Vaishnav Tej: అంతా నన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంటోంది: వైష్ణవ్‌ తేజ్‌ - telugu news actor vaishnav tej interview about kondapolam
close
Published : 07/10/2021 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaishnav Tej: అంతా నన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంటోంది: వైష్ణవ్‌ తేజ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉప్పెన’తో తొలి పరిచయంలోనే మంచి నటుడిగా వైష్ణవ్‌ తేజ్‌ మంచి గుర్తింపు పొందాడు. యువతలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు. ఆయన చేసిన రెండో ప్రయత్నం ‘కొండపొలం’. క్రిష్‌ దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవలాధారంగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా వైష్ణవ్‌ తేజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ ఆసక్తికర విశేషాలివీ..

సందేశం.. కమర్షియల్‌ హంగులు

నేనెప్పుడూ ‘కొండపొలం’ గురించి వినలేదు. అందుకే కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఫాంటసీ ఎలిమెంట్స్‌ బాగా నచ్చాయి. ఇలాంటి ఓ మంచి కథని ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుని, వెంటనే ఓకే చేశా. సందేశంతోపాటు కమర్షియల్‌ హంగులూ మెండుగా ఉన్న కథ ఇది. జీరో నుంచి హీరో అయ్యే ఓ చురుకైన కుర్రాడి జీవితమిది. అడవి అంటే అతనికి బాగా ఇష్టం. దాని కోసం అతడేం చేశాడు? ఓబులమ్మ (రకుల్‌)తో ప్రేమ.. తదితర అంశాలు తెరపై చూస్తేనే బాగుంటుంది. క్రిష్‌ టేకింగ్‌ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. క్రిష్‌ తెరకెక్కించిన వాటిల్లో ‘గమ్యం’, ‘వేదం’ చిత్రాలు నాకు బాగా ఇష్టం. నా రెండో చిత్రానికే కీరవాణిగారు స్వరాలు అందించడం మరిచిపోలేని జ్ఞాపకం. ఆయన తనయుడు కాల భైరవ నాకు మంచి స్నేహితుడు. 

టెన్షన్‌ పడ్డా..

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్క్‌షాష్‌ నిర్వహించలేదు. డైరెక్టర్‌ ఎలా చెబితే అలా నటించా. పాత్రలో ఒదిగిపోయేందుకు కొన్ని రోజులు యాస ప్రాక్టీస్‌ చేశా. నా తొలి సినిమా (ఉప్పెన)కి దర్శకుడు, కథానాయిక కొత్తవారే కాబట్టి చాలా సరదాగా షూటింగ్‌ చేశాం. కానీ, ఈ సినిమాలో నటించేందుకు కొంచెం టెన్షన్ భయపడ్డా. ఎందుకంటే ఈ చిత్ర బృందమంతా సీనియర్లే. దర్శకుడు క్రిష్‌, సంగీత దర్శకుడు కీరవాణి, కథానాయిక రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. ఇలా అంతా అనుభవం ఉన్న వారే. కోట శ్రీనివాసరావుగారు ఇప్పటికీ అదే ఎనర్జీ చూపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన నటన చూసి ఆశ్చర్యపోయాను. సాయిచంద్‌గారు నటన అందరినీ మెప్పించేలా ఉంటుంది. వారి దగ్గర నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. అడవి గొప్పతనం, చెత్తని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా నిర్దేశించిన స్థలంలోనే వేయాలని ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా తెలిసొచ్చింది.

ఎవరినీ అడగను..

రొటీన్‌కి భిన్నంగా సాగే కథలంటే నాకు ఇష్టం. అందులోనూ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండాలనుకుంటా. ప్రభాస్‌ అన్న విలన్లని ఇలా కొడితే బాగుంటుంది, మహేశ్‌ బాబు గారు అలా కొడితే బాగుంటుందని నేను ఎలా అనుకుంటానో నా అభిమానులూ అలానే అనుకుంటారు కదా! మా కుటుంబంలో ఇంతమంది నటులున్నా నా చిత్రాల గురించి వారి దగ్గర ప్రస్తావించను. నాకు చాలా సిగ్గు. అందుకే ఫలానా కథ విన్నాను.. ఎలా ఉంది? అని ఎవరినీ అడగను.

చిత్రీకరణ దశలో..

కొవిడ్‌/లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌ చేశాం. ఎన్నో కొండలు ఎక్కాం, వాహనాలేవీ అందుబాటులో లేకపోవడంతో షూటింగ్‌ స్పాట్‌కి నడిచే వెళ్లాం. దీనికంటే రోజంతా మాస్క్‌ ధరించడమే కష్టమనిపించింది. మాస్క్‌ పెట్టుకోవడం వల్ల ఊపిరి సరిగా ఆడేది కాదు. తర్వాత అది అలవాటైంది. గొర్రెలపై సన్నివేశాలు చిత్రీకరించేటపుడు వాటి భాషని అర్థం చేసుకోలేకపోయా. వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని కొన్నాళ్లకి తెలిసింది. అలా గొర్నెల్ని కంట్రోల్‌ చేశా.

నేను ఊహించలేదు..

‘రిపబ్లిక్’ చిత్రంలో అన్నయ్య (సాయిధరమ్‌ తేజ్) ఐఏఎస్‌గా కనిపించాడు, ‘కొండపొలం’ సినిమాలో నేను ఐఎఫ్ఎస్‌గా కనిపిస్తా. అంతమాత్రాన ఈ రెండు చిత్రాలకి సంబంధం ఉండదు.అన్నయ్య ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే మన ముందుకు వస్తాడు. మా మామయ్యలు, అన్నయ్యకు ఇమేజ్ రావడం నేను చూశాను. కానీ, నాకూ ఓ ఇమేజ్‌ అంటూ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అంతా నన్ను చూస్తోంటే సిగ్గుగా ఉంటోంది! (నవ్వుతూ..)

తప్పకుండా నటిస్తా..

వెబ్‌ సిరీస్‌ అవకాశాలు ఇప్పటి వరకు రాలేదు. వస్తే తప్పకుండా నటిస్తా. ప్రస్తుతం గిరి సాయి (తమిళ ‘అర్జున్ రెడ్డి’ ఫేం) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. పాత్ర డిమాండ్‌ మేరకు రెండు చిత్రాల్లోనూ కాస్త డీ గ్లామర్‌గా కనిపించిన నేను ఇందులో కొత్తగా కనిపిస్తా. ఈ కథ రొమాంటిక్‌- కామెడీ నేపథ్యంలో సాగుతుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని