత్రలో నటించలేదు. నాకు బాగా నచ్చడంతో నిజాయతీగా రాజీ పాత్రని పోషించా. అయినా ఆ పాత్ర కొందరిని బాధించింది కాబట్టి ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా.

* సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అక్కినేని సమంత పేరుని తొలగించి ఎస్‌ అని పెట్టారు. అది హాట్‌ టాపిక్‌ అయింది. దీనిపై మీ స్పందన?

సమంత: అది హాస్యాస్పదమైన గాసిప్‌. సాధారణంగా నేను గాసిప్స్‌కి స్పందించను. ఇప్పుడూ అంతే.

* ‘శాకుంతలం’లో నటించడం ఎలా అనిపించింది?

సమంత: పీరియాడికల్‌ చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కోరిక. అది ‘శాకుంతలం’తో నెరవేరింది. ఈ సినిమాకి పని చేయడం గొప్ప అనుభూతిని పంచింది. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌), వి.ఎఫ్‌.ఎక్స్‌ (విజువల్‌ ఎఫెక్ట్స్‌)లతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి ఎదురుచూస్తున్నా.

* ‘కాతువాకుల రెండు కాదల్‌’ చిత్రం కోసం నయనతార, విజయ్‌ సేతుపతితో నటించడం ఎలా ఉంది?

సమంత: నేనెప్పుడూ కామెడీ పాత్రని పోషించడాన్ని ఆనందిస్తా. ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడంతో బాగా ఎంజాయ్‌ చేస్తూ నటించా. ఇందులో భాగమవడం, ఇద్దరు సూపర్‌స్టార్లు నయనతార, విజయ్‌ సేతుపతితో కలిసి పనిచేయడం మంచి థ్రిల్‌ పంచింది. ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. అందరినీ నవ్విస్తుందనే నమ్మకం నాకు ఉంది.

* ఇటీవల మీరు చూసిన వెబ్‌ సిరీస్‌ ఏంటి?

సమంత: ‘మారే ఆఫ్‌ ఈస్ట్‌టౌన్‌’ని చూశాను. చాలా బాగుంది. కేట్‌ విన్ల్సెట్‌ నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల నేను ఎంజాయ్‌ చేసిన గొప్ప వెబ్‌ సిరీస్‌ ఇది.

* మీ తదుపరి చిత్రాలు?

సమంత: ఇప్పటి వరకు ప్రకటించిన చిత్రాలే తప్ప కొత్త కథల్ని వినలేదు. కొన్ని రోజులు విరామం తీసుకుని, ఆ తర్వాత స్క్రిప్టుల్ని వినాలనుకుంటున్నా. ( ప్రస్తుతం..గుణ శేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’, విఘ్నేశ్‌ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్‌’ సినిమాలు చేస్తున్నారామె).



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని